Monday, December 23, 2024

ప్రధాని ప్రసంగం.. గురువిందగింజ చందం

- Advertisement -
- Advertisement -
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా

హైదరాబాద్ : వరంగల్ సభలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రసంగం గురివిందగింజ సామెతను గుర్తు చేస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. పునర్విభజన చట్టంలోని హామీలను వరంగల్ జిల్లాలోని తన ప్రసంగంలో ఏమాత్రం ప్రస్తావించకపోవడం మరోమారు తెలంగాణ ప్రజలను వంచించారని అన్నారు. రాష్ట్రానికి కేంద్రం అమలు చేయాల్సిన హామీలను విస్మరించి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలకే ప్రధాని పరిమితమైనారన్నారు. పునర్విభజన చట్టంలోని హామీలను తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి ఇంకా అమలు చేయని ప్రధాని ఎన్నికలు దగ్గర పడుతుండటంతో హడవుడిగా శంకుస్థాపనలు చేశారని ఎద్దేవా చేశారు.

రూ.20 వేల కోట్లతో నిర్మించాల్సిన కోచ్ ప్యాక్టరీ బదులు కేవలం రూ. 519 కోట్లతో వ్యాగెన్ రిపేరు యూనిట్‌గా మార్చి శంకుస్థాపన చేయడం మోసం చేయడమే అవుతున్నదని అన్నారు. తెలంగాణలో ఉద్యోగాల గురించి మాట్లాడిన నరేంద్రమోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బిజెపి హామీని మరిచి ఇక్కడి ఉద్యోగాల గురించి మాట్లాడటం విడ్డూరంగా వున్నదని అన్నారు.

పుల్వామా ఘటన, చైనాతోయుద్దం, త్రిబుల్ తలాక్, ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతి, కర్నాటకలో బజరంగ్ బలికి ఓట్లు వేయడం లాంటి భాష వాడటం తీవ్ర అభ్యంతరకరం అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ పర్యటనను నిరసిస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులోభాగంగా రెండో రోజు వివిధ ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించడం జరిగిందని, కొత్తగూడెంలో జరిగిన నిరసన ప్రదర్శనలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా తాను పాల్గొని, నిరసన తెలియజేసినట్లు కూనంనేని సాంబశివ రావు వెల్లడించారు.

కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, రామగుండం, శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి, భూపాలపల్లి తదితర అన్ని సింగరేణిలో ప్రాంతాలలో దాదాపు 12 వేల కార్మికులు నల్లబ్యాడ్జీలను ధరించి మోడీ రాకను నిరసిస్తూ విధులకు హాజరయ్యారన్నారు. అదే విధంగా సిపిఐ పార్టీ అనుబంధ ప్రజాసంఘాలు హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్దూం భవన్ నుండి హిమాయత్‌నగర్ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారని కూనంనేని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News