Saturday, November 23, 2024

ప్రగతియుత భారత్‌కు పంచప్రాణాలు

- Advertisement -
- Advertisement -

మరో పాతికేళ్లు అత్యంత కీలకం స్వతంత్ర శతాబ్ది
కోసం నవ సంకల్పం 2047 నాటికి అభివృద్ధి
చెందిన దేశంగా అవతరించాలి వికసిత భారతం,
బానిసత్వ భావాల నిర్మూలన, వారసత్వాన్ని
పరిరక్షించడం, ఏకత్వం, పౌర బాధ్యత ఇవే
మన పంచ ప్రాణాలు : ఎర్రకోట నుంచి ప్రధాని

న్యూఢిల్లీ: వచ్చే పాతికేళ్లు వజ్రోత్సవ స్వాతంత్య్ర భారతదేశానికి అత్యంత కీలకమైనవని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రపు అమృతకాలంలోకి వచ్చాం. వచ్చే పాతికేళ్లలో భారత్‌ను సమగ్ర అభివద్ధి దేశంగా మలిచేందుకు ‘పంచప్రాణాలపై’ అంతా దృష్టి కేంద్రీకరించాల్సి ఉందన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట నుంచి ప్రధాని మోడీ సోమవారం ఉదయం త్రివర్ణపతాకం ఎగురవేసిన తరువాత జాతి జనులను ఉద్ధేశించి ప్రసంగించారు. ఎర్రకోట నుంచి పంద్రాగస్టునాడు ఆయన జాతీయ జెండాను ఎగురవేయడం వరుసగా ఇది తొమ్మిదోసారి. మన ముందు పలు సవాళ్లు ఉన్నాయి. వీటికి పరిష్కారాలు కూడా ఉంటాయి. ఐదు పరిష్కారాలతో కూడిన పంచ ప్రాణాలపై దృష్టి సారించి వచ్చే పాతికేళ్లలో అంటే దేశ స్వాతంత్య్ర శతవార్షికోత్సవం దశలో ప్రగతియుత దేశంగా ఇండియా అయ్యేందుకు పాటుపడాల్సి ఉంటుందన్నారు. దీనిని వజ్రోత్సవ సంకల్పంగా మలుచుకోవాలని పిలుపు నిచ్చారు. ఇప్పుడు 75 ఏండ్లు పూర్తి చేసుకుంటున్నాం. ఇది కీలకమైన ఘట్టం. ఓ సరికొత్త దిశవైపు, వినూత్న దీక్షతో ముందుకు వెళ్లాల్సిన తరుణం ఇదేనని తెలిపారు.

తాను ప్రస్తావించిన ఐదు పరిష్కారాల పంచప్రాణాల గురించి ఆయన వివరించారు. వీటికి సంబంధించి ప్రతిన వహించాల్సి ఉందన్నారు. ముందుగా అంతా ఇండియా ప్రగతిశీల దేశం కావాలనే స్థిర అభిప్రాయానికి రావాలి. రెండోది వలసవాదపు వైఖరి అవశేషాలను తొలిగించుకోవాలి. మన వారసత్వ సంపద, సమైక్యతా శక్తిని గర్వకారణంగా భావించుకోవాలి, ఐదవ అంశంగా పౌరులంతా తమ విధులను బాధ్యతలను విశ్వసనీయతతో నిర్వర్తించాలి. ఈ ఐదు అంశాలు పౌరులే కాకుండా పౌరుల్లో ఒక్కరైన ప్రధాన మంత్రికి ముఖ్యమంత్రులకు కూడా వర్తింపచేసుకుని తీరాలని స్పష్టం చేశారు. 2022 వజ్రోత్సవ ఘట్టం . ఈ తరుణం నుంచి మనం పొందిన స్ఫూర్తిని తీసుకున్న నిర్ణయాల అమలుతీరుతెన్నులను తిరిగి 2047లో స్వాతంత్య్ర సెంటినరీదశలో సమీక్షించుకోవల్సి ఉంటుందన్నారు. ఇనుమడించిన ఉత్సాహంతో , శషభిషలు లేకుండా , సంశయాలు వీడి భారత్ ప్రగతిపథంలో శరవేగంతో సాగాలని ప్రతిభారతీయుడు ఆలోచించాలని పిలుపు నిచ్చారు.

