Friday, November 22, 2024

దేశ గౌరవం పెరగాలంటే ప్రధాని మోడీ మళ్లీ గెలవాలి

- Advertisement -
- Advertisement -

ఆయనతోనే భారత్‌కు ప్రపంచస్థాయి గుర్తింపు
మేక్ ఇన్ ఇండియాతో చైనా ఉత్పత్తులకు చెక్ పడింది
భారత్ ఎదుగుదలపై చైనా, పాకిస్తాన్‌లు కుట్రలు
అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి
వాటిని ఓడించాలంటే ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/ హైదరాబాద్ : ప్రపంచస్థాయిలో భారత్ గౌరవం మరింత పెరగాలంటే ప్రధానిగా మోడీ మళ్లీ గెలవాలని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గత 10 సంవత్సరాల్లో మోడీ పాలనతోనే దేశానికి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో చైనా ఉత్పత్తులకు చెక్ పడిందని, ఇప్పుడు ఆ దేశం పాకిస్తాన్ తో కలిసి బిజెపి గెలవకుండా కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో అనేక శక్తులు మోడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, వాటిని తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. గురువారం బాగ్ అంబర్‌పేట డివిజన్‌లో బస్తీ పర్యటన చేశారు. అనంతరం సీఈ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నాలుగు పార్టీలతో దేశంలో ఎన్డీయే కూటమి ఏర్పడిందని, ఇటీవల తమిళనాడులో ప్రాంతీయ పార్టీలను కలిసి మాట్లాడి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించినట్లు తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని, అమెరికా లాంటి అగ్రదేశాలు కూడా కష్టం వచ్చినప్పుడు మోడీని సంప్రదిస్తున్నాయన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మోదీని కలిసి రష్యా – -ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఏదో రకంగా నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచానికి ఒక నాయకుడిగా, దేశానికి ప్రధాని నరేంద్రమోదీ కీలక పాత్ర పోషిస్తున్నారని, గతంలో ఎక్కడా కూడా కనిపించని దేశం మోడీ నాయకత్వంలో ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఉందని పాక్, చైనా దేశాలు సహించలేకపోతున్నాయన్నారు. మేక్ ఇన్ ఇండియాతో చైనా వెనకబడిపోయిందన్నారు. ఆ కారణంగా చైనా దేశం భారత్ మీద కక్ష గట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఓడించాలని కుట్రలు చేస్తోందన్నారు.
మొదటిసారి దేశంలో మార్పు కనిపిస్తోంది: 
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నరేంద్ర మోదీ నాయకత్వంలో మొదటిసారి దేశంలో మార్పు కనిపిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ధి, దేశ గౌరవాన్ని వ్యతిరేకించే శక్తుల ఓట్లు ఎక్కువ పోలయ్యే అవకాశం లేకపోలేదన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతీ ఒక్కరు దేశం కోసం, అభివృద్ది కోసం, దేశ గౌరవం కోసం, ఆధ్యాత్మికం కోసం పోలింగ్ లో పాల్గొనాలని, అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం, కాశీ విశ్వనాథ ఆలయం, రాష్ట్రంలో కూడా అనేక దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటున్నాయని తెలిపారు. పేదవారి సంక్షేమం కోసం నరేంద్రమోడీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందని, పేదవారి ఇంట్లో టాయిలెట్ల నిర్మాణం నుంచి మొదలు చంద్రయాన్-3 వరకు అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోందన్నారు. త్రిపుల్ తలాక్ రద్దు చేసి దేశంలోని10 కోట్ల ముస్లిం మహిళలకు విముక్తి కల్పించిదన్నారు. హైదరాబాద్ నుంచి 4 వందే భారత్ రైళ్లను కల్పించారని, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లను ఆధునీకరణ చేస్తున్నాయని, కేంద్రప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి మా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

ప్రస్తుతం దేశంలో బిజెపికి 302 స్థానాలు ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. దేశంలో గతంలో ఎన్నడూ లేని మెజారిటీని దేశ ప్రజలు మోడీకి ఇవ్వబోతున్నారని, దేశంలో శాంతి భద్రతలు కాపాడటం కోసం, దేశంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ఆయన నాయకత్వంలో నీతివంతమైన ప్రభుత్వం మళ్లీ రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News