Saturday, November 23, 2024

దేశ వ్యవసాయాన్ని, స్వయంసమృద్ధిని దెబ్బతీస్తున్న ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -
కేంద్రానికి తగిన బుద్ది చెబుదాం: తెలంగాణ రైతు సంఘం

హైదరాబాద్:దేశ వ్యవసాయ రంగాన్ని , స్వయం సమృద్దిని ప్రధాని నరేంద్రమోడీ దెబ్బతీస్తున్నారని తెలంగాణ రైతుసంఘం ఆరోపించింది. ఢిల్లీలో ఈ నెల 1న అఖిల భారత సహకార మహాసభలో ప్రధాని మోడీ వ్యవసాయంపై చేసిన ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నదని పేర్కొంది.శనివారం తెలంగాణ రైతు సమావేశం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో సంఘం జిల్లా అధ్యక్షులు చల్లారపు తిరుపతి రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి శోభన్ మాట్లాడుతూ మోడీ చేసిన ప్రకటనలు వాస్తవం కావాలని రైతులు కోరుకుంటున్నారని అన్నారు. కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటని ప్రశ్నించారు.

గత తొమ్మిదేండ్లలో భారత వ్యవసాయరంగాన్ని విశ్లేషించినప్పుడు ప్రధాని దేశ వ్యవసాయాన్ని, స్వయం సమృద్ధిని దెబ్బతీస్తున్నరని అన్నారు. ప్రస్తుత 2023-24 బడ్జెట్ పరిశీలిస్తే వ్యవసాయరంగానికి, వ్యవసాయ పరిశోధనలకు, పశుసంవర్ధక శాఖకు కలిపి రూ.1,29,723 కోట్లు ,దేశ బడ్జెట్ మొత్తంలో 2.88 శాతం మాత్రమే కేటాయించారని తెలిపారు. అమెరికా, చైనా దేశాలు తమ బడ్జెట్లో 7 శాతం వ్యవసాయ రంగానికి కేటాయించి ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచుతున్నాయని అన్నారు.

పీఎం ప్రణామ్ పథకం పేరుతో సేంద్రియ వ్యవసాయం వైపు ప్రచారం చేస్తూ ఎరువుల సబ్సిడీకి రూ. 49,402 కోట్లకు కోత పెడుతున్నారని అన్నారు. ఇప్పటికే ఎరువుల వినియోగం శాస్త్రీయంగా పెంచకపోవడం వల్ల ఉత్పాదకత తగ్గుతున్నదని తెలిపారు. హెక్టారుకు చైనాలో 80 టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి కాగా, అమెరికాలో 60 టన్నులు ఉత్పత్తి అవుతున్నాయని, కానీ భారతదేశంలో 25 టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు.

వాస్తవానికి పత్తి, పాలు, మాంసం, మిరప, పసుపు, కోడి గుడ్ల ఉత్పత్తులలో ప్రపంచంలో మనం ప్రథమ స్థానంలో ఉన్నపటికీ, వాటిని దిగుమతులు చేసుకుంటున్నామని అన్నారు. సహకార సంఘాలను తగ్గించి వాటి సంఖ్యను 90 వేలకు కుదించారన్నారు. కార్పొరేట్ సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర రాకుండా చేసి, రైతులు ఆత్మహత్యలకు పాల్పడేటట్టు విధానాలు రూపొందిస్తున్నాయని ఆరోపించారు. మోడీకి బుద్ధి చెప్పడానికి రైతాంగం సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం నేతలు శెట్టిపల్లి సత్తిరెడ్డి, నక్కల యాదవ రెడ్డి, అముదాల మల్లారెడ్డి, మాడోజు కనక చారి, బద్దిపడగ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News