షట్లర్ శ్రీకాంత్‌కు ప్రధాని మోడీ అభినందనలు
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించి చరిత్ర సృష్టించిన తెలుగుతేజం, భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్‌పై అభినందనల వర్షం కురుస్తోంది. తాజాగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విటర్ వేదికగా శ్రీకాంత్‌ను అభినందించారు. ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో మీరు సాధించిన విజయం ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. మీ గెలుపు యువ షట్లర్లకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. యువ ఆటగాళ్లు బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకునేందుకు ఇది దోహదం చేస్తుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో భారత క్రీడాకారులు సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇది ఒకటని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విజయాలు మరెన్నో సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు.
ప్రశంసల వర్షం..
మరోవైపు చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న శ్రీకాంత్‌పై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు శ్రీకాంత్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. శ్రీకాంత్ అద్భుత ఆటతో దేశ ఖ్యాతిని ఇనుమడింప చేశారని కొనియాడారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని విజయాలు అందుకోవాలన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకాంత్‌ను అభినందించారు. శ్రీకాంత్ విజయం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, ఒడిశా సిఎం నవీన్ పట్నాయక్ తదితరులు కూడా శ్రీకాంత్‌ను ప్రశంసించారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా శ్రీకాంత్‌ను అభినందించాడు. అంతేగాక మాజీ క్రికెటర్లు వివిఎస్.లక్ష్మణ్, అజారుద్దీన్, ఎమ్మెస్కే ప్రసాద్ తదితరులు కూడా శ్రీకాంత్ విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.