Wednesday, November 20, 2024

విదేశాల్లో శ్రుతిమించిన నమోస్తుతి

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల ఆరు రోజుల పర్యటన విజయవంతంగా ముగిసినట్లు విదేశాంగశాఖ ప్రతినిధి అరిందవ్‌ు బాగ్చీ బుధవారం నాడు ట్వీట్ చేశారు.భాగస్వామ్య దేశాలతో బంధం మరింతగా బలపడినట్లు పేర్కొన్నారు. గురువారం నాడు ఢిల్లీ చేరుకున్న ప్రధాని స్వాగతం పలికిన బిజెపి మద్దతుదార్లతో మాట్లాడుతూ పర్యటనలో ప్రతి క్షణం దేశ బాగు కోసమే వెచ్చించినట్లు చెప్పారు. అఫ్ కోర్స్ ఒక పర్యటన ఫలితాలు, పర్యవసానాలు వెంటనే వెల్లడికావు అన్నది తెలిసిందే. తొలిసారిగా ప్రధాని పదవిలోకి వచ్చిన తరువాత వరుసబెట్టి విదేశీ ప్రయాణాలు చేశారు. ఎక్కువకాలం విమానాల్లోనే గడిపినట్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఎందుకు ఇలా తిరుగుతున్నారు అంటే విదేశాల్లో దేశ ప్రతిష్ఠను పెంచేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అని మోడీ మద్దతుదారులు, బిజెపి పెద్దలు చెప్పారు.

తొమ్మిది సంవత్సరాలు గడిచినా దాని ఫలితాలు పెద్దగా కనిపించలేదు.విదేశాల్లో దేశ ప్రతిష్ఠను కొలిచేందుకు కొలబద్దలు లేవు. నిజంగా మోడీ పెంచారనే అనుందాం, దాని వలన దేశానికి ఒరిగిందేమిటి? మన ప్రమేయంతో పరిష్కారమైన సమస్యలేమీ లేవు. సేవా రంగంలో పెట్టుబడుల పెరుగుదల మోడీ ప్రభావంతో జరిగితే, ఉత్పత్తి రంగంలోకి ఎందుకు రాలేదు. గతేడాది డిసెంబరు 28న టైవ్‌‌సు ఆఫ్ ఇండియా ప్రచురించిన విశ్లేషణ ప్రకారం సేవా రంగంలో ఏప్రిల్ 2000 నుంచి 2014 మార్చి నెల వరకు విదేశీ పెట్టుబడులు 80.51 బి.డాలర్లుండగా, అప్పటి నుంచి 2022 మార్చి నెల వరకు 153 బి.డాలర్లకు పెరగ్గా ఉత్పాదక రంగంలో ఇదే కాలంలో 77.11 బి.డాలర్ల నుంచి 94.32కు మాత్రమే పెరిగాయి. దీన్ని బట్టి చైనాను వెనక్కు నెట్టేసి మన దేశం ప్రపంచ కర్మాగారంగా మారనుందని చేస్తున్న ప్రచారం వాస్తవంకాదని తేలింది.అందువలన తాజా పర్యటన గతానికి భిన్నం గా తెల్లవారేసరికి ఏదో ఒరగబెడుతుందని భావించనవసరం లేదు.

ప్రధాని తాజా టూర్ గురించి అతిశయోక్తుల ప్రచారం మొదలైంది. పొగడ్తలు పొగ చెట్టువంటివి. పొగ కనిపిస్తుంది గానీ ఎంత కోసినా గుప్పెడు కాదు, కడుపు నింపదు, దాహం తీర్చదు. కొద్ది సేపు ఉండి అదృశ్యమవుతుంది.ఒక ప్రధానికి లేదా మరొక ప్రముఖుడిని పొగడ్తలతో ముంచెత్తితే దేశానికి, జనానికి ఒరిగేదేమిటి అన్నదిప్రశ్న. పాపువాన్యూగినియా ప్రధాని నరేంద్ర మోడీకి పాదాభివందనం చేశాడని, అక్కడి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి రాత్రి పూట స్వాగతం పలికారని ఇవన్నీ నరేంద్ర మోడీ ఘనతగా చిత్రించారు. కొన్ని అంశాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. తమ అవసరాల కోసం నరేంద్ర మోడీని మునగ చెట్టు ఎక్కించేందుకు చూశారు. మోడీ మీరు అంత పెద్ద సంఖ్యలో గుమికూడుతున్నవారితో ఎలా నెట్టుకురాగలుగుతున్నారో చూసిన తరువాత మీ ఆటోగ్రాఫ్ (ఒక పుస్తకం మీద లేదా ఒక కాగితం మీద అభిమానులు సినిమా వాళ్లను, ఇతర ప్రముఖులను సంతకాలు అడగటం తెలిసిందే) తీసుకోవాలనిపిస్తోందని అమెరికా అధినేత జో బైడెన్ అడిగినట్లు వార్తలు. ఇద్దరి మధ్య సంభాషణల సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ ‘మీరు నాకు నిజంగా ఒక సమస్య తెస్తున్నారు.

