Wednesday, January 22, 2025

భద్రతపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి సమీక్ష

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi's high-level review on security

గ్లోబల్ టెక్ వాడకంపై దృష్టి

ఉక్రెయిన్ వార్‌పై ఆరా

రక్షణ రంగ స్వయం సమృద్ధికి పిలుపు

న్యూఢిల్లీ : ప్రస్తుత ప్రపంచ యుద్ధ వాతావరణంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశ భద్రతా రక్షణ సన్నద్ధతకు పిలుపు నిచ్చారు. ఆదివారం ఆయన ఇక్కడ భద్రతా సన్నద్ధత అంశానికి సంబంధించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. భారతదేశం రక్షణ రంగంలో పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధిని సాధించాల్సి ఉందని సూచించారు. అన్నింటికి మించి అధునాతన రక్షణ సాంకేతికతను సంతరించుకోవల్సి ఉంటుందని, ఈ దిశలో అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులకు పిలుపు నిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాల మధ్య తీవ్ర స్థాయి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ దశలో ఎటువంటి పరిణామాలను అయినా ధైర్యంగా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సర్వంసన్నద్ధం కావల్సి ఉంటుందని ప్రధాని తెలిపారు. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి జై శంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ , జాతీయ భద్రతా వ్యవహారాల చీఫ్ అజిత్ ధోవల్ పాల్గొన్నారు. త్రివిధ దళాల అధినేతలు, పలువురు ప్రభుత్వ సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారని అధికార వర్గాలు తరువాత తెలిపాయి.

ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితి గురించి ఉన్నత స్థాయి అధికారులు ప్రధానికి వివరించారు. ప్రత్యేకించి ఆపరేషన్ గంగ పరిధిలో భారతీయుల తరలింపు ప్రక్రియ గురించి ప్రధాని తెలుసుకున్నారు. ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులను, ఇతర దేశాలకు చెందిన పౌరులను కొందరిని భారత్‌కు తీసుకువచ్చిన విషయం గురించి ప్రధానికి అధికారులు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో సరిహద్దులలోనూ, సముద్ర మార్గాలు, గగనతలంలోనూ సర్వం సన్నద్ధంగా ఉండాల్సి ఉందని , దీని గురించి అన్ని చర్యలూ తీసుకోవాలని సమీక్ష దశలో ప్రధాని స్పష్టం చేశారు. రక్షణ వ్యవహారాలలో భారత్ దిగుమతులపై ఆధారపడటం క్రమేపీ ఆగిపోవాలి. అనేక సంబంధిత విభాగాలలో పూర్తి స్థాయి స్వదేశీయత నెలకొనాలి. దీని వల్ల దేశం స్వయంగా రక్షణలో పటిష్టం కావడంతో పాటు అనుబంధ పరిశ్రమల విస్తరణకు తద్వారా ఆర్థిక రంగ పురోగతికి వీలేర్పడుతుందని, ఈ దిశలో రక్షణ రంగ సాధనాసంపత్తి తయారీ దిశలో పరిశ్రమలను మరింతగా బలోపేతం చేయాల్సి ఉంటుందని ప్రధాని తెలిపారు.

అటు ఉక్రెయిన్ ఇటు రష్యాతో భారత్‌కు ఉన్న సత్సంబంధాలు ప్రత్యేకించి విద్యా వైద్య ఇతర రంగాలలో పరస్పర సహకారం నేపథ్యంలో సమీకరణలలో ఎటువంటి మార్పు తలెత్తకుండా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రధాని సూచించారు. రక్షణ రంగంలో ఇప్పుడు చేపట్టిన అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఇక ముందుతీసుకువచ్చే మార్పు గురించి ప్రధాని ఈ దశలో తెలుసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా భద్రతా విషయాలలో సైనిక దళాలు వినియోగిస్తున్న ఆయుధాలు , గ్లోబల్ టెక్ పరిజ్ఞానం గురించి ఆరా తీశారు. ప్రపంచ స్థాయిలో తలెత్తుతున్న రక్షణ రంగ సాంకేతికను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుని, అందుకు అనుగుణంగా తగు మార్పులు చేర్పులు చేసుకునితీరాల్సి ఉందని తెలిపారు. ఇటీవల ఉక్రెయిన్‌లో యుద్ధం దశలో మృతి చెందిన భారత విద్యార్థి శేఖరప్ప భౌతిక కాయం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఉన్నత స్థాయి అధికారులకు సూచించారు.

18000 మంది భారతీయుల తరలింపు

యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకూ 18000కు పైగా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చారు. పాకిస్థాన్, నేపాల్, శ్రీలంకకు చెందిన కొందరు పౌరులను కూడా తరలించారు. కేంద్రం చేపట్టిన ఆపరేషన్ గంగ ఈ వారం పూర్తి అయింది. అత్యవసర పరిస్థితులలో ఇప్పటికీ ఎవరైనా భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుపడి ఉంటే వారిని కూడా రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. రెడ్ క్రాస్ ఇతర సహాయ సంస్థలతో ఉక్రెయిన్, రష్యా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ భారతీయుల తరలింపు ప్రక్రియను వేగవంతం చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News