Wednesday, January 22, 2025

టైటాన్ శకలాల్లో మానవ అవశేషాలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో 13 వేల అడుగుల లోతులో మునిగిపోయిన టైటానిక్ నౌక శిధిలాలను చూడడానికి ఐదుగురి ప్రయాణికులతో బయల్దేరిన టైటాన్ అనే మినీ జలాంతర్గామి సాహసయాత్ర విషాదాంతమైన సంగతి తెలిసిందే. ఈ జలాంతర్గామి శకలాలు బుధవారం తీరానికి చేరాయి. కెనడా లోని న్యూపౌండ్ లాండ్ అండ్ లాబ్రడార్ ప్రావిన్స్ లోని సెయింట్ జాన్స్ ఓడరేవుకు బుధవారం వాటిని తీసుకువచ్చారు. మానవ అవశేషాలుగా వీటిని అనుమానిస్తున్నారు. అమెరికాకు చెందిన వైద్య నిపుణులు వీటిని విశ్లేషించనున్నారని అమెరికా కోస్ట్ గార్డ్ వెల్లడించింది. ఈ ప్రమాదానికి కారణాలేమిటో తెలుసుకోడానికి జరుగుతున్న దర్యాప్తులో ఇది కీలక పరిణామమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. వీటిని పరిశీలించిన తరువాత ప్రమాదం జరిగిన తీరు, వాళ్లెలా చనిపోయారన్న దానిపై ఓ అంచనాకు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

టైటాన్ జలాంతర్గామిలో ఈ యాత్రను నిర్వహించిన ఓషన్ గేట్ సంస్థ సీఈఒ స్టాక్టన్ రష్, పాకిస్థానీ బిలియనీర్ షాజాదా దావూద్‌తోపాటు ఆయన కుమారుడు సులేమాన్, యూఏఈలో ఉంటున్న బ్రిటిష్ వ్యాపార వేత్త హమీష్‌హార్డింగ్, ఫ్రెంచ్ మాజీ నౌకాదళ అధికారి పాల్ హెన్రీ ఉన్నారు. ఈనెల 18న బయలుదేరిన ఈ మినీ జలాంతర్గామి గల్లంతైన కొన్ని గంటలకే విచ్ఛిన్నమైందనే అంచనాలు వెలువడ్డాయి. ఈ జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ ఉంది. అయితే సాగర గర్భం లోకి వెళ్లిన గంటా 45 నిమిషాల తరువాత టైటాన్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో దీని జాడ కోసం కెనడా, అమెరికా దళాలు నాలుగు రోజుల పాటు సాగర గర్భంలో శోధించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. సముద్రం లోని ఒత్తిడి వల్లనే టైటాన్ పేలిపోయిందని భావిస్తున్నారు.

ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలను గుర్తించడానికి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడడానికి ఎంతో కృషి అవసరమని, ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతోన్న కెప్టెన్ జేసన్ వెల్లడించారు. ఈ సాహస యాత్రలో సులేమాన్ స్థానంలో అతడి తల్లి క్రిస్టిన్ దావూద్ వెళ్లాల్సి ఉన్నా కుమారుడి ఆసక్తిని గమనించి ఆమె వెనక్కు తగ్గారు. ఈ విషయాన్ని ఆమె మీడియాకు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News