Friday, December 20, 2024

భారత్, మాల్దీవుల మధ్య ప్రధాని మోడీ టూర్ చిచ్చు

- Advertisement -
- Advertisement -

మోడీ లక్షదీవుల పర్యటనపై చౌకబారు వ్యాఖ్యలు చేసిన మాల్దీవుల మంత్రులు

తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్

మాల్దీవుల దౌత్యాధికారులను పిలిపించి వివరణ కోరిన ప్రభుత్వం

వెంటనే ముగ్గురు మంత్రులను పదవుల నుంచి తొలగించిన మాల్దీవుల ప్రభుత్వం

మాలే/న్యూఢిల్లీ : భారత్‌ను, ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ వ్యాఖ్యలకు దిగిన ముగ్గురు మాల్దీవుల మంత్రులను పదవుల నుంచి తొలిగించారు. లక్షద్వీప్‌ను పర్యాటక విడిదిగా మరింత విస్తృతంగా ప్రచారం చేయాలనే భారత ప్రధాని నరేంద్ర మోడీ తపన, అక్కడ జరిపిన పర్యటన, విన్యాసాలు పలు రకాల పరిణామాలకు దారితీశాయి. ప్రధాని మోడీపై మరో పర్యాటక విడిది దేశం మాల్దీవుల మంత్రులు స్పందించడం, ఈ దశలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఇది పలు విధాలుగా మలుపులు తిరిగింది. ప్రధాని మోడీని, భారతదేశానికి కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఇద్దరు ముగ్గురు మాలే మంత్రులు, ఎంపిలు, సీనియర్ అధికారుపై అక్కడి ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలకు దిగింది. మంత్రులను సస్పెండ్ చేశారు. అధికారులను పదవుల నుంచి తొలిగించారు.

ఒక్కరోజు వ్యవధిలోనే ఈ పరిణామాలన్ని జరిగాయి. మంత్రులుగా ఉండి , సామాజిక మాధ్యమాల ద్వారా భారతదేశ ప్రధానిని దుర్భాషలాడుతూ స్పందించిన మంత్రులు మర్యం షుయీనా, మైషా షరీఫ్, మహజూం మజీద్‌లను సస్పెండ్ చేశారు. వీరి అభిప్రాయాలు వ్యక్తిగతం , మాలే ప్రభుత్వంతో సంబంధం లేనివని ముందుగా మాల్దీవుల ప్రభుత్వం తెలిపింది. మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వశాఖ తరఫున ఆదివారం ఓ ప్రకటన వెలువడింది. విదేశీ నేతలు, అత్యున్నత స్థాయిలోని వ్యక్తులను కించపరుస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా ఎంతటివారైనా స్పందించడం జరిగితే , అది సహించరానిదే అవుతుందని పేర్కొన్నారు. వీరి వ్యాఖ్యలు వారి వారి సొంతం అనుకుంటున్నాం. వీటితో ప్రభుత్వానికి సంబంధం లేదని తెలిపారు. లక్షద్వీప్‌లోని ప్రిస్టెన్ బీచ్ వద్ద ప్రధాని మోడీ విహార యాత్రకు దిగడం, సీవాక్ ఇతర విన్యాసాలకు పాల్పడి, లక్షద్వీప్ పర్యాటక విడిదిగా అనన్య సామాన్యం కావడానికి అన్ని అర్హతలతో ఉందని పేర్కొనడం, దిగిన ఫోటోల వీడియోలు వైరల్ చేయించడం వంటి పరిణామాలు క్రమేపీ మాల్దీవులకు , భారత్‌కు అగాధం పెంచాయి.

వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ వర్తిస్తుంది. అయితే ఇది ప్రజాస్వామిక రీతిలో , బాధ్యతాయుత తరహాలో ఉండాల్సిందే. చేసే వ్యాఖ్యలు విద్వేషపూరితం, ప్రతికూల ప్రభావితం అయితే వీటిని అనుమతించేది లేదని మాల్దీవుల విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపారు. మాల్దీవులు, ఇతర అంతర్జాతీయ భాగస్వామ్యపక్షాలు నడుమ సత్సంబంధాలను దెబ్బతీసే ఎటువంటి వ్యాఖ్యలను అయినా తాము అనుమతించేది లేదని ముందుగా తెలిపిన మాల్దీవుల ప్రభుత్వం తరువాత సదరు మంత్రులను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రత్యేకించి పొరుగున ఉన్న భారతదేశంతో ఇప్పటి సంబంధాలు ఎప్పటినుంచో సాగుతున్నవి. వీటిని దెబ్బతీసే వ్యవహారశైలి అసంకల్పితం అయినా అనుచితం అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మాల్దీవుల బదులు లక్షదీప్‌ను పర్యాటక విడిదిగా ఎంచుకుని తీరాలి. విదేశీ పర్యాటక ఆలోచనలకంటే ముందు స్థానిక పర్యాటక స్థలాలపై దృష్టి పెట్టాలని ప్రధాని మోడీ తమ సందేశంలో పేర్కొన్నారు.