వచ్చే నెలలో వాషింగ్టన్‌లో మీకోసం ఒక డిన్నర్ ఏర్పాటు చేస్తున్నాము. దేశమంతటి నుంచి ప్రతివారూ దానికి రావాలని కోరుకుంటున్నారు. నా దగ్గర (టికెట్ల) ఆహ్వానాల కొరత ఏర్పడింది. ( పశ్చిమ దేశాల్లో ప్రముఖులతో కలసి విందులు ఆరగించేందుకు వెల చెల్లించి ఆహ్వానాలను కొనుక్కుంటారు, ఎందుకంటే అక్కడ ఏదీ ఊరికే పెట్టరు) నేను హాస్యమాడుతున్నట్లు మీరు అనుకోవచ్చు. నా సిబ్బందిని అడగండి. నేను గతంలో ఎన్నడూ చూడని విధంగా సినిమా నటుల నుంచి బంధువుల వరకు ప్రతివారి నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. మీరు ఎంతో ప్రాచుర్యం పొందారు. ప్రధాని గారూ మనం చతుష్టయం (క్వాడ్)లో చేస్తున్న దానితో సహా మీరు ప్రతిదాని మీద గణనీయమైన ప్రభావం కలిగిస్తున్నారు.పర్యావరణం మీద కూడా మౌలిక మార్పును తెచ్చారు. ఇండో పసిఫిక్‌లో మీ ప్రభావం ఉంది, మీరు ఎంతో తేడాకు కారకులుగా ఉన్నారు’ అని బైడెన్ అన్నట్లుగా పత్రికల్లో వచ్చింది.
మోడీ బైడెన్ మాట్లాడుకుంటుండగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్ కూడా వచ్చాడట. వారితో మాట కలుపుతూ సిడ్నీ నగరంలో పౌర ఆహ్వానానికి వసతి ఇరవై వేల మందికి మాత్రమే సరిపోతుంది, వస్తున్న వినతులన్నింటినీ అంగీకరించలేకపోతున్నాను అన్నాడట. మీరు గెలిచినపుడు నరేంద్ర మోడీ స్టేడియంలో తొంభై వేలకు పైగా వచ్చిన వారిని సర్దుబాటు చేసిన తీరు గుర్తుకు వస్తోంది అన్నాడట. అప్పుడు మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలని ఉందని బైడెన్ మన ప్రధాని మోడీతో అన్నాడట. ఈ ఉదంతం గురించి వేరే విధంగా స్పందించనవసరం లేదు. విదేశీ నేతలు అలా మాట్లాడకపోతేనే ఆశ్చర్యపడాలి. గత జి 7 సమావేశాల్లో కూడా వెనుక నుంచి వచ్చి మోడీ భుజం తట్టి బైడెన్ పలుకరించినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. బైడెన్, అల్బనీస్ అలా మాట్లాడినపుడు నరేంద్ర మోడీ స్పందన ఏమిటన్నది వార్తలలో రాలేదు.

దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. మీడియాకు ఈ అంశాలను చెప్పిన వారు కేవలం నరేంద్ర మోడీ గొప్పను పెంచేందుకు పనికి వచ్చే వాటిని మాత్రమే వెల్లడించారన్నది స్పష్టం. వారు అలా పొగుడుతుంటే మోడీ మౌనంగా ఉంటారని, ఉన్నారని ఎలా అనుకోగలం? మర్యాద కోసమైనా మోడీ ఎలా స్పందించిందీ చెప్పాలని అధికార గణానికి తోచలేదా? లేక మోడీ కూడా ప్రతిగా వారిని పొగిడి ఉంటే ఒకరినొకరు పొగుడుకున్నారని జనం భావిస్తారు గనుక ఒక భాగాన్ని మాత్రమే విలేకర్లతో చెప్పారన్నది స్పష్టం.
ఇక ఆస్ట్రేలియా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీ సిడ్నీ సభలో మరిన్ని పొగడ్తలను పొందారు. విశ్వగురు, ప్రపంచ నేత అని ఇప్పటి కే ప్రధాని గురించి చెబుతున్న అంశం తెలిసిందేమో ప్రధాని మోడీ ఈస్ ద బాస్ అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ సభికులకు పరిచయం చేశారు. సుప్రసిద్ద రాక్ స్టార్ బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ అభిమానులు అతన్ని బాస్ అని పిలుస్తారని ప్రధాని నరేంద్ర మోడీ కూడా అలాంటి వారేనని అన్నాడు.

గతంలో ఇదే వేదిక మీద బ్రూస్ స్ప్రింగ్ స్టీన్ను చూశాను ప్రధాని నరేంద్ర మోడీ మాదిరి స్వాగతం లేదు అని కూడా అల్బనీస్ అన్నాడు. ఏడాది క్రితం ఇదే రోజున ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశాను. అప్పటి నుంచి ఆరు సార్లు మేము కలుసుకున్నామంటే రెండు దేశాల మధ్య సంబంధాలు ఎంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని ఆల్బనీస్ చెప్పాడు. హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబులు వేయించి మారణ హోమానికి కారకురాలైన అమెరికా అధినేతలందరూ దాన్ని గురించి మరచిపోదాం అంటారు తప్ప క్షమాపణ చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన బైడెన్‌తో కలసి కూర్చున్న మన ప్రధాని మోడీ అమెరికా దుర్మార్గాలకు నిలువెత్తు చిహ్నంగా ఉన్న హిరోషిమా బాధితుల స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు. జి 7 వేదిక మీద అదే అమెరికాతో కలసి శాంతి వచనాలు వల్లించారు.

ఇక జి7 సమావేశంలో నరేంద్ర మోడీ ప్రత్యేకతను గురించి చెప్పేందుకు ఆ సమావేశంలో మోడీ ధరించిన కోటును విశ్లేషకులు ఎంచుకున్నారు. వాడి పారేసిన ప్లాస్టిక్ నీళ్ల సీసాలను కరగించి దానికి వేరే పదార్ధాలను కలిపి దారాలుగా మార్చి దానితో కుట్టిన కోటును మోడీ ధరించటం జి7 సమావేశం మీద ప్రతిధ్వని ప్రభావం కలిగించిందని ఒక విశ్లేషకుడు వర్ణించారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే ధరించిన ఆ కోటుతో వాతావరణ మార్పుల, పర్యావరణ అనుకూల సందేశాన్ని ఆ సమావేశంలో మోడీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. చెప్పుకొనేందుకు వేరే ఏమీ లేనపుడు ఇలాంటి కబుర్లతో పేజీలు నింపటం కొత్తేమీ కాదు.

