న్యూఢిల్లీ: బుద్ధ పూర్ణిమ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 16న నేపాల్‌లోని లుంబినిని సందర్శిస్తారని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ గురువారం తెలిపింది. నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్‌బ ఆహ్వానం మేరకు ప్రధాని నేపాల్‌ను సందర్శించనున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నరేంద్ర మోడీ నేపాల్‌ను సందర్శించడం ఇది ఐదవసారి. ప్రధాని మోడీ తన లుంబిని పర్యటనలో అక్కడి పవిత్ర మాయాదేవి ఆలయాన్ని సందర్శిస్తారు. నేపాల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని లుంబిని అభివృద్ధి ట్రస్టు నిర్వహించే బుద్ధ జయంతి ఉత్సవాలలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగిస్తారని విదేశాంగ్ శాఖ తెలిపింది. లుంబిని మోనాస్టిక్ జోన్‌లో న్యూఢిల్లీకి చెందిన అంతర్జాతీయ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్(ఐబిసి)కు కేటాయించిన స్థలంలో బుద్ధిస్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ కేంద్రానికి ప్రధాని మోడీ ఒక ప్రత్యేక కార్యక్రమంలో శంకుస్థాపన చేస్తారు. ప్రధాని మోడీ తన పర్యటనలో భాగంగా నేపాల్ ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుపుతారు.