అయోధ్యలో నివసించే మీరా మాఝీ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోదీ బహుమతులు పంపారు. బహుమతులతోపాటు మీరా కుటుంబాన్ని ఉద్దేశించి మోదీ స్వయంగా ఒక లేఖ కూడా రాశారు. ఇంతకీ ఎవరీ మీరా అనుకుంటున్నారా? ప్రధాని కొన్ని రోజుల క్రితం అయోధ్య పర్యటనకు వెళ్లారు. రామమందిరం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆయన చెప్పా పెట్టకుండా మీరా మాఝీ ఇంటిని సందర్శించారు.
మీరా ఇంటిని ప్రధాని సందర్శించడానికి కారణం లేకపోలేదు. ఉజ్వల పథకం ద్వారా పదికోట్లమంది ఇప్పటివరకూ లబ్ది పొందారు. వారిలో పది కోట్లవ లబ్ధిదారు మీరా కావడం విశేషం. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మీరా ఇంటికి ప్రధాని వెళ్లారు. మోదీ రాకతో ఉబ్బితబ్బిబ్బయిపోయిన మీరా కుటుంబం ఆయనకు ప్రేమతో టీ చేసి ఇచ్చారు.
మీరా కుటుంబాన్ని మరచిపోకుండా ప్రధాని తాజాగా బహుమతులు పంపించడం విశేషం. మోదీ పంపిన బహుమతుల్లో చక్కటి టీ సెట్టు, రకరకాల రంగులతో కూడిన డ్రాయింగ్ బుక్ వంటివి ఉన్నాయి.