Tuesday, November 5, 2024

పౌష్టికాహార సమృద్ధి వల్లనే దేశంలో క్షయ మరణాల నివారణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం లోని క్షయవ్యాధి పీడిత కుటుంబాలు ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పౌష్టికాహారాన్ని నెలమొత్తం తీసుకుంటే సగానికి సగం కేసులను మరణాలను తగ్గించవచ్చని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ లోని అధ్యయనం వెల్లడించింది. ఝార్ఖండ్ లోని నాలుగు జిల్లాల్లో జాతీయ క్షయ నివారణ కార్యక్రమం కింద 28 టిబి యూనిట్ల నుంచి మొత్తం 2800 మంది క్షయరోగులను అంతర్జాతీయ పరిశోధకుల బృందం తమ అధ్యయనం లోకి తీసుకుని పరిశీలించింది. ఈ రోగులందరికీ నెలవారీ మొత్తం 10 కిలోల ఆహార దినుసులు ( బియ్యం,పప్పుధాన్యాలు, పాలపొడి, నూనె) , ఆరునెలలకు సరిపడే మల్టీ విటమిన్లు అందుతున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఎంపికైన గ్రూపులో ఒక్కొక్కరికి నెలవారీ 5 కిలోల బియ్యం, 1.5 కిలోల పప్పుధాన్యాలు అందాయి. క్షయపీడితులైన కుటుంబ సభ్యులను సమీక్షించిన తరువాత 2022 జులై 31 వరకు ప్రాథమిక ఫలితాలను విశ్లేషించారు.

2019 ఆగస్టు 2021 జనవరి మధ్యకాలంలో 10,345 మంది కుటుంబ క్షయ రోగులని అధ్యయనం చేయగా, వారిలో 5621 కుటుంబీకుల్లో 5328 ( 94.8 శాతం) మంది ఎంపికైన గ్రూపు, కంట్రోల్ గ్రూపు లోని కుటుంబీకులు 4724 మంది కాగా, 4283 ( 90.7 శాతం ) మంది ఎంపికైన గ్రూపు వారు. వీరందరికీ క్షయ అధ్యయన ప్రాథమిక ఫలితాల సమీక్ష పూర్తయింది. మొత్తం జనాభాలో రెండింట మూడొంతుల మంది సంతాల్, హో, ముండా, ఓరయోన్, భుమిజ్ వంటి స్వదేశీ తెగల వారు 34 శాతం వరకు అంటే 10,345 మందిలో 3543 మంది వరకు పోషకాహార లోపంతో ఉన్నవారే. అయితే ఈ కుటుంబాల్లో పోషకాహారం బాగా సమకూర్చితే అన్ని రకాల టిబి కేసులు 40 శాతం వరకు, టిబి ఇన్‌ఫెక్షన్ కేసులు దాదాపు 50 శాతం వరకు తగ్గిందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. రోగుల్లో సగానికి సగం మంది తీవ్రమైన పోషకాహార కొరతతో ఉన్నవారేనని అధ్యయనం పేర్కొంది.

క్షయవ్యాధి చికిత్సలో రోగులను కాపాడడానికి ఆహారం అన్నది చాలా ముఖ్యమని పరిశోధకులు మంగళూరుకు చెందిన యెనెపొయ మెడికల్ కాలేజీ సెంటర్ ఫర్ న్యూట్రిషన్ స్టడీస్ ప్రొఫెసర్ అనురాగ్ భార్గవ్ పేర్కొన్నారు. నెలవారీ పౌష్టికాహారాన్ని అందించడం వల్ల రోగులు తిరిగి తమ శారీరక బరువును తగినంతగా రెండు నెలల్లో పుంజుకున్నారని చెప్పారు. వీరిలో మరణాల రేటు కూడా 35 నుంచి 50 శాతం వరకు తగ్గిందని పేర్కొన్నారు. దేశంలో 2021లో 3 మిలియన్ టీబీ కేసులు బయటపడగా, వీటిలో 4,94,000 టీబీ మరణాలు హెచ్‌ఐవి నెగిటివ్‌కు సంబంధించినవే. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమం ప్రకారం 2025 నాటికి క్షయ కేసులను 80 శాతం వరకు , క్షయ రోగుల మరణాలను 90 శాతం వరకు తగ్గించాలని లక్షంగా నిర్ణయించడమైంది. ఈ పరిశోధకుల బృందంలో కెనడా మెక్‌గిల్ యూనివర్శిటీ, చెన్నై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చి ఇన్ ట్యుబెర్‌క్యులోసిస్, బెంగళూరు నేషనల్ ట్యుబెర్‌క్యులోసిస్ ఇన్‌స్టిట్యూట్, రాంచీ స్టేట్ టిబి సెల్‌కు చెందిన పరిశోధకులు పాలుపంచుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News