Thursday, December 26, 2024

విశ్వసించలేని విశ్వాసం-ఆత్మద్రోహమే!

- Advertisement -
- Advertisement -

Priest Extortion in Siddipet

మనుషులను చంపే శక్తి మంత్రాలకు ఉంటే, దేశ రక్షణ కొరకు వేల కోట్ల రూపాయలు వెచ్చించి సైన్యాన్ని, ఆయుధాల్ని, ఫైటర్ విమానాల్ని సమకూర్చుకోవడం ఎందుకూ? మంత్రాలు చదివే వాళ్లను ఓ నలుగుర్ని పంపితే పని అయిపోతుంది కదా? నలుగురు కాకపోతే నలభై మందో, నాలుగు వందల మందో అయినా సరే మనకు వేల కోట్లు మిగులుతాయి. పైగా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడుతుంది. శ్రీ వేంకటేశ్వర సామ్రాజ్యమైన తిరుమల తిరుపతి నగరాన్ని ఇటీవల వరదలు ముంచెత్తడం విడ్డూరం! వాస్తు ప్రకారం కట్టిన ఇండ్లు కూడా వరసబెట్టి కూలిపోవడం విషాదం. ప్రభుత్వ యంత్రాంగమంతా కదిలి వెళ్లి వరదల్ని అదుపు చేయడం, జనాన్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడం జరిగింది. మరి ఆ ఆపత్కాల బాంధవుడేడీ రాలేదేమీ? దేవుడి మహిమల గూర్చి పిచ్చిమాటలు కట్టి పెట్టి, నోరు మూసుకొని వుంటే కనీసం వారి గౌరవం దక్కేది కదా? వాస్తు పండితులు, జోతిష్కులు అంతా ఎక్కడికి పోయారూ? ఒక్కరూ నోరు మెదపలేదేమీ? రాగల ప్రమాదం గూర్చి ముందే చెప్పి, జనాన్ని అప్రమత్తం చేయలేదేమీ చెప్మా? వాతావరణ శాఖకు, ప్రభుత్వ యంత్రాంగానికీ పని భారం తగ్గేది కదా?ఆ దేవదేవుడి మహత్మాన్ని ప్రదర్శనకు పెట్టాల్సింది కదా? ఆయనతో ఓ మాయాజాలం చేయించి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సింది! వరదలప్పుడు భక్తులంతా “ఏడే కొండల వాడా! వెంటక రమణా!! గోవిందా గోవిందా” అని ఎంత పిలిచినా ఆయన రాలేదు. జనాన్ని కాపాడలేదు. “నన్నూ, నా భక్తుల్ని కాపాడే వారే లేరా?” అని ఏడు కొండల వెంకట రమణుడే వాపొయ్యాడుట! “భక్తులైనా, దేవుడైనా ఎవరూ భయపడాల్సిన పని లేదు. వరదల్లోంచి మిమ్మల్ని రక్షించి బయట పడేయడానికి మేమున్నాం” అంటూ ఆర్మీ రంగప్రవేశం చేసింది. పోలీసు శాఖ నడుం బిగించింది. ఇంతకూ మనుషుల్ని మనుషులు రక్షించుకోవడమే గాని, ఏదో శక్తి వచ్చి ఎవరినీ రక్షించింది లేదు. అసలు దేవుడి ఆభరణాలు దొంగలెత్తుకు పోతేనే ఆయనేం చేయలేకమిన్నకున్నాడు కదా? అంతా ప్రచారాల మహిమ. దేవుడి మహిమ కాదు. మహిమల ప్రచారం ఎంత ఎక్కువ జరిగితే అంత ఆదాయం వుంటుంది. ప్రేయర్ ఇండస్త్రీ భక్తి వ్యాపారంలో అది కీలకం!
