న్యూఢిల్లీ: మణిపూర్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇద్దరు మహిళలపై అమానవీయ ఘటన కలచివేసిందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఘటన140 కోట్ల మంది భారతీయులను సిగ్గుపడేలా చేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమని ప్రధాని పేర్కొన్నారు. నిందతులను విడిచిపెట్టబోమని భారత ప్రజలను భరోసా ఇస్తున్నానని ఆయన వెల్లడించారు.
మణిపూర్ ఘటనపై రాజకీయాలకు అతీతంగా స్పందించాలని ప్రధాని మోడీ కోరారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షం కావడంతో మణిపూర్‌లోని కొండ ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దారుణ ఘటన మే 4న కాంగ్‌పోక్పీ జిల్లాలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఘటనపైమణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌తో చర్చించారు.