Thursday, January 23, 2025

విద్వేష ప్రసంగాల నివారణ బాధ్యత టీవీ యాంకర్లదే

- Advertisement -
- Advertisement -

Prevention of hate speech is the responsibility of TV anchors

టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలపై కోర్టు అసహనం

న్యూఢిల్లీ : దేశంలో టీవీ ఛానళ్ల పనితీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన మాధ్యమంగా ఉన్న ఇవి తరచూ విద్వేష ప్రసంగాలకు వేదికగా మారుతున్నప్పటికీ ఎలాంటి శిక్షలను ఎదుర్కోకుండానే తప్పించుకుంటున్నాయని ఆక్షేపించింది. వీటిపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించింది. టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో యాంకర్ పాత్ర అత్యంత కీలకమని సర్వోన్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. విద్వేష ప్రసంగాల కారణంగా జరిగిన ఘర్షణలకు సంబంధించి గత ఏడాది నుంచి దాఖలైన అనేక పిటిషన్లపై జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వం లోని ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టీవీ ఛానళ్ల పనితీరు, పాత్రపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎందుకు అవి ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తాయో వివరిస్తూ కొన్ని నమ్మకాల ఆధారంగా అవి మనల్ని కట్టిపడేస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. “ మనదేశం ఎటువైపు వెళ్తోంది. మీడియా, సోషల్ మీడియాలో చాలా విద్వేష పూరిత ప్రసంగాలు వస్తున్నాయి. వీటిపై ఎలాంటి నియంత్రణ లేకుండా పోతోంది.టీవీ ఛానళ్లలో విద్వేష ప్రసంగాలను అరికట్టడంలో టీవీ యాంకర్లకు పెద్ద బాధ్యత ఉంటుంది. చర్చల్లో టీవీ యాంకర్లు అతిథికి కూడా సమయం ఇవ్వరు.

మీడియా స్వేచ్ఛ ముఖ్యమైనదే కానీ, దానికి ఓ లక్ష్మణ రేఖ ఉంటుందని గుర్తుంచుకోవాలి. అతిథులు ఆ గీతను దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాంకర్లదే. విద్వేషాన్ని సమాజం లోకి వదిలేయకూడదు ” అని కోర్టు వ్యాఖ్యానించింది. ఒకరి ప్రాణాలు తీసేలా విద్వేష ప్రపంగం పొరలుపొరలుగా విషంలా వ్యాపిస్తోందని, దీంతో అనేక మార్గాలు అనుసరించవచ్చని, మెల్లగా లేదా ఇంకోలా చేయవచ్చని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఇలాంటి వాతావరణంపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటోందని న్యాయస్థానం ఈ సందర్భంగా ప్రశ్నించింది. విద్వేష ప్రసంగాల నుంచి రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారని, అందుకని టీవీ ఛానళ్లు వేదికగా మారుతున్నాయని ధర్మాసనం ఆగ్రహించింది. వీటిపై కఠినమైన నియంత్రణ యంత్రాంగం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. అయితే ప్రభుత్వం వీటిపై వ్యతిరేక వైఖరి తీసుకోకూడదని, కానీ కోర్టుకు సహకరించాలని సూచించింది. ఈ పిటిషన్లపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలంటూ కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నవంబరు 23 వ తేదీకి వాయిదా వేసింది.

విద్వేష ప్రసంగాలను అరికట్టడానికి లా కమిషన్ సూచించిన సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తన వైఖరి వెల్లడించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. విద్వేష ప్రసంగాల నివారణకు నిర్దిష్టమైన నిబంధనలను సూచిస్తూ 2017లో ప్రభుత్వానికి లా కమిషన్ నివేదిక సమర్పించింది. విద్వేష ప్రసంగాలపై దేశంలో ఏ చట్టంలో స్పష్టంగా పేర్కొనలేదు. అయితే వీటిని నివారించడానికి చట్టపరమైన కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. విద్వేషాన్ని ప్రేరేపించే చర్యలను నిషేధించడానికి 153 సి, కొన్ని కేసుల్లో భయం, హెచ్చరిక, హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగాలుంటే 505 ఎ వంటి కొత్తసెక్షన్లు ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News