Monday, January 20, 2025

వారసత్వ సంపదను విస్మరించిన గత పాలకులు

- Advertisement -
- Advertisement -

మహాత్మా గాంధీ దార్హనికతే స్ఫూర్తిగా మా పాలన
సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోడీ ఉద్ఘాటన

అహ్మదాబాద్: దేశ వారసత్వ సంపదను పరిరక్షించడంలో గత ప్రభుత్వాలకు రాజకీయ చిత్తశుద్ధి లేదని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. తన వారసత్వ సంపదను భద్రపరుచుకోలేని దేశం తన భవిష్యత్తును కూడా కోల్పోతుందని ఆయన అన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలోగల సబర్మతి వద్ద రూ. 1,200 కోట్ల వ్యయంతో చేపట్టిన గాంధీ ఆశ్రమం స్మారక మాస్టర్‌ప్లాన్‌ను ప్రధాని మోడీ మంగళవారం ప్రారంభించారు. అంతేగాక 1930 మార్చి 12న మహాత్మా గాంధీ చేపట్టిన దండి యాత్ర(ఉప్పు సత్యాగ్రహం) వార్సికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పునరాభివృద్ధి చేసిన కొచ్రబ్ ఆశ్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ మహాత్ముడి సబర్మతి ఆశ్రమం దేశానికి మాత్రమే కాక యావత్ మానవాళికి వారసత్వ సంపదని పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే కాక వికసిత భారత్‌లో కూడా సబర్మతి ఆశ్రమం యాత్రాస్థలిగా నిలిచిపోయిందని ఆయన చెప్పారు. బాపూజీ దార్శనికత మన దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం స్పష్టమైన మార్గదర్శనం చేస్తోందని ఆయన అన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలకు దేశానికి చెందిన వారసత్వ సంపదలను కాపాడుకునే మనస్తత్వం కాని రాజకీయ చిత్తశుద్ధి కాని గత ప్రభుత్వాలకు లేకుండా పోయిందని ఆయన విమర్శించారు. భారతదేశాన్ని విదేశీ దృష్టితో చూసే అలవాటు ఒక కారణమైతే బుజ్జగింపు రాజకీయాలు మరో కారణమని, వీటి వల్లే దేశంలో ఘనమైన వారసత్వ సంపద నాశనమవుతోందని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఆక్రమణలు, అపరిశుభ్రత, అవ్యవస్థ వంటి వన్నీ వారసత్వ సంపదను హైజాక్ చేశాయని ఆయన తెలిపారు. ఒకప్పుడు 120 ఎకరాలలో విస్తరించి ఉన్న సబర్మతి ఆశ్రమం ఇప్పుడు 5 ఎకరాలకు కుదించుకుపోయిందని, గతంలో 63 భవనాలు ఉండగా ఇప్పుడు కేవలం 36 మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. మిగిలి ఉన్న ఈ 36 భవనాలలో కేవలం మూడు మాత్రమే పర్యాటకుల సందర్శనకు నోచుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు సందర్శించి, ఆరాధించి , అనుభూతి చెందే సబర్మతి ఆశ్రమాన్ని పరిరక్షించుకునే బాధ్యత 140 కోట్ల మంది భారతీయులు అందరిపైన ఉందని ఆయన చెప్పారు. పురాతన భవనాలను వాటి అసలు రూపంలోనే పునరుద్ధరించాలన్నది ప్రభుత్వ సంకల్పమని, ఒకవేళ కొత్త భవనాన్నే నిర్మించవలసి వస్తే సాంప్రదాయ పద్ధతిలో వాటి నిర్మాణం జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని అన్నారు.

భవిష్యత్ తరాలు సబర్మతి ఆశ్మాన్ని సందర్శించినపుడు ఈ ఆశ్రమానికి చెందిన ఒక మహాత్ముడు తన చరఖా శక్తితో దేశ ప్రజలందరిలో చైతన్యం నింపి స్వాతంత్య్ర ఉద్యమానికి కొత్త ఊపిరి పోశాడన్న విషయాన్ని అర్థం చేసుకుంటాయని ప్రధాని అన్నారు. శతాబ్దాలుగా బానిసత్వంలో మగ్గుతున్న దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన బాపూజీ కొత్త ఆశను, విశ్వాసాన్ని నింపారని ఆయన చెప్పారు. గ్రామ స్వరాజ్యం, స్వయం సమృద్ధితో కూడిన భారత్ రావాలని మహాత్మా గాంధీ కలలు కన్నారని, ఆయన స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్, స్వదేశీ వంటి ప్రయత్నాలకు తన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన చెప్పరు. గుజరాత్‌లో 9 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యాన్ని చేపట్టారని, దీని వల్ల 3 లక్షల టన్నుల యూరియా ఆదా అయిందని ఆయన చెప్పారు.

ఖాదీకి ప్రోత్సాహం, గ్రామాలను బలోపేతం చేయడం ఈ కృషిలో భాగమేనని, ఆర్థిక వ్యవస్థలో మహిళలు పెద్ద పాత్రను పోషింంచేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు. నేడు స్వయం సహాయక గ్రూపులలో పనిచేస్తున్న 1 కోటి మందికి పైగా మహిలలు లక్షాధికారులుగా మారారని, తన ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే 3 కోట్ల మంది లక్షాధికారి సోదరీమణులను చూడాలన్నదే తన స్వప్నమని ప్రధాని మోడీ తెలిపారు. పేదరికం నిర్మూలనకు తాము చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న విధానాల కారణంగా 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన తెలిపారు. బాపూజీ ఎక్కడున్నా తమ ప్రభుత్వాన్ని దీవిస్తారని తాను నమ్ముతున్నానని మోడీ చెప్పారు.

భారత్ కొత్త రికార్డులను సృష్టిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్న ఈ అమృత కాలంలో మహాత్ముడి ఈ తపోస్థలి మనందరికీ గొప్ప స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. బాపూజీ ఉద్బోధించిన అహింస, సత్యసంధత దేశం పట్ల భక్తిభావాన్ని పెంపొందించడంతోపాటు మానవసేవయే మాధవ సేవ అన్న సేవాభావాన్ని నింపుతుందని ఆయన తెలిపారు. సబర్మతి ఆశ్రమం ద్వారా నేటికీ అభాగ్యులకు ఆశ్రయం లభించడమే ఇందుకు సజీవ సాక్షమని ఆయన అన్నారు. వారణాసిలోని కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడంపై తమ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధి వల్ల గడచిన రెండేళ్లలో రెండు కోట్ల మందికి పైగా భక్తులు ఆ ఆలయాన్ని సందర్శించగలిగారని ఆయన తెలిపారు. అయోధ్యలో రామాలయ విస్తరణ ప్రాజెక్టు కోసం 200 ఎకరాల భూమిని విడిపించగలిగామని మోడీ తెలిపారు.

రామాలయ ప్రాణ ప్రతిష్ట జరిగిన 50 రోజుల్లోనే ఒక కోటి మందికిపైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారని ఆయన తెలిపారు. గుజరాత్‌లోని శ్రీకృష్ణుని ద్వారక కూడా అభివృద్ధఢికి నోచుకుందని ఆయన తెలిపారు. సర్దార్ పటేల్ చేపట్టిన సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం ఒక చారిత్రక ఘట్టమని, వేలాది సంవత్సరాల పూర్వం నాటి లోథాల్ రేవుతో సహా గుజరాత్‌లోని అనేక ప్రపంచ వారసత్వ ప్రదేశాలు అభివృద్ధి చెందాయని ప్రధాని తెలిపారు. స్వాతంత్య్ర సంగ్రామంతో ముడిపడిన వారసత్వ స్థలాల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ప్రచారాన్ని నిర్వహించిందని ఆయన చెప్పారు.

రాజ్‌పథ్ వంటి జాతీయ స్ఫూర్తివంతమైన ప్రదేశాలు కర్తవ్య పథ్‌గా అభివృద్ధి చెందాయని ప్రధాని తెలిపారు. అండమాన్ నికోబార్ దీవులలోని ప్రదేశాలు, బాబాసాహెబ్ అంబేద్కర్‌తో ముడిపడిన ప్రదేశాలు, ఏక్తానగర్‌లోని సమైక్యతా మూర్తి విగ్రహం, దండి ఆశ్రమం వంటివి మరికొన్ని ఉదాహరణలి ఆయన వివరించారు. ఆ దిశలో సబర్మతి ఆశ్రమం అభివృద్ధి, విస్తరణ ప్రాజెక్టు పెద్ద ముందడుగుగా ఆయన అభివర్ణించారు. సబర్మతి ఆశ్రమం పరిసరాలలో నివసిస్తున్న కుటుంబాల పట్ల ఆరాధనను వ్యక్తం చేశారు. వారి వల్లనే ఈ విస్తరణ సాధ్యపడిందని ఆయన తెలిపారు. వారి కారణంగానే ఈ అభివృద్ధి ప్రాజెక్టు కోసం 55 ఎకరాల భూమిని ప్రభుత్వం విముక్తం చేయగలిగిందని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News