Sunday, December 22, 2024

అందరికీ అర్చక వృత్తి

- Advertisement -
- Advertisement -

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అప్పటి దేశ నేతలు ఎంతో బాధ్యతతో, అవగాహనతో ప్రతిష్టించిన రాజ్యాంగం అన్ని మతాల, కులాల మధ్య సమానత్వా న్ని, శాంతియుత సహజీవనాన్ని లక్ష్యంగా చేసుకొన్నది. అయితే దాని నిర్దేశాలకు మన సమాజం ఇప్పటికీ పాటిస్తున్న సంప్రదాయ జీవన విధానానికీ బొత్తిగా పొసగడం లేదు. ఇందువల్లనే పైకులాలకు చెందినవారు కింది కులాలవారితో ప్రేమలో పడినా, పెళ్ళి చేసుకొన్నా అది హత్యలకు, ఆత్మహత్యలకు దారి తీస్తున్న ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ వైరుధ్యం తొలగిపోయి రాజ్యాంగబద్ధ మనుగడ బలపడాలంటే అందుకు దారిని చదును చేసే చర్యల అవసరం ఎంతైనా వుంది.

వాస్తవానికి అలాంటి చర్యలు, నిర్ణయాలు తీసుకొన్న ఘట్టాలు చాలా అరుదుగా సంభవిస్తున్నాయి. గ్రామాల్లో ఇప్పటికీ కులాల అంతరాలు కొనసాగుతున్నాయి. తరచూ చోటు చేసుకొంటున్న అనేక ఘటనలు అంటరానితరం ఉనికిని చాటుతున్నాయి. ఉచ్ఛనీచాల వివక్షను రుజువు చేస్తున్నాయి. అధిక సంఖ్యాక ప్రజల జీవితాలను మతమే నడిపిస్తున్నది. వీరి ఓటుతో భారతీయ జనతా పార్టీ వంటి తిరోగామి శక్తులు దేశాన్ని సెక్యులర్ ఆశయాల నుంచి దూరం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. అధికారాన్ని చెరబట్టి రాజ్యాంగ లక్షాలను దెబ్బ తీస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మద్రాసు హైకోర్టు సోమవారం నాడు ఆలయ అర్చక నియామకాలపై ఇచ్చిన తీర్పు భారత జాతికి కొత్త చూపును తొడిగే ప్రయత్నం చేసింది.

ఆలయ అర్చకుల నియామకంలో కులాలకు ఎటువంటి చోటు లేదని జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఇచ్చిన తీర్పు పూర్తిగా రాజ్యాంగబద్ధమైనది. అర్చక వృత్తికి అవసరమైన ఆగమ శాస్త్ర విధి విధానాలన్నీ తెలిసిన వ్యక్తిని అందుకు నియమించడంలో వారసత్వ, అనువంశిక హక్కు అనేది అడ్డురాదని, కులానికి ఇందులో ఎటువంటి పాత్ర వుండబోదని స్పష్టం చేసింది. ఆ గుడి అవసరాలకు అనుగుణమైన పూజా విధులలో సరైన శిక్షణ పొంది వుండడం ఒక్కటే అర్చక నియామకానికి అర్హమైనదని వివరించింది. సేలం జిల్లాలోని ఒక ఆలయ ఇవొ అర్చక ఉద్యోగానికి దరఖాస్తులు కోరుతూ ఇచ్చిన ప్రకటనను సవాలు చేస్తూ 2018లో దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ ఈ తీర్పు ఇచ్చారు.

2016 లో వెలువడిన సుప్రీంకోర్టు తీర్పును ఆయన ఇందుకు మద్దతుగా స్వీకరించారు. అప్పుడు అఖిల భారత ఆదిశైవ శివాచార సేవా సంఘం, తమిళనాడు ప్రభుత్వం మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇస్తూ ఆలయ అర్చక నియామకం సెక్యులర్ విధి అని ఇందులో అనువంశిక, వారసత్వ హక్కుకు ఆస్కారమే లేదని స్పష్టం చేసినట్టు జస్టిస్ ఆనంద్ వివరించారు. ఆలయంలో నిర్వహించవలసిన ఆగమ శాస్త్ర విధులు, ఆచారాలు బాగా తెలిసిన ఏ కులానికి చెందిన వ్యక్తి అయినా అర్చకులుగా నియమితులు కావచ్చునని ఆయన మరింత స్పష్టంగా వివరించారు. అలాగే 2022లో ఎన్ ఆదిత్యన్, తిరువాన్‌కోర్ దేవస్థానం బోర్డు మధ్య తలెత్తిన వివాదంలో కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటువంటి తీర్పే ఇచ్చింది. తమిళనాడులో ఆలయ అర్చక వృత్తిని చేపట్టే హక్కును అన్ని కులాల వారికి అందుబాటులో వుంచే పద్ధతికి ఏనాడో అంకురార్పణ జరిగింది.

అక్కడ మొట్టమొదటిసారిగా మదురైలోని ఒక ఆలయంలో బ్రాహ్మణేతర అర్చక నియామకం జరిగింది. 1970లో అప్పటి ముఖ్యమంత్రి కరుణా నిధి అన్ని కులాల వారూ అర్చక వృత్తి చేపట్టడానికి అనువుగా ఒక ఉత్తర్వును జారీ చేశారు. హిందూ మతస్థులు కావడమనేది ఒక్కటే అర్చక వృత్తి చేపట్టడానికి అవసరం. అంతేగాని కులాల ప్రసక్తి రాకూడదని 2006 మేలో తమిళనాడు ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ వివిధ బ్రాహ్మణేతర కులాలకు చెందిన 24 మందికి అర్చక నియామక పత్రాలను 2021 ఆగస్టులో అందజేశారు. వారంతా ఆగమ శాస్త్రంలో శిక్షణ పొందిన వారే. తమిళనాడు ప్రభుత్వ మానవ వనరుల విభాగం నిర్వహిస్తున్న పాఠశాలల్లో వైదిక ఆచార్యుల వద్ద శాస్త్రాన్ని, సంబంధిత శ్లోకాలను నేర్చుకొన్నవారే.

అంతకు ముందు గల అఖిల భారత అన్నా డిఎంకె ప్రభుత్వం కూడా 2018లో మదురైలోని రెండు ఆలయాలకు బిసి అర్చకులను నియమించగా అగ్ర వర్ణాల వారు తీవ్ర అభ్యంతరాలు తెలియజేశారు. వారసత్వ హక్కుగా కేవలం బ్రాహ్మణ అర్చకులనే నియమించాలని వారు వాదించగా వారి నియామకాలు ఆగిపోయాయి. ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా సర్వ సమానత్వ హక్కు పరిపూర్ణంగా అమలయ్యేంత వరకు ముందడుగు వేయాల్సిందే. సతీసహగమనం వంటి అమానుష ఆచారాలను ఎదుర్కొని వాటికి పూర్తిగా స్వస్తి చెప్పగలిగిన దేశంలో అర్చక వృత్తికి దళితులు సహా అందరినీ అర్హులను చేయగలిగే స్థితిని ఆవిష్కరించడం ఆలస్యమవుతుందేమో గాని అసాధ్యం కాబోదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News