ధరల పెరుగుదల అనడం కంటే ‘పరుగు’దల అనడమే వాస్తవమనిపిస్తున్నది. గత కొన్ని సంవత్సరాలుగా దేశంలో ధరలు స్థిరంగా వొక చోట నిలబడిన పరిస్థితులు లేవు. బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధారణ ప్రజల జీవన వ్యయం అసాధారణంగా పైకి ఎగబాకడం మామూలైపోయింది. ప్రజల జీవితాలను దుర్భరం చేస్తున్న అధిక ధరలను దారికి తెచ్చే ఆయుధమేదీ దాని వద్ద లేదు. అధిక ధరలపై పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేని దుస్థితిలో కేంద్ర ప్రభుత్వం యిరుక్కున్నది. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్‌కు కొవిడ్ వచ్చినందున అధిక ధరలపై చర్చను చేపట్టలేకపోతున్నామని చెప్పుకోవలసి వచ్చింది.
ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జిఎస్‌టి విధింపు మీద చర్చకు పట్టుబడుతూ ప్లకార్డులు పట్టుకొని తన వేదిక వద్దకు దూసుకు వచ్చినందుకు సోమవారం నాడు లోక్‌సభ స్పీకర్ నలుగురు కాంగ్రెస్ సభ్యులను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అంతకు ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తే సహించబోమని ప్రకటించారు. ధర్నాలను, ప్లకార్డులను అనుమతించబోమని వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాడానికి ముందే పార్లమెంటు అధికారులు ప్రత్యేక బులెటిన్ల ద్వారా హెచ్చరించి వున్నారు. దానిని యిప్పుడు అమల్లో పెట్టారు. సస్పెండ్ అయిన కాంగ్రెస్ ఎమ్‌పిలలో యిద్దరు మహిళలున్నారు. అణగారిన వర్గానికి చెందిన మహిళ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే బలహీన వర్గాల మహిళా ఎమ్‌పి లిద్దరిని సభ నుంచి సస్పెండ్ చేయడం దురదృష్టకరమని బిఎస్‌పి ఎమ్‌పి వొకరు ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. నిర్మలా సీతారామన్ సభకు రాలేకపోయినందున ధరలపై చర్చను చేపట్టలేకపోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
తప్పనిసరి కారణాలపై సంబంధిత మంత్రి సభకు హాజరు కాలేనప్పుడు, యితర మంత్రులో, అంశం ప్రాధాన్యాన్ని బట్టి స్వయంగా ప్రధాని మంత్రో సమాధానం చెప్పే ఆనవాయితీని కూడా బిజెపి పాలకులు పాటించకపోడం గమనార్హం. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి అధిక ధరలు, ప్యాక్డ్ నిత్యావసరాలపై జిఎస్‌టి పెంపు సమస్యల మీద చర్చకు ప్రభుత్వం సిద్ధపడకపోవడంతో సభలు సజావుగా సాగడం లేదు. దేశంలో టోకు ధరలు 30 యేళ్లలో యెన్నడూ లేనంత వేగంగా పెరుగుతున్నట్టు రుజువైంది. ఇంకొక వైపు ప్రభుత్వం ఆదాయం పెంచుకోడానికి ప్రజలపై అదే పనిగా పన్నులు వేయడంలో సామ్రాజ్యవాదులను సైతం మించిపోయింది. మొన్నటి జిఎస్‌టి పెంపు విన్యాసాలు దీనినే రుజువు చేశాయి. తొలుత కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ల వైపరీత్యంతో పరిశ్రమలు మూతపడి ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నది.
భారీ సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి, వృద్ధి ఆగిపోయింది. ఆ తర్వాత వుక్రెయిన్ -రష్యా యుద్ధం వల్ల క్రూడాయిల్ దిగుమతి ఖర్చు విపరీతంగా పెరిగిపోయినందున దేశంలో ధరలు మిన్నంటాయి. అయితే దేశంలోని దొంగ నిల్వలను వెలికి తీసి సరఫరాను మెరుగుపరిస్తే కొంతైనా శాంతించి వుండవలసిన వంట నూనెల ధరలు సంవత్సరాల తరబడి హద్దు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. ఇటీవల మిగతా శాక తైలాలు స్వల్ప మాత్రంగా శాంతించినా వేరుశెనగ నూనె ధర యింకా పైనే వుండి ఆకాశ విహారం చేస్తున్నది. టోకు ధరలు మొన్న మే నెలలో అంతకు ముందు సంవత్సరం అదే సమయంలో కంటే 15.88 శాతం అధికంగా వున్నాయి. వరుసగా 14వ నెల రెండంకెలలో కొనసాగాయి.
1991సెప్టెంబర్ తర్వాత యింత యెక్కువగా పేట్రేగడం యిదే తొలిసారి. ఐదారు సంవత్సరాలుగా గోధుమ విరగ పండుతున్నా దేశంలో దాని ధర చెట్టెక్కి కూర్చోడం దారుణం. నిల్వలు పేరుకుపోయాయన్న కారణం చూపి ప్రభుత్వం గోధుమ సేకరణను తగ్గించి వేయగా, దానిని ప్రైవేటురంగం భారీగా సేకరించి నిల్వ చేస్తున్నది. కృత్రిమ కొరత సృష్టించి లాభాలు చేసుకోజూస్తున్నది. గత యేడాది రబీలో 102 లక్షల టన్నుల గోధుమ సేకరించిన ప్రభుత్వం యీ యేడాది అదే కాలంలో 32 శాతం తక్కువగా 69.24 లక్షల టన్నులే కొనుగోలు చేసింది. అదే సమయంలో ఐటిసి, అదానీ విల్మర్, హిందూస్థాన్ యూనిలివర్ వంటి ప్రైవేటు కంపెనీలు గోధుమను విపరీతంగా సేకరించి నిల్వ వుంచుకొంటున్నాయి. ప్రభుత్వం ధరలను తగ్గించదలచుకోలేదు. ప్రైవేటు రంగం దయాదాక్షిణ్యాలకు వదిలివేయదలచింది.
అతి పరిమితంగానే పేదలకు యిస్తున్న ఉచిత ఆహార ధాన్యాల పధకాన్ని కూడా రేపు సెప్టెంబర్‌తో ఎత్తి వేయబోతున్నది. ఈ నేపథ్యంలో దానిని 2023 మార్చి నెల వరకు కొనసాగించాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. పేద, సాధారణ జనం అత్యధికంగా గల మన దేశంలో ప్రైవేటు దోపిడీ మితిమించకుండా చూడడానికే, దాని నుంచి ప్రజలను కాపాడడానికే సంక్షేమ వ్యూహాన్ని గతం లో దశాబ్దాల పాటు పాటించారు. ప్రధాని మోడీ ప్రభుత్వం దానికి సమూలంగా కత్తెర వేసి కాకులపై గద్దలను స్వేచ్ఛగా వదిలిపెట్టింది. మితిమించి పెరిగిపోయిన ధరలపై పండుగల సీజన్‌కి ముందు సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రతిపక్షాలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్నది.