న్యూఢిల్లీ : మహా కుంభమేళా దేశ ఐక్యతా స్ఫూర్తిని సుదృఢం చేసిందని, అటువంటి భారీ జన సందోహంతో మేళా నిర్వహించగల భారత సత్తాను ప్రశ్నించినవారికి గట్టి సమాధానం ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉద్ఘాటించారు. ప్రధాని మోడీ లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ, ప్రభుత్వం, సమాజం నుంచి అసంఖ్యాక ప్రజల తోడ్పాటు ఫలితమే మహా కుంభమేళా విజయం అని చెప్పారు. ‘దాదాపు ఒకటిన్నర నెలల పాటు భారత్‌లో మహా కుంభమేళా గురించిన ఉత్సాహాన్ని, ఉత్సుకతను తిలకించాం. కోట్లాది మంది భక్తులు అంకితభావంతో కలసివచ్చిన, సౌకర్యాలు, అసౌకర్యాల గురించిన ఆందోళనలను అధిగమించిన వైనం మన గొప్ప బలానికి తార్కాణం’ అని మోడీ పేర్కొన్నారు.
‘దేశంలోని ప్రతి ప్రాంతం, ప్రతి మూల నుంచి జనం సమీకృతమైన మహోన్నత కార్యక్రమం మహా కుంభమేళా. ప్రజలు తమ స్వాతిశయాలను వీడి ‘నేను’ అని కాకుండా ‘మనం’ అనే భావనతో ప్రయాగ్‌రాజ్‌లో సమీకృతమయ్యారు’ అని ప్రధాని చెప్పారు. ముఖ్యంగా ప్రపంచం అస్తవ్యస్తంగా ఉన్న సమయంలో మహా కుంభమేళాలో భారీ స్థాయిలో సమైక్యత ప్రదర్శన భారత బలాన్ని చాటిచెప్పిందని మోడీ అన్నాను. ‘ఐక్యతా స్ఫూర్తి ఎటువంటి కుయత్నాలనైనా ఛేదించేంత దృఢమైనది’ అని ఆయన పేర్కొన్నారు. ‘భిన్నత్వంలో ఏకత్వం భారత ప్రత్యేకత అని సదా చెబుతున్నాం.
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో దాని మహోన్నత రూపాన్ని చూశాం. ఈ భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతాన్ని సుసంపన్నం చేసుకోవడం మన బాధ్యత’ అని ప్రధాని చెప్పారు. విభిన్న భాషలు, యాసలు మాట్లాడే ప్రజలు త్రివేణి సంగమం తీరాన ‘హర్ హర్ గంగే’ అని నినదించడం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ను చాటిందని, ఇది ఐక్యత భావనను పెంచిందని ఆయన చెప్పారు. భారత్ నవ తరం మహా కుంభమేళాలో పాల్గొనడంఆనందదాయకమని ప్రధాని అన్నారు. అనేక మంది రాజకీయ నాయకులు, నటులు, విదేశీ ప్రముఖులు కూడా కుంభమేళాలో పాల్గొన్నారు.
‘సమస్త ప్రపంచం మహా కుంభమేళా రూపంలో భారత వైభవాన్ని చూసింది. మహా కుంభమేళాలో జాతీయ చైతన్యాన్ని తిలకించాం. ఇది కొత్త విజయాలకు స్ఫూర్తి ఇస్తుంది’ అని ప్రధాని ఉద్ఘాటించారు. ‘మహా కుంభమేళా విజయంలో పలువురు ప్రజల పాత్ర ఉంది. ప్రభుత్వం, సమాజం ‘కర్మ యోగులు’ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని ప్రధాని మోడీ ప్రతిపక్షాల నినాదాలు, నిరసనల మధ్య చెప్పారు. ఆ నిరసనల వల్ల ప్రధాని ప్రసంగం అనంతరం లోక్‌సభను కొద్దిసేపు వాయిదా వేయవలసి వచ్చింది. ప్రధాని మోడీ స్వయంగా ఫిబ్రవరి 5న త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేసి, గంగా మాతకు ప్రార్థనలు చేసిన విషయం విదితమే.