లక్షదీవులలో ఎక్కువ సేపు పర్యటించిన ఆయన పలువిధాలుగా దాదాపు అత్యంత సాహస, ఉత్తేజభరిత విన్యాసాలకు దిగారు. సముద్రంలో ప్రధాని మోడీ జరిపిన స్నోర్కెలింగ్ ఇతర విన్యాసాల ఫోటోలు సంచలనానికి దారితీశాయి. అయితే దీనిపై మంత్రుల వ్యాఖ్యలు ఉడుకుమోతుతనంగా ఉన్నాయని నిరసనలువ్యక్తం అయ్యాయి. మాల్దీవుల ప్రతిపక్షాలు, దేశ మాజీ అధ్యక్షులు మెహమ్మద్ నషీద్ నుంచి కూడా తీవ్ర ఖండనలకు దారితీశాయి. మంత్రులు ఎంపిలు ఇతరుల వ్యాఖ్యలపై భారతదేశం స్పందించింది. భారత్‌లోని మాలే దౌత్యాధికారులను పిలిపించి వివరణ కోరారు. మరో వైపు మాల్దీవుల్లోని భారతీయ హైకమిషన్ కూడా ఈ అంశంపై తీవ్రస్థాయిలో స్పందిచింది.
ఇష్టమొచ్చిన రీతిలో మంత్రుల స్పందనలు
లక్షద్వీప్‌లో ప్రధాని మోడీ విన్యాసాలు పరమ చెత్తగా, అత్యంత వెకిలీగా విదూషికుడుగా, అంతకు మించి తోలుబొమ్మలోడిగా ఉన్నాయని పలువురు మంత్రులు ట్వీట్లకు దిగారు. ప్రత్యేకించి మంత్రి షూయినా మోడీపై, భారతదేశంపై పరుష పదజాలానికి దిగారు. ఈ దేశానికి పర్యాటక సామాజిక స్పృహ ఉందా? ఆ దేశానికి పర్యాటకానికి వెళ్లిన విదేశీయులు అక్కడి రోడ్లు చూసి జడుసుకుంటారు, వాష్‌రూంలకు వెళ్లి వస్తే రోజుల తరబడి అక్కడి దుర్వాసనలతో కళ్లు తేలేస్తారు. మరీ ఆ దేశ ప్రధాని ఏ ముఖం పెట్టుకుని తమ దేశానికి రావాలని పిలుపు నిస్తారు? ఇదంతా విదూషికుడి సర్కస్ బఫూన్ పద్ధతిగా ఉందని మంత్రులు మండిపడ్డారు. మొత్తం మీద భారత్‌కు చేతకాని తనం ఎక్కువ , వెర్రి ఆశలతో కొట్టుమిట్టాడుతోందని కూడా సీనియర్ అధికారులు ప్రధాని మోడీపైతిట్లకు దిగారు.

భారత్‌కు పర్యాటక రంగం విషయంలో పలు సవాళ్లు ఉన్నాయి. మాల్దీవులను భారత్ ఏ కోశానా కూడా తట్టుకోలేదని కూడా మంత్రులు స్పందించారు ఇక్కడి రిసార్ట్‌లకు అక్కడి పర్యాటక స్థలాలకు పోలిక పొంతన లేదని కూడా మాల్దీవుల అధికారులు దాడికి దిగారు. సీనియర్ అధికారులతో పాటు మాల్దీవుల ఎంపి జహీద్ రమీజ్ కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. ప్రధాని మోడీ దేనికోసమో ఎగిరి గంతేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. మంత్రులు ఇతరుల వ్యాఖ్యలను దేశ మాజీ విదేశాంగ మంత్రి అబ్దుల్లా షహీద్ కూడా ఖండించారు. ఇటువంటి భాషను వాడి ఎటువంటి సంకేతాలు ఇస్తారని ప్రశ్నించారు. మాజీ అధ్యక్షులు నౌషీద్ ప్రెసిడెంట్ మెహమ్మద్ ముయిజూ ప్రభుత్వం సరిగ్గా స్పందించాల్సి ఉందని హితవు పలికారు. ఇప్పటికే నష్టం జరిగిందని, వెంటనే దేశ అధ్యక్షులు స్పందించి, మంత్రులపై చర్యలకు దిగాలని, వారి వైఖరితో ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఉపాధ్యక్షులు అహ్మద్ అబీవ్ ఇతరులు కూడా ఈ ఘటనపై భారత్‌కు బాసటగా నిలిచారు. దేశంలోని మాల్దీవ్స్ నేషనల్ పార్టీ కూడా తీవ్రంగా స్పందించింది. కొందరి వైఖరి ఆమోదయోగ్యం కాదని పార్టీ తెలిపింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో మాల్దీవులు భారతదేశానికి అత్యంత సమీప పొరుగుదేశంగా ఉంది. ఈ ప్రాంతంలో ఇరు దేశాల నడుమ పలు కీలకమైన సాగర్ అంటే హిందూమహాసముద్రంలో భద్రతా ప్రగతి వంటి పలు ఇన్షియేటివ్‌లలో భాగస్వామ్యం ఉంది. పైగా మాల్దీవుల పట్ల మోడీ ప్రభుత్వం ఇరుగుపొరుగు ప్రాధాన్యత క్రమంలో విశిష్ట స్థానం దేశంగా సాయం అందిస్తోంది.

“భారత్‌కు పర్యాటక సామాజిక స్పృహ ఉందా? ఆ దేశానికి పర్యాటకానికి వెళ్లిన విదేశీయులు అక్కడి రోడ్లు చూసి జడుసుకుంటారు, వాష్‌రూంలకు వెళ్లి వస్తే రోజుల తరబడి అక్కడి దుర్వాసనలతో కళ్లు తేలేస్తారు. మరీ ఆ దేశ ప్రధాని ఏ ముఖం పెట్టుకుని తమ దేశానికి రావాలని పిలుపు నిస్తారు? ఇదంతా విదూషికుడి సర్కస్ బఫూన్ పద్ధతిగా ఉంది.”
-ట్విట్టర్‌లో మాల్దీవుల మంత్రి షుయీనా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News