ఒక్క విషయం నిజాయితీగా ఆలోచిద్దాం! ప్రార్థనలు గనక నిజంగా పని చేస్తే అంబులెన్స్‌లు రోగుల్ని, బాధితుల్ని చర్చ్‌లకు, మసీదులకు, దేవాలయాలకు తీసుకెళ్లాలి. అనవసరంగా ఆసుపత్రులకు తీసుకుపోతున్నామెందుకూ? ప్రార్థనలకు శక్తి లేదా? వైద్యశాస్త్రం చదువుకున్న వారే ఎందుకు కావాల్సి వస్తోంది? ఇక, అంతా దైవేచ్ఛే అయితే సహజంగా ముంచుకొచ్చే తుపానులు, వరదలు, కరువులు, కాటకాలు, రోడ్డు ప్రమాదాలు వంటివన్నీ కేవలం హేతువాదుల్ని, నిరీశ్వరవాదుల్ని, చార్వాకుల్ని చంపేయాలి. ప్రార్థనలు, భజనలు, పూజలు చేసే భక్తజనాన్ని బతికించాలి. కాని అలా జరగడం లేదెందుకూ? ప్రార్థనలకు, పూజలకు ఫలితం వుండదా? సహజ ప్రమాదాల్ని తెలివిగా తప్పించుకో గలవారు లేదా ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలిగిన వారు మాత్రమే నెగ్గుకొస్తున్నారు. పోనీ లాటరీలు చూద్దాం. కేవలం దేవుణ్ణి నమ్ముకున్నవారికే ఆయన కరుణా కటాక్షం వల్ల బహుమతులు రావాలి. అదృష్టం పట్టాలి. దేవుణ్ణి నమ్మని వారంతా దురదృష్టంతో సతమతమవుతూ వుండాలి. అంతా ఆ పై వాడే చూసుకుంటాడు, అంతా మంచే చేస్తాడు అని అనుకునే విశ్వాసకులకు ఎల్లప్పుడూ మంచే జరగడం లేదు. అందరిలాగా మంచీ చెడూ రెండూ జరుగుతున్నాయి. దైవ విశ్వాసకులు చదువు పరీక్షలో, జీవితపరీక్షలో అన్నింటా విజయాలు అవుతూనే వుండాలి. మరి అలా కావడం లేదు కదా? దేవుణ్ణి నమ్మినా, నమ్మకపోయినా ప్రతిభ గల వారు, ఇంగిత జ్ఞానం గల వారు మాత్రమే ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధిస్తున్నారు. అదేం విచిత్రమో దేవుడి మహిమ ఎక్కడా కనబడడం లేదు. ఎందుకు చెప్మా?
“కేవలం రమణ మహర్షి మాత్రమే చనిపోయిన తర్వాత తిరిగి వచ్చారు. ప్రపంచంలో ఇది మరెవరికీ సాధ్యం కాలేదు” అని సంగీత దర్శకుడు ఇళయరాజా ప్రకటించారు. ఆయన నమ్మకం ఆయనది. కానీ, దానితో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇళయరాజా బేషరతుగా తమకు క్షమాపణ చెప్పాలని తమిళనాడులో క్రైస్తవులు డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వ్యక్తిగత విశ్వాసాలు ఎవరికైనా, ఏవైనా వుండొచ్చు. కాని వాటిని బయట పెట్టేప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి. ప్రశ్నను తట్టుకొని నిలబడతాయా లేదా అని విశ్లేషించుకోవాలి. ప్రశ్నను ఎదుర్కోలేని విశ్వాసం వృథా! ప్రగతిశీల భావాలు గల వారంతా సంతోషించే సంఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. నారాయణరావు పేట మండలం, బంజేరు పల్లి గ్రామంలో “ఈ పురోహితుడు మాకొద్దు” అని దేశంలోనే మొదటిసారి ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. గ్రామసభ నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానించారు. గ్రామస్థులంతా 2021 డిసెంబర్ ఒకటి, బుధవారం రోజున ఊళ్లో ఒక చోట గుమిగూడి ఆ నిర్ణయం తీసుకున్నారు. పురోహితుడి దోపిడీ సహించలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి ఇరువైపులా 25 వేలు, తులం బంగారం తీసుకుంటున్నాడనీ, గృహ ప్రవేశాల వంటి శుభకార్యాలు జరిగినా సంభావన పేరుతో దోపిడీ నిరాఘాటంగా కొనసాగుతూ వుందని వాపొయ్యారు. దేవుడొక విశ్వాసమెలాగో, పురోహితుడి అవసరం కూడా విశ్వాసమే. అంధ విశ్వాసాలు వదులుకుంటే, మనుషుల ఆరోగ్యంతో పాటు, సమాజ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. ‘ఈ పురోహితుడు మాకొద్దు’ నిర్ణయంతో సమాజం కొంత వరకు ముందుకొచ్చినట్లే ఈ పురోహితుడే కాదు, ఏ పురోహితుడూ వద్దు. ఏ మత పెద్దా మాకు అవసరం లేదు అని గ్రామస్థులు నిర్ణయించుకునే రోజు రావాలి! అలాంటి ఆశాభావాన్ని నిజం చేసుకోవడానికి ఈ తరం యువతీ యువకులు అన్ని విధాలా కృషి చేస్తూనే వుండాలి!
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో బ్రహ్మపురి, కండాడ గ్రామంలో సునీల్ బన్‌కర్, ప్రమోద్ బన్‌కర్ అనే ఇద్దరు మూర్ఖులున్నారు. వారి దృష్టి ఆడుకునే పిల్లలపై పడింది. అందులో ఒక పిల్లవాడి తలలో మూడు సుడులు కనిపించాయి. అంతే వాళ్లు ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుపోయారు. పిల్లవాడి పేరు యుగ్ మేశ్రామ్. రెండేళ్ల పసివాడు. ఆడకుని, చీకటి పడ్డా ఇంట్లోకి రాలేదేమని పిల్లవాడి తండ్రి అశోక్ మేశ్రామ్ ఊరంతా వెతికాడు. కనబడకపోయే సరికి, పోలీసులకు తెలియజేశాడు. పోలీసుల అన్వేషణలో సునీల్, ప్రమోద్‌లు దొరికారు. విచారణలో తేలిందేమంటే వాళ్లే పిల్లవాణ్ణి చంపారని! ఎందుకూ అంటే తలలో మూడు సుడులు ఉన్న పిల్లవాణ్ణి బలి ఇచ్చి, క్షద్ర పూజలు చేస్తే గుప్త నిధులు దొరుకుతాయని ఒక మూఢ విశ్వాసం! పోలీసుల ట్రీట్‌మెంట్ తర్వాత చంపింది తామేనని నేరం ఒప్పుకున్నారు. గుప్త నిధులకు ఒక అనామకుడి తలలోని సుడులకూ సంబంధం ఎలా వుంటుంది?
ఆడది స్వేచ్ఛగా బతక గూడదని, కట్టుబాట్లన్నింటినీ తమ తమ మత గ్రంథాలలో రాసుకున్నప్పుడే మతాలు చచ్చిపోయాయి. ఆ చచ్చిన మతాలను ఇప్పుడు ఈ బతికున్న మనుషులు గుడ్డిగా నమ్ముతున్నారు. చిత్రం, విచిత్రం! ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గూటి మండలంలో షేక్ బహీర్ అతని భార్య సదిక సంజారి ఉంటున్నారు. భార్య సదిక సంజారికి పాటలు పాడడం, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం. ఆమె అక్కడ జరిగే ఉగాది ఉత్సవాల్లో పాల్గొన కూడదని భర్త భార్యకు ముందే ఆర్డర్ వేశాడు. అయినా ఆమె తన ఉత్సుకతను, ఉత్సాహాన్ని ఆపుకోలేక వెళ్లి అన్ని కార్యక్రమాలలో పాల్గొంది. అంతేకాక, ఇతర గాయనీ గాయకులతో కలిసి ఖవ్వాలీ కూడా పాడింది. ప్రేక్షకుల్లో వుండి గమనించిన భర్త షేక్ బషీర్ ఉక్రోషం ఆపుకోలేకపోయాడు. తన ఆడది తన మాట వినకుండా అవమానించిందని.. తన మీద తానే కిరోసిన్ పోసుకొని, నిప్పంటించుకున్నాడు. వేదిక మీద భార్య ఖవ్వాలీ పాడుతుండగా వేదిక కింద ఓర్వలేని భర్త ఆ పని చేశాడు. చుట్టూ వున్న వారు ఇసుక చల్లి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. అప్పటికే అతని శరీరం 70 శాతం కాలిపోయింది. ఇవి గూటి పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ వెల్లడించిన వివరాలు. భార్యల్ని ప్రోత్సహించక పోయినా ఫరవాలేదు. మూర్ఖంగా అడ్డుకోవడం, బెదిరించడం, బ్లాక్‌మెయిల్ చేయడం ఏం సబబూ? భార్యను ఒక వ్యక్తిగా గౌరవించడం ఎప్పుడు నేర్చుకుంటారూ? ఆమె అభిరుచులను అర్థం చేసుకునే పని లేదా? ఇలాంటి పనులు మత పిచ్చిగాళ్లే చేస్తారు. ఇక్కడ ఒక చిన్న సంఘటన గూర్చి చెపుతాను. ఒక రోజు రాత్రి దుకాణదారుడు దుకాణం కట్టేసి వెళ్లిపోదామనుకునే సమయానికి ఒక కుక్క, ఒక సంచి నోట కరుచుకొని వచ్చి నిలబడింది. సామాను కోసం వచ్చినట్లుంది అనుకుని, దాని నోటి నుండి సంచి తీసి తెరచి చూశాడు. అందులో సామాను చీటి, డబ్బులూ వున్నాయి. తనలో తానే నవ్వుకుంటూ దుకాణదారు సామాన్లు సంచిలో వేసి డబ్బులు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వాల్సిన చిల్లర సంచిలో వేశాడు. సంచి కుక్క నోటికి అందించాడు. అది వెనుదిరిగింది. షట్టరు మూసి దుకాణదారు కూడా కుక్కను వెంబడించాడు. కుక్క ఎక్కడికి వెళుతుంది? దాని యజమాని ఎవరు? చూడాలన్న ఉత్సుకత అతనిలో పెరిగింది. కుక్క బస్ట్‌స్టాండ్‌లో నిలబడి ఎదురు చూసింది. బస్సు రాగానే ఎక్కింది. దుకాణదారుడూ ఎక్కాడు. కుక్క కండక్లర్ దగ్గర నిలబడి మెడ వంచింది. దాని మెడ మీద నెక్ బెల్ట్ కింద డబ్బులున్నాయి. దిగాల్సిన స్టేజి ఏదో చిన్న చీటీ మీద రాసి వుంది. కండక్టర్ డబ్బులు తీసుకుని, టికెట్ చింపి మళ్లీ దాని నెక్‌బెల్ట్ కింద పెట్టాడు. స్టేజీ రాగానే కుక్క ముందుకు వెళ్లి నిలబడింది. తోకాడించింది, తల ఊపింది. డ్రైవర్ బస్సు ఆపాడు. కుక్క సంచిని జాగ్రత్తగా పట్టుకుని బస్సు దిగింది. దుకాణదారుడు కూడా బస్సు దిగి, దాన్ని అనుసరించాడు. కుక్క ఒక వీధిలో చివరి దాకా వెళ్లి సంచి అరుగు మీద పెట్టింది. ముందు కాళ్లతో తలుపు తట్టింది. మళ్లీ మళ్లీ తట్టిన తర్వాత ఒకతను తలుపు తెరిచాడు. కోపంతో కుక్కను విపరీతంగా బాదడం ప్రారంభించాడు. కొద్ది దూరంలో నిలబడి గమనిస్తున్న దుకాణదారు అది భరించలేకపొయ్యాడు.“ఆగవయ్య! ఆగు ఎందుకు దాన్ని కొడుతున్నావ్‌” అని అరిచాడు. కుక్క యజమాని విసుగ్గా చూసి “వెధవ కుక్క దీనికి బుద్ధి లేదు. తాళం చెవులు తీసుకుపోవచ్చు కదా? అనవసరంగా నా నిద్ర పాడు చేసింది!” అని కోసం వెళ్లగక్కాడు. బుద్ధి ఎవరికి లేదో దుకాణదారుడికి బాగా అర్థమయ్యింది. ఇక్కడ కుక్క మనిషిలా మారుతుంటే, మనిషే కుక్కలా ప్రవర్తించాడు.
దేవుడు అన్నీ చేస్తాడన్న విశ్వాసం ఎంత తప్పో.. కుక్క కూడా అన్ని పనులు చేయాలనుకోవడం అంతే తప్పు. మనిషికైనా, జంతువుకైనా కొన్ని పరిమితులుంటాయి.లేని దేవుడికే పరిమితులుండవు. భ్రమలో ఏదైనా సాధ్యమే! విశ్వాసాలుండడం అవసరమే. కాని, అవి విశ్వసించదగ్గవిగా వుండాలి!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News