చైనాలో నిర్బంధశిబిరాలపై వార్తాకథనాలు
న్యూయార్క్ : భారతీయ సంతతికి చెందిన యువ మహిళా జర్నలిస్టు మేఘా రాజగోపాలన్‌కు ప్రతిష్టాత్మక పులిట్జర్ పురస్కారం దక్కింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కాంట్రిబ్యూటర్లు కూడా ఈ అవార్డును సంయుక్తంగా పొందారు. చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో వేలాది మంది ఉఘైర్ ముస్లింలను నిర్బంధించి వెలిసిన సామూహిక డిటెన్షన్ సెంటర్లపై ఆమె ఇతరులతో కలిసి పరిశోధనాత్మక వార్తలు వెలువరించారు . ఈ అనధికారిక బందీఖానాలలో ఉన్న స్థితిగతులను తన వార్తాకథనాలతో అత్యద్భుతంగా వివరించారు.
కల్లోలిత జిన్జియాంగ్ ప్రాంతంలో ముస్లింలు అణచివేతకు గురి కావడం, వారు చిరకాల నిర్బంధ జీవితం గడపడం వంటి పరిణామాలు, ఈ విషయాలు వెలుగులోకి రాకుండా చూడటం వంటి అంశాలను మేఘా తన ఇద్దరు సహచరులతో కలిసి అతి కష్టం మీద సమాచారం సేకరించుకుని నిజాలను పొందుపర్చినందున ఈ పురస్కారం విజేతగా ప్రకటిస్తున్నామని కమిటీ వారు తెలిపారు. అమెరికాలో అత్యున్నత స్థాయి జర్నలిజం అవార్డుగా పులిట్జర్‌ను అందిస్తున్నారు.. రాజగోపాలన్ బజ్‌ఫీడ్ న్యూస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక స్థానిక విషయాల రిపోర్టింగ్‌కు సంబంధించి టాంపా బే టైమ్స్‌కు చెందిన నీయిల్ బేడికి పులిట్జర్ అవార్డు లభించింది.
పరిశోధనాత్మక జర్నలిజంలో ఎన్నో కష్టాలు
వాస్తవాలను బయటకు రానివ్వని చైనాలోజిన్జిజియాంగ్ ప్రాంతంలో ముస్లింల దుర్భర పరిస్థితిని ఆవిష్కరించాలని మరో ఇద్దరు కాంట్రిబ్యూటర్లతో రంగంలోకి దిగిన దశలో మేఘా పలు కష్టాలు అనుభవించారు. చైనా ఈ బృందంపై నిషేధం విధించింది. దీనితో పొరుగున ఉన్న కజికిస్థాన్‌కు బృందం వెళ్లింది. అక్కడ పలువురు చైనా ముస్లింలు శరణార్థులుగా ఉన్నారు. వారి ద్వారా వాస్తవాలను సేకరించారు.
ముస్లింలను ఉంచిన క్యాంప్‌లు చుట్టూ కందకాలు, లోపలికి ఎవరూ ప్రవేశించకుండా కరకు ఏర్పాట్లు, కంచుకోటల వంటి కట్టడాల వెనుక వారి ఆర్తనాదాలను ప్రపంచానికి తొలిసారిగా తెలియచేసేందుకు వీలేర్పడింది. లండన్ కేంద్రంగా ఉన్న బజ్‌ఫీడ్ న్యూస్ సంస్థ తరఫున మేఘా గతంలో చైనా, థాయ్‌లాండ్‌ల నుంచి కూడా కరస్పాండెంట్‌గా వ్యవహరించారు. ఉత్తర కొరియా అణు సంక్షోభం నుంచి అఫ్ఘనిస్థాన్‌లో శాంతి ప్రక్రియ వరకూ పలు అంశాలను వెలుగులోకి తెచ్చారు. మె వార్తలు పలు భాషలలోకి తర్జుమా అయ్యాయి. మానవ హక్కుల అవార్డు, మిర్రర్ అవార్డు వంటివి అనేకం ఆమెను వరించాయి. శ్రీలంకలో మతపరమైన హింసాకాండ కూడా ఆమె పరిశోధనాత్మక జర్నలిజంతో వెలుగులోకి వచ్చింది.