Monday, January 20, 2025

బాలపురస్కార గ్రహీతలతో ప్రధాని మాటా మంతీ

- Advertisement -
- Advertisement -

Prime Minister Interact with the child award recipients

ఓకల్ ఫర్ లోకల్‌కు మద్దతు ఇవ్వాలని పిలుపు

న్యూఢిల్లీ: ‘దేశీయంగా తయారయ్యే ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వడమే లక్షంగా చేపట్టిన ‘ ఓకల్ ఫర్ లోకల్’ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఈ ఏడాది ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందుకున్న సాహస బాలలను ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. అంతేకాదు ప్రభుత్వం రూపొందించే ప్రతి పథకంలోను యువతకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. అవార్డు అందుకున్న బాలలతో ప్రధాని ఆన్‌లైన్ ద్వారా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరణ గురించి ప్రస్తావించారు. ‘నేతాజీనుంచి మనం పొందే అతి పెద్ద స్ఫూర్తి ఏమిటంటే కర్తవం, దేశం ప్రథమం అనేది. మీరంతా కూడా దేశం కోసం మీ విధి నిర్వహణ పథంలో ముందు సాగాలి’ అని అన్నారు. ఓకల్ ఫర్ లోకల్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని ఆయన వారిని కోరుతూ, మీ ఇంట్లో విదేశాలకు చెందిన వస్తువులు ఏమున్నాయో చెప్పాలన్నారు. ప్రపంచంలోని అన్ని పెద్ద కంపెనీల సిఇఓలుగా భారతీయ యువకులు ఉండడం , భారతీయ యువకులు స్టార్టప్‌ల ప్రపంచంలో తమ ప్రతిభను చాటుతున్నందుకు ఈ రోజు మనకందరికీ గర్వంగా ఉందన్నారు.

అలాగే కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో టీనేజ్ పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడాన్ని ఆయన ప్రశంసిస్తూ ఈ నెల 3న ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు 4 కోట్లకు పైగా టీనేజర్లు వ్యాక్సిన్ తీసుకున్నారన్నారు. వీరంతా మొత్తం సమాజానికి స్ఫూర్తి దాయకమని ప్రధాని అన్నారు. మీరు చేసే పనులు దేశానికి ఏ విధంగా ఉపయోగపడతాయో దృష్టిలో ఉంచుకొని మీరంతా పని చేయాలని ప్రధాని పురస్కార గ్రహీతలను కోరారు. ఈ ఏడాది 29 మంది పిల్లలు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందుకొన్నారు. వీరిలో 14 మంది బాలికలున్నారు. క్రీడలు, కళలు, సంస్కృతి, సామాజిక సేవ, సాహస ప్రదర్శన, నూతన ఆవిష్కరణలు ఇలా ఆరు రంగాలకు చెందిన వారిని ఈ అవార్డు కోసం ఎంపిక చేశారు. బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రధాని వీరికి సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ పురస్కారం కింద ప్రతి ఒక్కరికీ ఒక పతకం, లక్ష రూపాయల నగదు, సర్టిఫికెట్ అందజేస్తారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధాని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News