ప్రజాస్వామ్య మాతృకకు అంతర్గత శక్తి

భారతదేశం ప్రజాస్వామ్యానికి మాతృమూర్తిగా నిలిచింది. జాతి వైవిధ్యత, దేశభక్తి అనే ఉమ్మడి బంధం మనకు అంతర్గత శక్తిని సంతరింపచేసింది. ఈ అంశం పలు దశలలో దేశం నిరూపించిందని ప్రధాని తెలిపారు. ఎటువంటి సవాళ్లను అయినా తట్టుకుని నిలిచే అంతర్గత శక్తి కాలానికి అతీతంగా చెక్కుచెదరకుండా నిలిచిందని పేర్కొన్నారు. మన అంతర్గత శక్తి మనకు పటిష్ట ప్రజాస్వామ్యాన్ని అందించి ఇచ్చిందని తెలిపారు. దేశానికి ఇప్పుడు అవినీతి , బంధుప్రీతి ప్రధానమైన సవాళ్లుగా నిలిచాయి. ఈ చెదపురుగులలో మరోటి వారసత్వం వచ్చి చేరిందని, ఇది కేవలం రాజకీయాలకే కాకుండా అన్ని రంగాలకు విస్తరించుకుని పోయిందని అన్నారు. ఈ పరిణామం దేశ భవితకు ముప్పుగా నిలుస్తుంది. అవినీతి బంధుప్రీతి రంగులు కేవలం రాజకీయ రంగానికే పరిమితం అయి లేవన్నారు. ఈ రెండు రకాల దుష్టశక్తులను ప్రజలు ద్వేషించాలని ప్రధాని కోరారు. ఇటువంటి నఫ్రతోతోనే ప్రతికూలతలను పారదోలే శక్తి మరింత సంతరించుకుంటుందన్నారు.

వారసత్వ పాలనను విమర్శిస్తే రాజకీయ రంగు పులుముతారని, అయితే ఇది కొత్త నాయకత్వాన్ని తొక్కిపెడుతోంది. సృజనాత్మకు విఘాతంగా మారుతోందన్నారు. వారసత్వ పోకడకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం రావాల్సి ఉందన్నారు. ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిన వారసత్వ పోకడను, అవినీతిని బంధుప్రీతిని పెకిలించాలి. అప్పుడు దేశ ప్రజాస్వామ్యం , దేశంలోని సంస్థలు విలసిల్లుతాయని తెలిపారు. అవినీతి దేశానికి పిడుగుపాటుగా మారింది. దేశంలో ఎందరో నిలువనీడలేకుండా ఉంటే మరికొందరికి అవినీతి సొమ్ము దాచుకునే స్థలం లేకుండా పోయిందన్నారు. ఈ అంతరం తొలిగిపోవాలి. అవినీతి చిక్కుముళ్లు తొలిగిపోతనే సామాన్యుడి జీవితం మెరుగుపడుతుందన్నారు. ప్రజాస్వామ్య మహా వృక్షానికి పట్టిన చెదపురుగులును నిర్మూలించాల్సి ఉంటుందన్నారు.

టీం ఇండియా స్ఫూర్తితోనే సాగుతున్నాం

దేశంలో ఇప్పుడు సమాఖ్యవాదం దెబ్బతింటోందని, రాష్ట్రాల హక్కులకు విఘాతం ఏర్పడుతోందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని ప్రధాని తెలిపారు. అయితే ఇందులో నిజం లేదన్నారు. సహకార సమాఖ్య వాదం , టీం ఇండియా స్ఫూర్తిపై తనకు అపార నమ్మకం ఉందని ఈ సందర్భంగా తన విమర్శకులకు తెలియచేయదల్చుకున్నానని చెప్పారు. కేంద్రంలో వేరే పార్టీ (కాంగ్రెస్) అధికారంలో ఉన్నప్పుడు తాను గుజరాత్ సిఎంగా టీం ఇండియా పద్ధతిని పాటించానని తెలిపారు. మనకు వేర్వేరు కార్యక్రమాలు ఉండవచ్చు, విభిన్న పనితీరుతో సాగవచ్చు. అయితే దేశం పట్ల మన కలలు వేరు కావని, ఇవి రాష్ట్రాలకు అయినా కేంద్రానికి అయినా ఒక్కటే అని తెలిపారు. ప్రధాని మోడీ 82 నిమిషాల పాటు ( గంట ఇరవై నిమిషాలు ) ప్రసంగించారు.

దేశ స్వాతంత్య్రం, ప్రగతి దిశలో ఎందరో మహానుభావులు తమ జీవితాలను ధారపోశారని వివిధ రాజకీయ సిద్ధాంతాలు, వైఖరులతో కూడిన నేతల పేర్లను ప్రధాని ప్రస్తావించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, విడి సావర్కర్, రామ్ మనోహర్ లోహియా, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, మంగళ్‌పాండే వంటివారి సేవలను ప్రస్తుతిస్తూ వారికి నివాళులు అర్పించారు. దేశానికి నారీశక్తి అత్యంత విలువైనదని , మహిళాసాధికారత కీలక అంశం అని తెలిపారు. లింగసమానత్వం సమైక్య భారతానికి అత్యవసరం అన్నారు. మహిళలకు మరిన్ని అవకాశాలు దేశానికి అత్యధిక ప్రయోజనాల దిశలోకి దారితీస్తాయని తెలిపారు.

కుర్తా పైజామా పొడవాటి తలపాగా

ప్రధాని మోడీ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకకు కుర్తా, చుడీదార్ పైజామా , నీలం రంగుకోటు, త్రివర్ణ గీతలున్న తలపాగాను ధరించారు. ఇంతకు ముందటిలాగా ఆయన ఈసారి టెలిప్రాంప్టర్ వాడలేదు. ప్రసంగ కాగితాలను తెచ్చుకుని అప్పుడప్పుడు వాటిని చూస్తూ మాట్లాడారు.

దేశవాళి హోవిట్జర్ గన్ ఎటిఎజిఎస్ నుంచి 21 గన్ శాల్యూట్

తొలుత రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించి , ఎర్రకోట వద్దకు జాతీయ జెండా కార్యక్రమానికి వచ్చిన ప్రధానికి 21 గన్ గౌరవ వందనం పలికారు. దేశీయ తయారీ అయిన హోవిట్జర్ గన్ ఎటిఎజిఎస్ నుంచి ఈ గౌరవవందనం ప్రక్రియ సాగింది. ఈ గన్‌నుంచి గౌరవవందనం అందడం ఇదే తొలిసారి . దేశవాళి రక్షణ భద్రతా పాటవానికి ప్రతీకగా ఈ గన్ శాల్యూట్‌ను అందించారు. ఈ గన్‌కు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. అడ్వాన్స్‌డ్ టోవ్డ్ ఆర్టీలరీ గన్ సిస్టమ్ ( ఎటిఎజిఎస్)ను భారత రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) రూపొందించడం మన రక్షణ రంగ సర్వసత్తాకతకు ప్రతీక అయినందున దీనిని గన్‌శాల్యూట్‌కు వాడారు. ఈ గన్‌తో పాటు సాంప్రదాయక బ్రిటిష్ తయారీ 25 పౌండర్స్ ఆర్టిలరీ గన్స్ కూడా గౌరవవందనానికి వాడారు. దేశ ఆత్మనిర్భర్ పథకం గురించి ప్రస్తావించినప్పుడు ప్రధాని మోడీ దేశవాళి గన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 75 ఏండ్లలో తొలిసారిగా దేశ స్వాతంత్య్ర దినోత్సవాలలో ఈ గన్స్ వాడామని, ఇది దేశ ఆత్మనిర్బరత ఘట్టంలో మన సైన్యం భాగస్వామ్యం కావడాన్ని స్పష్టం చేసిందని, ఈ దశలో తాను సాయుధ బలగాలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నానని ప్రధాని తెలిపారు.

