Monday, January 20, 2025

మద్దతుకు మించి..

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో పలు రకాల పంటల ధరలు రైతాంగాన్ని ఆశలపల్లకిలో విహరింప చేస్తున్నాయి. వాతావరణ అనుకూలత, ప్రభుత్వ ప్రోత్సాహం ఈసారి రాష్ట్రంలో వానాకాల సీజన్‌లో పంటల సాగు సాధారణ విస్తీర్ణం కంటే మించి 154శాతం సాగులోకి వచ్చింది. ముతక ధాన్యాలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు, పత్తి చెరకు తదితర వాణిజ్య పంటలు అన్ని కోటి 36లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పంట దిగుబడులు కూడా ప్రారంభమయ్యాయి. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి పంటలే అధికశాతం విస్తీర్ణంలో సాగులోకి వచ్చాయి. ఈ మూడు పంటలు కలిపి కోటి 20లక్షల ఎకరాల్లో సాగు చేశారు. పత్తి పంట కోతలు జోరుగా సాగుతున్నాయి. పొలంలో ఏరిన పత్తిని ఏరినట్టుగా రైతులు మార్కెట్లకు తెస్తున్నారు. రాష్ట్రంలో 50లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరిగింది.

అధిక వర్షాలతో ప్రారంభ దశలో పత్తి పైర్లు కొన్ని పాంతాల్లో దెబ్బతిన్నా , మెరుగైన సస్యరక్షణ చర్యలు , చురుకైన యాజమాన్య పద్ధతులతో దెబ్బతిన్న పైర్లు కూడా తిరిగి కోలుకున్నాయి. పంట దిగుబడి కొంత తగ్గినా , మార్కెట్లో తెల్ల బంగారం ధరలు మెరిసిపోతున్నాయి. గత ఏడాది ప్రారంభంలో క్వింటాలు ధర రూ.7వేలనుంచి మొదులు కాగా, ఈ సీజన్‌లో కూడా అదే ఊపుతో మార్కెట్ ప్రారంభమయ్యింది. రాష్ట్రంలోని ప్రధాన పత్తి మార్కెట్లలో క్వింటాలు పత్తి ధర రూ.9350 నుంచి రూ.9500గా కొనసాగుతొంది. అంతర్జాతీయంగా పత్తికి డిమాండ్ పెరగటంతో వ్యాపారులు పోటీలు పడి పత్తి కోనుగోళ్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దుతు ధరలు అమలు చేస్తోంది.

ఈ ఏడాది మద్దతు ధరలు పొడవు పింజ రకానికి క్వింటా రూ. 6380, సాధారణ రకానికి రూ.6080చొప్పున ధరలు నిర్ణయించింది. సిసిఐ ద్వారా రైతులు నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేస్తోంది. అయితే ఈసారి బహిరంగ మార్కెట్లలోనే మద్దతు ధరలకంటే రూ.3వేలకు పైగా అధిక ధరలు లభిస్తుండటంతో పత్తి రైతులు సిసిఐ కొనుగోలు కేంద్రాల వైపు చూడటం లేదు. గత ఏడాది పత్తి ధరలు గరిష్టంగా రూ.13000కు చేరాయి. ఈసారి కూడా పత్తి ధరలు ఆదేజోష్‌తో పెరుగుతాయన్న ఆశాభావం రైతుల నుంచి వ్యక్తమవుతోంది. చాల మంది రైతులు పత్తిని మంచి ధర వచ్చేదాక నిల్వచేసుకునేందుకు మొగ్గుతున్నారు.

మురిపిస్తున మక్కల ధరలు

రాష్ట్రంలో ఈసారి ప్రారంభంలోనే మక్కల ధరలకు రైతులను ఊరిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధాన ఆహార పంటల్లో వరితరువాత స్థానం మొక్కజొన్నదే. ఈ వానాకాలం మక్కల సాధారణ సాగు విస్తీర్ణంలో 76శాతం మాత్రమే సాగు జరిగింది. రాష్ట్రమంతటా కలిపి 6.21లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగింది. పంట కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు కనీస మద్దతు ధర క్వింటాలుకు గత ఏడాది రూ. 1870 అములు చేయగా , ఈ ఏడాది రూ.1962కు పెంచింది. బహిరంగ మార్కెట్‌లో మక్కల ధర మద్దతు ధరలకంటే అధికంగానే లభిస్తోంది .క్వింటాలుకు రూ.2200 ధరపెట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మక్కల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని త్వరలోనే క్వింటాలు రూ.2500చేరుకునే అవకాశాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి వుంటే ఎకరానికి సగటున 20క్వింటాళ్లకుపైగా పంట దిగుబడి లభిస్తుంది. అయితే అధిక వర్షాలతో పంట దిగుబడి పలు జిల్లాల్లో 10క్వింటాళ్లకు మించటం లేదని రైతులు చెబుతున్నారు. పంట దిగుబడి తగ్గినా మార్కెట్లో పెరుగుతున్న ధరలతో రైతులు ఊరటపొందుతున్నారు.

సన్నాలకు పెరిగిన గిరాకి!

దక్షిణభారత ధాన్యాగారంగా పేరొందుతున్నతెలంగాణ రాష్ట్రంలో వరిపంట కోతలు జోరుమీద సాగుతున్నాయి. రాష్ట్రంలో ఈ వానాకాలం 64.54లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. అందులో సన్నరకాలు కూడా గణనీయమైన స్థాయిలోనే సాగు చేశారు.జైశ్రీరాం, బిపిటి, హెచ్‌ఎంటి, ఆర్‌ఎన్‌ఆర్ తదితర రకాలు పంట దిగుబడి తగ్గినా ధరలు మాత్రం రైతులకు ధీమా కల్పిస్తున్నాయి. దొడ్డు రకాలైతే ఎకరానికి 28క్వింటాళ్లకు పైగా దిగుబడి లభిస్తోంది. సన్నరకాలు ఎకరాని 22క్వింటాళ్లకు మించటం లేదు. కేంంద్ర ప్రభుత్వం ధాన్యం ధరలు క్వింటాలు ఏ గ్రేడ్‌కు రూ.2060 ,కామన్ రకంకింద బి గ్రేడ్‌కు రూ. 2040 ధర అమలు చేస్తొంది.

బహిరంగ మార్కెట్లో సన్న రకాల ధాన్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరల కంటే అధికంగానే లభిస్తోంది. క్వింటాలు రూ.2300 ధరలో కొనుకొనుగోలు చేస్తున్నారు. వ్యాపారలు మధ్య పోటీ పెరగటంతో త్వరలోనే ఇది రూ.2500కు చేరే అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు. ప్రకృతి వైపరిత్యాలు,చీడపీడల కారణంగా సన్నరకాల ధాన్యం పంట దిగుబడి తగ్గటంతో పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని చాల మంది రైతులు నేరుగా ధాన్యం మర ఆడించి బయ్యం విక్రయాలకు మొగ్గుతున్నారు.మరికొందరు రైతులు ధాన్యం బాగా ఆరబెట్టి నిల్వచేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.దీంతో బియ్యం వ్యాపారులు కూడా తగ్గినపంటను దృష్టిలో పెట్టుకుని తమ వ్యాపార అవసరాల నిమిత్తం పోటీలు పడి సన్నరకాలకు ధర పెడుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News