Monday, January 20, 2025

పలు చిక్కులకు చెక్‌గా బ్రిక్స్

- Advertisement -
- Advertisement -

దక్షిణాఫ్రికాకు చేరుకున్న ప్రధాని మోడీ
చైనా నేత జిన్‌పింగ్‌తో ద్వైపాక్షిక భేటీ?
కోవిడ్ లాక్‌డౌన్ల తరువాత తొలిసారి నేరుగా బ్రిక్స్

న్యూఢిల్లీ /జొహన్సెస్‌బర్గ్ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బ్రిక్స్ కీలక శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంగళవారం చేరుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ బ్రిక్స్ (బ్రెజిల్ , రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సదస్సు నేపథ్యంలోనే ప్రదాని మోడీ, చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ నడుమ అంతర్గత భేటీ జరిగే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం జొహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. చైనా అధినేతతో మోడీ ద్వైపాక్షిక భేటీ ఈ మూడు రోజులలో ఎప్పుడైనా జరగవచ్చునని వెల్లడైంది.

దీనికి ఖచ్చితంగా సమయం ఖరారు కాలేదు. విమానాశ్రయంలో ప్రధాని మోడీకి దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షులు పాల్ షిపోకోసా మషటిలే స్వాగతం పలికారు. బ్రిక్స్ సదస్సుకు దక్షిణాఫ్రికా ఆతిధ్యం ఇస్తోంది. కోవిడ్ కారణంగా ఇంతకు ముందటి మూడు బ్రిక్స్ సదస్సులు కేవలం ఆన్‌లైన్ ప్రక్రియలోనే సాగాయి. బ్రిక్స్ విస్తరణపై ఇండియా ఆసక్తిగా ఉందని భారతదేశ విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. జిన్‌పింగ్‌తో సమావేశం అయ్యే అవకాశం ఉందా? అని అడగ్గా , ప్రధాని పర్యటన షెడ్యూల్ పూర్తిగా ఖరారు కాలేదని వివరించారు.

బ్రిక్స్ సదస్సులో భాగంగా ముందుగా బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లీడర్స్ చర్చలు జరుగుతాయి. భారతీయ కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 7.30 గంటలకు జరిగే ఈ ఫోరమ్‌లో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. మోడీ తరువాతనే జిన్‌పింగ్ మాట్లాడుతారు. బ్రిక్స్ సదస్సుకు రష్యా అధ్యక్షులు పుతిన్ వర్చువల్‌గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే హాజరు అవుతారు. అయితే పుతిన్ బదులు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ ఇక్కడికి చేరుకున్నారు. బ్రిక్స్‌లో సభ్యత్వం తీసుకునేందుకు 40కి పైగా దేశాలు ఆసక్తి చూపాయని గత నెలలోనే దక్షిణాఫ్రికా సీనియర్ దౌత్యవేత్త ఒకరు తెలిపారు. ఇప్పటికే బ్రిక్స్ బృందం ప్రపంచ జనాభాలో 40 శాతం వరకూ ప్రాతినిధ్యం వహిస్తోంది.

చైనా, ఇండియా ఇందులో సభ్యదేశాలు కావడం కీలకం అయింది. కాగా తాజాగా అర్జెంటీనా, ఇరాన్, సౌదీ అరేబియా, కాంగో, యుఎఇ, కజకిస్తాన్ వంటి పలు దేశాలు సభ్యత్వానికి ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడైంది. సదస్సుకు ఢిల్లీ నుంచి బయలుదేరే ముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ బ్రిక్స్ సమావేశం పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. సభ్య దేశాలన్ని ఈ వేదిక ద్వారా భవిష్య పరస్పర సహకార రంగాలను ఎంచుకునేందుకు వీలేర్పడుతుందని చెప్పారు. గ్లోబల్ సౌత్ సంబంధిత విషయాలను సరైన విధంగా చర్చించేందుకు ఇదో మంచి అవకాశం అవుతుందని తెలిపారు. వ్యవస్థీకృత అభివృద్ధి సమీక్షకు ఇది కలిసివచ్చే వేదిక అవుతుందని ప్రధాని తెలిపారు. ఇక్కడి సదస్సు తరువాత ప్రధాని మోడీ గ్రీస్ పర్యటనకు వెళ్లుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News