మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోడి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. మన్‌కి బాత్ 74వ ఎడిషన్‌లో భాగంగా ఆదివారం ప్రధాని మోడి ఆలిండియా రేడిలో మాట్లాడారు. సైన్స్‌ను ఆధారంగా చేసుకుని హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్ రెడ్డి వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు సాధించారని చెప్పారు. ఆయన సేంద్రీయ ఎరువులను ఉపయోగించి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారని ప్రధాని కొనియాడారు. వ్యవసాయరంగంలో ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం చింతల వెంకట్ రెడ్డిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని ప్రధాని గుర్తు చేశారు.
మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలోని ఆల్వాల్‌కు చెందిన ప్రముఖ ద్రాక్షరైతు చింతల వెంకట్ రెడ్డి సేంద్రీయ పద్ధతుల్లో సాగుచేసిన ధాన్యం ,గోధుమల్లో డి విటమిన్ అధికమొత్తంలో ఉండేలా ఒక వినూత్న పార్ములాను రూపొందించారు. తన ఫార్ములాపై అంతర్జాతీయ పేటెంట్ కోసం గత ఏడాది దరఖాస్తు చేయగా ,తాజాగా నోటిఫికేషన్ వచ్చింది. పేటెంట్ కోఆపరేషన్ ట్రీటి (పిసిటి) ధ్రువీకరణ ఇచ్చింది. దాంతో ఈ రైతు ఫార్ములాపై 130దేశాల పేటెంట్ ఆఫీసుల్లో దరఖాస్తు చేసుకొని జాతీయ స్థాయి పేటెంట్ హక్కులు పొందే అవకాశ ం అభించింది.