మన్‌కీబాత్ లో ఎమర్జెన్సీని గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : 1975లో విధించిన ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు జరిగాయని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు. అలాంటి ధిక్కార ఆలోచనలను ప్రజాస్వామ్య రీతిలో ఓడించిన తీరు ప్రపంచం లోనే మరెక్కడా కనబడదని వ్యాఖ్యానించారు. నెలవారీ “మన్‌కీబాత్” లో భాగంగా ఆయన ఎమర్జెన్సీ నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. జూన్ 25,1975 న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. మార్చి 1977న దాన్ని ఎత్తివేశారు. రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ద్వారా దఖలు పడిన జీవించే, వ్యక్తిగత స్వేచ్ఛాహక్కును సైతం హరించారని, న్యాయస్థానాలు, రాజ్యాంగబద్ధ సంస్థలు, పత్రికలు, ఇలా అన్నింటినీ నియంత్రించారని, అనుమతి లేకుండా ఏ విషయాన్నీ ప్రచురించడానికి వీలుండేది కాదని నిప్పులు చెరిగారు.
ప్రభుత్వాన్ని ప్రశంసించడానికి ప్రముఖ గాయకుడు కిశోర్‌కుమార్ నిరాకరించడంతో ఆయన్ని బహిష్కరించారు. రేడియోలో ఆయన కార్యక్రమాలను అనుమతించలేదని మోడీ గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్యంపై భారతీయులకు ఉన్న విశ్వాసాన్ని మాత్రం సడలించలేక పోయారన్నారు. ప్రజాస్వామ్యం ద్వారానే తిరిగి భారతీయులు ప్రజాస్వామ్యాన్ని తిరిగి ప్రతిష్టించారన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో తానూ పాల్గొన్నానని ప్రధాని తెలిపారు. స్వాతంత్య్రం సిద్ధించి 75వ స్వాతంత్య్రం లోకి అడుగిడిన సందర్భంగా ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను మర్చిపోవద్దని, భవిష్యత్తు తరాలు కూడా దీన్ని మరవొద్దని సూచించారు.