Sunday, January 12, 2025

దేశ యువ జనాభా సత్తాకు ప్రధాని మోడీ ప్రశంస

- Advertisement -
- Advertisement -

వారి సామర్థంతో 2047 నాటికి అభివృద్ధి భారతం అవుతుంది
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ సడస్సులో ప్రధాని

న్యూఢిల్లీ : భారతదేశ యువ జనాభా సామర్థాలు ఎటువంటివి అంటే అభివృద్ధి చెందిన దేశం కావడానికి అవి దోహదం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఉద్ఘాటించారు. ఢిల్లీలో ‘వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, అభివృద్ధి చెందిన దేశం కావాలన్న భారత్ లక్షాన్ని కష్టమైనదిగా కొంత మంది భావించవచ్చు కానీ అది అసాధ్యం కాదని అన్నారు. ‘వికసిత్ భారత్’ స్ఫూర్తి దేశ ప్రతి అడుగును, విధానాన్ని, నిర్ణయాన్ని మార్గనిర్దేశకం చేస్తుంటే భారత్ అభివృద్ధి చెందిన దేశం కాకుండా ఏ శక్తీ అడ్డుకోజాలదని ఆయన అన్నారు. దేశ యువ జనాభా బలం, సంఖ్యలను ఆయన ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. ‘ముందుకు సాగడానికి ఏ దేశానికైనా భారీ లక్షాలు నిర్దేశించవలసి ఉంటుంది& ఇప్పుడు భారత్ ఇదే చేస్తోంది’ అని మోడీ చెప్పారు.

దేశం వివిధ రంగాల్లో గడువు కన్నా ముందే ఎన్నో లక్షాలు సాధిస్తోందని ఆయన తెలిపారు. 2030 నాటికల్లా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిళితం చేయాలని భారత్ లక్షం నిర్దేశించుకున్నదని, ఆ టోగానే దేశం లక్షం చేరుకుంటుందని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఒక్కటే దేశాన్ని ముందుకు తీసుకుపోజాలదని ప్రధాని అన్నారు. ‘వికసిత్ భారత్’ మోడీ ఒక్కరిదే కాదని, మీ అందరిదీ అని ఈ సదస్సు కోసం దేశం అంతటి నుంచి వచ్చిన యువజనులతో ఆయన చెప్పారు. వారి అభిప్రాయాలు దేశ విధానాల్లో భాగం అవుతాయని, దేశానికి దిశ సూచిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆశావహ లక్షాల సాధనకు దేశంలోని ప్రతి పౌరుని క్రియాశీలక భాగస్వామ్యం, సంఘటిత కృషి అవసరమని ఆయన సూచించారు. భారీ లక్షాలు నిర్దేశించుకుని, వాటి దిశగా చిత్తశుద్ధితో కృషి చేయవలసిన ఆవశ్యకత గురించి చెప్పడానికి ప్రధాని మోడీ 1930 దశకంలో ఆర్థిక సంక్షోభం దరిమిలా యుఎస్ ఉత్థానాన్ని, మౌలిక సౌకర్యాలు లేని వెనుకబడిన ప్రాంతం నుంచి ప్రధాన ఆర్థిక శక్తిగా సింగపూర్ వృద్ధి చెందడాన్ని ఉటంకించారు.

భారత్ ఏ విధంగా బహిరంగ మలవిసర్జన రహిత దేశంగా మారిందీ, కొవిడ్ వైరస్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసి, తన జనాభాకు టీకాలు వేసిందీ ప్రధాని మోడీ వివరించారు. 2047 వరకు 25 సంవత్సరాలు భారత్‌కు అమృత్ కాలం అని మోడీ స్పష్టం చేస్తూ, యువ జనాభా వికసిత్ భారత్ కలను సాఫల్యం చేస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని తెలియజేశారు. ఆకస్మిక పరివర్తనకు ఇదే తగిన సమయం అని ఆయన అన్నారు. వచ్చే దశాబ్దంలో ఒలింపిక్స్‌ను నిర్వహించాలని కూడా దేశం ఆశిస్తోందని, పూర్తి అంకితభావంతో ఆ దిశగా కృషి చేస్తోందని ఆయన చెప్పారు. స్వామి వివేకానందకు యువ తరంపై అపార విశ్వాసం ఉందని, అన్ని సమస్యలకు యువజనులు పరిష్కారాలు కనుగొనగలరని అన్నారని ఆయన తెలియజేశారు.

తనకు ఆయన మాటలపై సంపూర్ఱ విశ్వాసం, ‘గుడ్డి నమ్మకం’ ఉన్నాయని మోడీ చెప్పారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన జయంతిని జాతీయ యువజనోత్సవంగా పాటిస్తున్నారు. భారత అభివృద్ధిలో అధిక వృద్ధి పాత్ర గురించి మోడీ నొక్కిచెబుతూ, వివిధ రంగాల్లో దేశ సామర్థం, బడ్జెట్ ఆర్థికవ్యవస్థ వృద్ధితో ఎలా వృద్ధిచెందాయో తెలియజేశారు. మౌలిక వసతుల కోసం బడ్జెట్ పది సంవత్సరాల్లో ఆరింతలు అయిందని ఆయన తెలిపారు. భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థ కావడానికి ముందుకు సాగుతోందని ప్రధాని స్పష్టం చేస్తూ, వచ్చే దశాబ్దం నాటికి అది 10 ట్రిలియన్ డాలర్లను అధిగమిస్తుందని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News