అత్యుత్తమ విధానాలు, మౌలికవసతుల లభించింది: విసి రవీందర్
మన తెలంగాణ/హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మక ఐఎస్‌ఓ ధృవీకరణ సాధించింది. ఆయా విభాగాల్లో అత్యుత్తమ విధానాలు, కార్యకలాపాలు, మౌళికవసతులకు ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నాలుగు రోజుల పాటు రెండు దశల్లో గుర్తింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఆసంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి శివయ్య నేతృత్వంలోని అనుభవజ్ఞులైన బృందాలు 53 విభాగాలు, వివిధ పరిశోధనా కేంద్రాలు, కార్యాలయాలు, సెల్‌లలో విస్తృతంగా పర్యటించి ఆడిట్ నిర్వహించారు. నాలుగు రోజుల ఆడిట్ అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం వివిధ విభాగాల్లో ఐఎస్‌ఓ గుర్తింపు సాధించింది.
విద్య, పరిపాలన,పర్యావరణ సుస్థిరత, నాణ్యతా ప్రమాణాలలలో శ్రేష్ఠతను కనబరిచి అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది. ఎనర్జీ ఆడిట్ – ఐఎస్‌ఓ పచ్చదనం, పర్యావరణ ఆడిట్ , నాణ్యతా ప్రమాణాలు, అకడమిక్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆడిట్ , జెండర్ సెన్సిటైజేషన్ విభాగాల్లో లభించిన ఐఎస్‌ఓ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని ఓయూ ఉపకులపతి ఆచార్య దండెబోయిన రవీందర్ యాదవ్, రిజిస్ట్రార్ ఆచార్య పి. లక్ష్మీనారాయణలు అందుకున్నారు. ఈ మేరకు ఆడిట్ ను విజయవంతంగా నిర్వహించిన ఐక్యూఏసీ డైరెక్టర్ ఆచార్య బి. శిరీష, నోడల్ అధికారి డాక్టర్ జె. ఉపెందర్, కో ఆర్డినేటర్ డాక్టర్ ఎ. విజయభాస్కర్ రెడ్డి తో పాటు క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాల్స్, డిన్స్, ఆయా విభాగాల అధిపతులు, అధ్యాపకులు, సిబ్బందిని ప్రొఫెసర్ రవిందర్ యాదవ్ అభినందించారు. అత్యుత్తమ విధానాల అమలు, కార్యకలాపాల ద్వారా మరిన్ని గుర్తింపులు సాధించేలా కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.