ఐరాస మండలిని కోరిన మానవ హక్కుల చీఫ్ మిచెల్లే బ్యాచ్‌లెట్
జెనీవా: తాలిబన్ల ఆధీనంలోని అఫ్ఘన్ ప్రాంతాల్లో హింస పెచ్చుమీరిందని, పౌరులతోపాటు ఆయుధాలు వీడిన సైనికుల్ని హతమారుస్తున్నారని ఐక్యరాజ్యసమితి(ఐరాస) మానవ హక్కుల చీఫ్ మిచెల్లేబ్యాచ్‌లెట్ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కుల రక్షణకు సాహసోపేత చర్యలు చేపట్టాలని ఐరాస మానవ హక్కుల మండలిని ఆమె కోరారు. హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు జరపాలని ఆమె సూచించారు. తమ భద్రత కోసం అఫ్ఘన్ పౌరులు మండలి జోక్యానికి ఎదురు చూస్తున్నారని ఆమె అన్నారు. తాలిబన్ నేతలు పౌరుల హక్కులకు హామీ ఇచ్చి, నిలబెట్టుకోకపోవడంతో పెద్దసంఖ్యలో అఫ్ఘన్లు ఆ దేశాన్ని వీడేందుకు పరుగుతీస్తున్నారని, దాంతో కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం నెలకొన్నదని ఆమె గుర్తు చేశారు. గతంలోవలె తాలిబన్లు అఫ్ఘన్‌ను క్రూర పాలనలోకి తీసుకువెళ్తారన్న భయాందోళనలు నెలకొన్నాయని ఆమె అన్నారు.