న్యూఢిల్లీ: గ్యాస్, బియ్యం, పప్పులు, నూనెలు.. ఇలా గృహోపయోగ వస్తువుల ధరలన్నీ పెరిగిపోయి సతమతమవుతున్న సామాన్యుడిపై మరో బండ పడనుంది. ఏప్రిల్ 1వ తేదీనుంచి దాదాపు అన్ని అత్యవసర మందుల ధరలు పెరిగిపోనున్నాయి. వీటిలో పెయిన్‌కిల్లర్, యాంటీ బయోటిక్స్‌వంటి సాధారణ మందులు మొదలుకొని గుండె జబ్బుల్లో వాడే మందుల దాకా అన్నీ ఉన్నాయి. ఏప్రిల్ 1వ తేదీనుంచి పలు ఔషధాల ధరలు దాదాపు 12 శాతం దాకా పెరగవచ్చని తెలుస్తోంది. సాధారణంగా ప్రతి సంవత్సరం నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ( ఎన్‌పిపిఎ) టోకు ధరల సూచీ ఆధారంగా మందుల ధరల్లో మార్పులను ప్రకటిస్తూ ఉంటుంది. గత ఏడాది కూడా ఈ అథారిటీ మందుల ధరలను 10.7 శాతం పెంచింది. కాగా ఈ సంవత్సరం ధరల పెరుగుదల 12.12 శాతం ఉంటుందని ఎన్‌పిపిఎ వర్గాలనుటంకిస్తూ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
దాదాపు 800 అత్యవసర మందులపై ఈ ధరల పెంపు ప్రభావం ఉంటుందని అంచనా. ఈ పెరుగుదల షెడ్యూల్డ్ డ్రగ్స్‌కు వర్తిస్తుందని, నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ ధరలు10 శాతం దాకా పెంచుకోవడానికి అనుమతించినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. దాదాపుగా ప్రతి ఒక్కరిపైనా ఈ పెరుగుదల ప్రభావం ఉంటుందని, ప్రతినెలా పెద్ద సంఖ్యలో మందులను కొనుగోలు చేసేవారిపై ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుందని సామాన్యులు అంటున్నారు. అయితే ఇప్పుడు జనానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చాలానే ఉన్నాయని ఫార్మా రంగ వర్గాలు అంటున్నాయి. అందులో ప్రధానమైంది జనరిక్ మందులు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో జనరిక్ మందుల దుకాణాలు ఉన్నాయి. వీటిలో డాక్టర్లు రాసిన మందులకు ప్రత్యామ్నాయమైన మందులు అసలైన వాటికన్నా 50 శాతంనుంచి 90శాతం తక్కువ ధరకు లభిస్తున్నాయి. అయితే మందుల ధరలు కూడా దాదాపుగా ఇదే దామాషాలో పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక డాక్టర్లు రాసిన వాటికన్నా తక్కువ ధరకు దొరికే మందులు ఏమయినా ఉన్నాయా అని చాలామంది తమను అడుగుతుంటారని మందుల షాపుల వాళ్లు అంటున్నారు.
కాబట్టి మందులు కొనుగోలు చేసే వారి ప్రవర్తనను బట్టి వారిపై ఈ ధరల పెరుగుదల ప్రభావం ఉండే అవకాశం ఉందని వారంటున్నారు. అయితే మందుల ధరలు పెరగడానికి ప్రధాన కారణం వీటిలో వాడే ముడి పదార్థాల ధరలు బాగా పెరగడమేనని ఫార్మా పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియన్స్(ఎపిఐ)లుగా పిలవబడే ఈ ముడిపదార్థాలను మన దేశం ప్రధానంగా చైనాలాంటి బయటిదేశాలనుంచి దిగుమతి చేసుకొంటుంది. ఇటీవలి కాలంలో ఈ ముడిపదార్థాల ధరలు బాగా పెరిగాయి. దానితో పాటుగా రవాణా, ప్యాకింగ్ చార్జీలు కూడా పెరిగాయని వారంటున్నారు. ఏది ఏమయినా మందుల ధరలు పెరగడం అనేది ఫార్మా పరిశ్రమలకు మరింత లాభాలను తెచ్చిపెట్టేదిగా ఉంటే సామాన్యుడికి మాత్రం మరింత భారం కానుంది.