Wednesday, January 22, 2025

ప్రధాని మోడీ రైతులకిచ్చిన హామీలు నెరవేర్చాలి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సంయుక్త కిసాన్‌మోర్చా డిమాండ్ చేసింది. కేంద్ర మోడీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, 2021 అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్ లోని లకింపూర్ ఖేరిలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతులపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు చేసిన హత్యాకాండను ఖండిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం), కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ‘బ్లాక్ డే’ గా పాటిస్తూ మంగళవారం నారాయణగూడ ఫ్లై ఓవర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.

సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్.కె.ఎం), కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోడీ ప్రభుత్వం రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి..మద్దతు ధరలు గ్యారెంటీ చట్టం తేవాలి.. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలి.. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్లు టి సాగర్, పశ్య పద్మ,ప్రసాదన్న, ఎన్ బాల మల్లేష్, కార్మిక సంఘాల నాయకులు పాలడుగు భాస్కర్, బాలరాజు, చంద్రశేఖర్, సూర్యం మాట్లాడారు.

ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా ఉత్తరప్రదేశ్ లకింపూర్ ఖేరిలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్న రైతులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అశీష్ మిశ్రా కార్లతో తొక్కించి నలుగురు రైతు ఉద్యమకారులను అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగిందన్నారు. ఈ హత్యాకాండకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసినా కేంద్ర మోడీ ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. హత్యాకాండకు కారణమైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని, అతని కుమారుడను,బిజెపి గుండాలను కఠినంగా శిక్షించాలని దేశం యావత్తు ముక్తకంఠంతో నినదించిన కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా లకింపూర్ ఖేరి హత్యాకాండ కు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హమీలను అమలు చేయకుండా రైతాంగాన్ని మోసగించి, దగా చేసిందన్నారు. మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందన్నారు.రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుణ విమోచన చట్టాన్నితెచ్చి రైతాంగాన్ని ఆత్మహత్యల నుండి రక్షిస్తామని వట్టి మాటలు చెప్పారన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లులో వ్యవసాయరంగాన్ని మినహాయిస్తామని హామీ ఇచ్చి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేలా కేంద్ర విద్యుత్ సవరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. రైతు ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను రద్దు చేస్తామని హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ఏ ఒక్క హామీని అమలు పర్చకుండా మరోవైపు దొడ్డి దారిన రద్దు చేసిన వ్యవసాయచట్టాలను తిరిగి పునరుద్ధరించే పద్ధతుల్లో,కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసే విధంగా అనేక ప్రయత్నాలను మోడీ ప్రభుత్వం చేస్తోందన్నారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని కోరారు. మోడీ ప్రభుత్వ రైతాంగ,కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక,కర్షక ఐక్యతతో తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని కిసాన్‌మోర్చా నేతలు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News