Monday, November 18, 2024

చెత్త కొండలు కనిపించరాదు

- Advertisement -
- Advertisement -
Prime Minister Modi launches Amrut 2.0
నగరాల్లో నూటికి నూరు శాతం చెత్తను ప్రాసెసింగ్ చేయాలి
స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్2.0టలను ప్రారంభించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: మన దేశంలో రోజువారీ వ్యర్థాల్లో దాదాపు 70శాతం వరకు ప్రాసెసింగ్ అవుతోందని, దీన్ని వంద శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీచెప్పారు. నగరాల్లోని చెత్త కొండలను ప్రాసెస్ చేసి పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్)2.0ను ప్రధాని ప్రారంభించారు. దేశంలోని అన్ని నగరాల్లో చెత్తనుంచి విముక్తి కల్పించడం,నీటి భద్రత కల్పించడం లక్షంగా స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0, అమృత్2.0ను రూపొందించారు. ఈ కార్యక్రమాలను ప్రధాని మోడీ శుక్రవారం ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ప్రారంభించారు.అనంతరం మోడీ మాట్లాడుతూ నగరాలను చెత్త రహితం చేయడమే స్వచ్ఛభారత్ మిషన్ 2.0 లక్షమని చెప్పారు. ఈ రెండో దశలో మురుగు నీటి పారుదల, భద్రతా నిర్వహణ లను సాధించాలని అనుకొంటున్నట్లు చెప్పారు. నగరాల్లో నీటి భద్రత కల్పించడం, మురుగు నాలాలు నదుల్లో కలవకుండా చర్యలు తీసుకోవడం ఈ పథకాల లక్షమని చెప్పారు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలు సాకారం కావడానికి ఇది చాలా ముఖ్యమైన ముందడుగని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించడం చాలా గొప్ప విషయమని, సమానత్వం కోసం పట్టణాలు అభివృద్ధి చెందడం చాలా ముఖ్యమని ఆయన నమ్మే వారని చెప్పారు. గ్రామాలనుంచి చాలా మంది మెరుగైన జీవనం కోసం పట్టణాలకు వస్తున్నారని ఆయన గుర్తు చేస్తూ, అయితే వారి జీవన ప్రమాణాలు మాత్రం చాలా సందర్భాల్లో గ్రామాల్లో కంటే అధ్వాన్నంగా ఉంటోందని అన్నారు. ఈ పరిస్థితి మారాలని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ కోరుకునే వారని ప్రధాని అన్నారు. స్వచ్ఛతా ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో యువత చొరవ తీసుకుంటోందన్నారు. ‘ చాక్లెట్లు, టాఫీ కవర్లను నేలపైన పడవేయకుండా జేబులో పెట్టుకుంటున్నారు. అంతేకాదు వాళ్లు ఇప్పుడు రోడ్లపై చెత్త వేయవద్దని పెద్ద వాళ్లను కోరుతున్నారు’ అని ప్రధాని అన్నారు.

మన దేశంలో రోజుకు సుమారు ఒక లక్ష టన్నుల వ్యర్థాల ప్రాసెసింగ్ జరుగుతోందని మోడీ చెప్పారు. ఈ పథకాల ప్రారంభం సమయంలో ఇది 20 శాతమే ఉండేదన్నారు. నేడు రోజువారీ వ్యర్థాల్లో సుమారు 70 శాతం ప్రాసెసింగ్ జరుగుతోందన్నారు. దీన్ని నూటికి నూరు శాతానికి పెంచాల్సిన అవసరముందని తెలిపారు. స్వచ్ఛతా పథకాల రెండో దశలో నగరాల్లోని చెత్త కొండలను ప్రాసెస్ చేసి పూర్తిగా తొలగిస్తామన్నారు. అలాంటి ఓ చెత్త కొండ ఢిల్లీలో చాలా కాలంనుంచి ఉందని, తొలగించడం కోసం ఎదురు చూస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఆ శాఖ సహాయమంత్రి కౌశల్ కిశోర్, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్లణాభివృద్ధి శాఖల మంత్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News