బహుళ అంచెల భద్రతా వలయాలు మెరుపు వీరుల దళాలు
ఎర్రకోట వద్ద జాతీయ జెండా పండుగ దశలో అత్యంత పటిష్టమైన రీతిలో భద్రతా నిఘా ఏర్పాట్లు చేపట్టారు. అత్యంత వ్యూహాత్మకంగా అధునాతన స్థాయి పరికరాలు, ఫేసియల్ రిగ్నజైషన్ సిస్టమ్ కెమెరాలు, రాడార్లు తో కూడిన బహుళ స్థాయి భద్రతతో ఈ ప్రాంతం అంతా అవాంఛనీయ శక్తుల పాలిటి దుర్భేధపు ఎర్రకోట అయింది. గగనంలో ఎటువంటి విచ్ఛిన్నకర శక్తి దాడుల సాధనాలను ప్రయోగించకుండా వీటిని మించిన అధునాతన హైటెక్ సాంకేతిక పరికరాలను వాడారు. గాలిలో ఎటువంటి గాలిపటం ఎగిరినా వెంటనే దీనిని పసికట్టి, దీని చర్యలను కట్టిపడేసేందుకు అవసరం అయిన ట్రాకర్‌లను జాగ్రత్త చర్యలలో భాగంగా తీసుకవచ్చారు. ఇక అవాంఛనీయ పేలుడు పదార్థాలు ఉంటే వాటిని ముందుగానే పసికట్టి దెబ్బతీసేందుకు ప్రత్యేక స్నైపర్స్‌ను రంగంలోకి దింపారు. జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జి)కిచెందిన స్నైపర్స్‌ను, చురుగ్గా వ్యవహరించే స్వాట్ కమెండోలను , 400 కైట్ క్యాచర్స్‌ను, షార్ప్‌షూటర్స్‌ను సన్నద్ధం చేసి ఉంచారు.

ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో వారి కదలికలను దెబ్బతీసేందుకు పలు విధాలైన చర్యకు దిగారు. ఎర్రకోట అంతటా పూర్తి స్థాయి భద్రతా వలయంతో దట్టంగా మబ్బులు పట్టిన వాతావరణం నడుమ గంభీరతతో సోమవారం ఉదయం ప్రశాంతంగా ఉంది. ఈ ప్రాంతంలో గాలిపటాలను ఎగురవేయడాన్ని నిషేధిస్తూ నో కైట్ ఫ్లయిట్ జోన్‌గా ప్రకటించారు. ఢిల్లీలో కొవిడ్ కేసులు తిరిగి పెరుగుతూ ఉండటంతో ఎర్రకోట వద్దకు వచ్చిన ప్రత్యేక ఆహ్వానితులు 7వేల మంది విషయంలో కొవిడ్ నియమావళిని ఖచ్చితంగా అమలులోకి తీసుకువచ్చారు. మాస్క్‌లు , భౌతికదూరాల పాటింపు ప్రక్రియతో సీట్ల అమరిక ఏర్పాట్లు జరగడం వంటివి చేపట్టారు. ఆహ్వానితులు అందరికి ముందుగా వారి శారీరక ఉష్ణోగ్రతలను పరిశీలించారు. జ్వరం ఉన్నదీ లేనిది,. ఇతరత్రా అనారోగ్యం నిర్థారణ తరువాత వారిని లోపలికి పంపించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News