కొలంబో: శ్రీలంక ఆర్థిక సంక్షోభం ఇప్పుడిప్పుడే కుదుటపడేలా లేదు. ఈ నేపథ్యంలో సోమవారి శ్రీలంక ప్రధాని రాజపక్స (76) తన పదవి నుంచి తప్పుకోవచ్చని తెలుస్తోంది. ఆయన రాజీనామా కోసం ఆయన పార్టీ అయిన శ్రీలంక పొదుజన పెరమున(ఎస్‌ఎల్‌పిపి) కార్యకర్తలే డిమాండ్ చేస్తుండడంతో సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ‘ప్రస్తుత ఆర్థిక సంక్షోభానికి నా బాధ్యత అంటూ ఏమీ లేదు, అందుకే రాజీనామా చేయను అని ఆయన అంటారని నేను భావిస్తున్నాను’ అని అధికారిక సంకీర్ణం అసమ్మతి వాది దయాసిరి జయశేఖర పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. రాజపక్స కుటుంబాన్ని వ్యతిరేకిస్తున్న వారు రాజకీయాలు వదులుకోవాలని, దోచుకున్న దేశ సంపదను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. బౌద్ధ మత గురువులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ శ్రీలంకలో అనిశ్చితి నెలకొని ఉంది. దేశం ఇప్పటికీ ‘ఎమర్జెన్సీ’లో ఉంది. ఇదిలావుండగా మహింద రాజపక్స రాజీనామా చేసినట్లయితే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడగలదని అసమ్మతి నాయకుడు జయశేఖర వాదిస్తున్నారు. శ్రీలంకలో నెల రోజులలోనే రెండోసారి ఎమర్జెన్సీని శుక్రవారం రాత్రి నుంచి అమలుచేశారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రంగా ఉంది. ఇంధనం, ఔషధాలు, విద్యుత్తు కొరత తీవ్రంగా ఉంది.