మన ఏం కొనేటట్టు లేదు..ఏ తినేటట్టు లేదు ధరలిట్ట మండుతన్నయ్ నాగులో నాగన్న.. నాలు గు దశాబ్దాల కిందటి ఒక సినిమాలోని పాట ప్రధాని నరేంద్రమోడి పాలనలో నేటి నిత్యావసర సరుకుల మార్కెట్‌కు అతికినట్టు సరిపొయింది. మార్కెట్‌లో వంట నూనెలు, మటన్ గుడ్లు ఒకటేమిటేమిటి ఏ వస్తువును ముట్టుకున్నా ధరలు సెగలు కక్కుతున్నాయి. నిరుపేద మద్య తరగతి కుటుంబాలు నిత్యావసర సరుకులు కొనలేక అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితులు పుట్టుకొస్తున్నాయి. మార్కెట్‌లో మండిపోతున్న ధరల కారణంగా పాలు, పప్పు, గుడ్లు, మాంసం వంటి పౌష్టికాహారాన్ని అందించే సరుకులు కొనలేక నిరుపేద కుటుంబాలకు చెందిన ప్రజలు పోషకాహార లోపాలతో బక్కచిక్కిపోతున్నట్టు జాతీయ ఆరోగ్య సంస్థ సర్వే లు వెల్లడిస్తున్నాయి.
ఒక వైపు చైనా జనాభాను దాటేశామని , ప్రపంచంలో భారత్ అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా అవతరించిందని చంకలు గుద్దుకుంటున్న మోడీ మరోవైపు మాల్ దేశంలో బారిన పడుతున్న 65శాతం జనాభా గురించి పట్టించుకోవటం లేదన్న విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో ప్రధాని పగ్గాలు చేపట్టేనాటికి, ఇప్పటికి సరుకుల ధరలు చూస్తే 50 నుంచి 75శాతానికి పెరిగిపోయాయి. కొన్ని రకాల ధర లు వంద శాతం పెరిగాయి. మరికొన్ని వందశాతం దాటేశాయి. చాయ్ వాలా ప్రధాని అయితే సామాన్యుల కష్టాలు తొలగి పోతాయన్న భారతీయ జనతాపార్టీ పెద్దలు ఎన్నికల సభల్లో ప్రజలకు కల్పించిన భ్రమలు క్రమేపి తొలగిపోతున్నాయి.
నింగిలోకి రాకెట్‌లో దూసుకుపోతున్న నిత్యవసర సరుకుల ధరల పెరుగుదల ప్రధాని మోడి అచ్చేదిన్ ప్రకటనల డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు నిత్యావసరంగా ఉన్న వంటగ్యాస్ 2014లో రూ.399ఉండగా నేడు ఇది రూ.1150కు పెరిగిపోయింది. పెట్రోల్ ,డీజిల్ ధరల పెరుగుల మంటపుట్టిస్తున్నాయి.2014లో రూ.27ఉన్న కిలో బియ్యం నేడు రూ.52పైగానే ఉంది. వంటనూనెలు రూ.83నుంచి రూ.180కి చేరాయి. గోధుమ పిండి కిలో రూ.22నుంచి రూ.76కు పెరిగిపోయింది. చక్కెర కిలో రూ.24నుంచి రూ.42కు చేరింది.
చింతపండు రూ.40నుంచి రూ120కి చేరింది. శనగపప్పు రూ.24నుంచి రూ.69కి, మినపప్పు రూ.32నుంచి సెంచరీ దాటేసింది. కందిపప్పు రూ.50నుంచి రూ.130కి ఎగబాకింది. బెల్లం అల్లంగా మారింది. నాణ్యతను బట్టి కిలో రూ.50పైగానే పలుకుతోంది. టీ పొడి ధరలు చుక్కలు తాకుతున్నాయి. ప్రకటనలతో ఊరించే పలు టీ బ్రాండ్ల టీపోడి అరకిలో ప్యాకెట్ ధర రూ.280నుంచి రూ. 380వరకూ విక్రయిస్తున్నారు. 2014లో లీటరు పాలధర రూ.38నుంచి నేడు రూ.60కి చేరుకుంది. పసిపిల్లలకు పౌష్టికాహారంగా ఉపయోడపడుతున్న పాలు , పెరుగు తదితరపాల ఉత్పత్తుల ధరలు నిరుపేదలకు అందనంతగా పెరుగుతున్నాయి.పెరుగు మాట ఎలా ఉన్నా ఈ వర్గాల ప్రజలు మజ్జిగ సైతం గ్లాసుల నుంచి చెంచాలతో వేసుకునే పరిస్థితులు ఉన్నట్టు చెబుతున్నారు.
ఉడుకుతున్న మాంసం ధరలు
ప్రోటీన్లతో దేహధారుఢ్యతను పెంపొందించి శరీరానికి శక్తినిచ్చే మాంసం వినియోగం నిరుపేద కుటుంబాల్లో రానురాను తగ్గిపోంతోంది. అందుకు వీటి ధరల పెరుగుదలే కారణంగా చెబుతున్నారు. 2014నాటికి కిలో మటన్ రూ.300ఉండగా ఇది నేడు రూ.800కు చేరింది. మటన్ ధరల్లో పెరుగుదలే తప్ప తగ్గిన దాఖలాలు లేవంటున్నారు. చికెన్ ధరలు కూడా భారంగా మారుతున్నాయి. కిలో రూ.100లోపు ఉన్న చికెన్ నేడు రెండు వందలకు పెరిగిపోయింది. గుడ్లు సైతం అదేబాటలో ఉన్నాయి. రెండు రూపాయలు ఉన్న గుడ్డు నేడు నాలుగు రూపాయాలకు పెరిగిపోయింది. రిటైల్ లో గుడ్డు రూ.5కు చేరింది.
వినోదము బరువే:
పగలంతా శ్రమించే దినసరి కార్మికులు, దినసరి కూలీలు వ్యవసాయ కార్మిక కుటుంబాలకు కాస్త మనసుకు ఉల్లాసం నింపే వినోదం కూడా బరువుగా మారింది. పేదల ఇల్లలో టీవిలు ఉన్నప్పటికీ వాటిని అలంకార ప్రాయంగా పెట్టుకోవాల్సివస్తోంది. ఛానళ్ల ధరలు కూడా పేద కుటుంబాలకు అందుబాటులో లేకుండా పెరుగుతున్నాయి. ఏటా చానళ్ల ప్రసారం కోసం సగటున రూ.3000 భరించేందుకు పేద కుటుంబాలు జంకాల్సివస్తోంది. నిత్యావసర ధరల పెరుగుదలలో కడుపు నిండా తిండి కరువై , ప్రసార మాధ్యమాల ధరల పెరుగులతో వినోదం కూడా బరువైతోందంటున్నారు.