జి 7లో వేసుకున్న పనికిరాని ప్లాస్టిక్‌తో రూపొందించిన పాలిస్టర్ కోటు రంగు వేరేది, కానీ ఫిబ్రవరి ఎనిమిదిన మరొక కోటు ధరించి పార్లమెంటుకు వచ్చారు. అంతకు ముందు భారత ఇంధన వారోత్సవాలలో బెంగళూరులో ఐఒసి కంపెనీ ఈ కోటును ప్రధానికి బహూకరించింది. అదే రోజు పార్లమెంటులో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ధరించిన శాలువ గురించి బిజెపి వివాదం రేపింది. ప్రధాని రీసైకిల్డ్ దారంతో ఉన్న తక్కువ ఖర్చుతో చేసిన జాకెట్ ధరించగా ఖర్గే శాలువ ఖరీదు రూ. 56,332 అని ట్వీట్లు చేసింది. నరేంద్ర మోడీ ఎక్కడకు వెళితే అక్కడి వేషాలను (దుస్తులను) వేసుకుంటారన్నది మన జనానికి బాగా తెలిసిందే. ఈ అంశంలో గతంలో ఇందిరా గాంధీకి ఆ పేరు ఉండేది, దాన్ని మోడీ తుడిచివేసి తన పరంపరను ప్రారంభించారు. దాన్ని తలదన్నే విధంగా ఎవరు ఉంటారో చరిత్రకే వదలివేద్దాం.
ఇక నరేంద్ర మోడీ, ఇతర నేతలు ధరించిన దుస్తుల గురించి దేశంలో పెద్ద చర్చే జరిగింది, కొనసాగుతోంది కూడా. కాలమహిమ ఏమంటే గతంలో నెహ్రూ మీద నిరంతరం దాడి చేసే తెగకు చెందిన ప్రధాని అదే నెహ్రూ కోటుగా జనంలో ప్రాచుర్యం పొందిన పొట్టి కోటునే నరేంద్ర మోడీ కూడా ధరించారు, అలాంటి వాటిని 2018లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జె ఇన్‌కు బహుమతిగా పంపారు. దాన్ని ధరించి చూడండి నేను మోడీ పొట్టి కోటును ధరించాను అని మూన్ ట్వీట్ చేశారు. తాను భారత సందర్శనకు వచ్చినపుడు నరేంద్ర మోడీ ధరించిన కోటును చూసి ఈ కోటులో మీరు ఎంతో బాగున్నారు అని ప్రశంసించానని, తన కొలతలు తీసుకొని అలాంటి కోట్లను కుట్టించి మోడీ పంపారని మూన్ పేర్కొన్నారు. వాటి మీద మోడీ జాకెట్ అనే రాసి ఉంది. దీని గురించి పలు స్పందనలు వెలువడ్డాయి. వాటిలో ఒకదానిలో ఇలా ఉంది.

‘ప్రెసిడెంట్ గారూ మీరు చెప్పింది తప్పు. ఇది మోడీ వెస్ట్ కాదు, నెహ్రూ జాకెట్, మోడీకి నెహ్రూకు సంబంధం లేదు, ఎన్నడూ కాలేరు. మోడీ గురించి ఏదైనా చెప్పాలంటే అది ఖాకీ నిక్కరు’ అని ఒక ట్వీట్‌లో ఉంది. మన ప్రధాని మూన్‌కు అలాంటి కోట్లను పంపటం చాలా బాగుందని, అయితే వాటి పేరు మార్చకుండా పంపి ఉండాల్సిందని పేర్కొంటూ వాటిని నెహ్రూ కోటు అంటారని, 2014కు ముందు దేశంలో మోడీ జాకెట్లు లేవని కశ్మీరు మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు. ఇది వివాదం కావటంతో వాటిని రూపొందించిన కంపెనీని రంగంలోకి దించి వివరణ ఇప్పించారు. జెడ్ బ్లూ లైఫ్ సె్టైల్ ఇండియా కంపెనీ ఆ కోట్లను మూన్‌కు పంపింది. దాని ఎండి బిపిన్ చౌహన్ ఒక వివరణ ఇచ్చారు.

నెహ్రూ జాకెట్లు మెడను మూసివేస్తాయని, వాటిని సర్దార్ పటేల్ కూడా ధరించారని, కానీ మోడీ వెస్ట్‌ల పేరుతో తాము అమ్ముతున్నవి అలా గాక కాస్త పొడవుగా, సౌకర్యవంతంగా ఉంటాయని వివరణ ఇచ్చారు. ఇవి నెహ్రూ జాకెట్లు ఏమాత్రం కాదని, మోడీ అనేక భిన్నమైన రంగులకు ప్రాధాన్యత ఇస్తారు గనుక వీటిని మోడీ వెస్ట్‌లనే పిలవాలని అన్నారు. అంతేకాదు, గతంలో నెహ్రూ, పటేల్ ధరించిన కోట్లు ఎంతో నాణ్యమైన వస్త్రంతో రూపొందించి ప్రముఖులు మాత్రమే ధరించే వారని, అలాంటి వాటిని మోడీ సామాన్యులలో ఎంతో ప్రచారం కల్పించారని కూడా అన్నారు. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా మోడీ ప్రతిష్ఠకు మచ్చపడితే వివరణలకు కొదవ ఉంటుందా? నెహ్రూ జాకెట్ అన్నా మోడీ వెస్ట్ అన్నా అర్ధం ఒకటే పొట్టి కోటు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News