Thursday, January 23, 2025

ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశానికే కాకుండా ప్రపంచానికి నాయకుడిగా ఎదిగారు

- Advertisement -
- Advertisement -
  • కేంద్ర సాంసృతిక, పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి

ఆమనగల్లు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశానికే కాకుండా ప్రపంచానికి నాయకుడిగా ఎదిగారని కేంద్ర సాంసృతిక, పర్యాటక ఈశాన్న రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్ధేందుకు ప్రధాని మోదీ విజన్‌తో ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన ప్రగతి విజయాలు, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడానికి దేశ వ్యాప్తంగా మహజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

ఆమనగల్లు పట్టణంలో నూతనంగా నిర్మించిన బిజెపి కార్యాలయ భవనాన్ని మంగళవారం జాతీయ బిసి కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారితో కలిసి మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ పాలనా దక్షతతో భారతదేశం అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగి ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిందని చెప్పారు. దేశ అభ్యున్నతి, పేదరిక నిర్మూలన కోసం అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకొని చారిత్రాత్మకమైన సంస్కరణలు అమలు చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. దేశ భద్రత విషయంలో మోదీ తీసుకున్న నిర్ణయాల మూలంగా దేశంలో తీవ్రవాదం, మత కల్లోలాలు తగ్గిపోయాయని ఆయన అన్నారు.

370 ఆర్టికల్ రద్దు, త్రిపుల్ తలాక్ చట్టం రద్దు, రామజన్మభూమి సమస్య వంటి సాహసోసేతమైన నిర్ణయాలను తీసుకొన్నారని అన్నారు. దాయాది దేశమైన పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఏకాకిని చేసిందని, పాకిస్తాన్‌కు ఇతర దేశాల నుండి ఆర్థిక సాయం అందకుండా కట్టడి చేసిన ఘనత మోదీదే అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో భారత్ ప్రపంచలోనే రికార్డు సృష్టించిందని అత్యంత వేగవంతంగా రహదారుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ. 1.20 లక్షల కోట్ల నిధులతో జాతీయ రహదారుల నిర్మాణాలు చేపట్టి 31 జిల్లాలకు అనుసంధానం చేయడం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం క్రింద ఎకరాకు ఏడాదికి రూ. 10వేలు అందిస్తే, కేంద్ర ప్రభుత్వం రూ. 6వేలు నగదు సాయం, ఎరువుల సబ్సిడీ ద్వారా రూ. 18.250లు అందిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు.

తుక్కుగూడ నుంచి శ్రీశైలం హజీపూర్ వరకు నాలగులైన్ల జాతీయ రహదారి విస్తరణకు రూ. 1750 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ జడ్పిటిసి కండె హరిప్రసాద్, అర్జున్‌రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, చెక్కల లక్ష్మణ్, కాసుల వెంకటేష్, రాంపాల్ నాయక్, దుర్గయ్య, గోరేటి నర్సింహ్మా, శ్రీకాంత్‌సింగ్, బక్కికుమార్, మన్నే నాయక్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News