న్యూఢిల్లీ: కొవిడ్19 సృష్టించిన సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు. ఈ సంక్షుభిత సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం బాధ్యతను విస్మరించిందన్నారు. బాధితులకు సహాయం అవసరమైనవేళ ప్రధాని ఎక్కడా కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. బాధితులను ఆదుకోవడంలో వ్యక్తులుగా కొందరు చేస్తున్న సహాయం అభినందనీయమని రాహుల్ తెలిపారు. వారి వీరోచిత త్యాగం వల్లే ప్రపంచం ముందు భారత్ తలెత్తుకొని నిలవగలుగుతున్నదని కొనియాడారు. పిఎం కేర్స్ ఫండ్ ద్వారా పంపిన వెంటిలేటర్ల విషయంలో వచ్చిన విమర్శల్ని కూడా రాహుల్ గుర్తు చేశారు. వెంటిలేటర్ల నాణ్యత లోపించిందని మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితులకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉంచడంలో కేంద్రం వైఫల్యాలను రాహుల్ ఇప్పటికే పలుమార్లు గుర్తు చేశారు.