మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ఆ బాధ్యత
‘మన్ కీ బాత్’లో ప్రధాని మోడీ ప్రకటన
ఊబకాయం సమస్యనూ మనవాళ్లు అధిగమించాలి
న్యూఢిల్లీ : మహిళల సాటిలేని స్ఫూర్తిని వేడుక చేసుకోవాలని, గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పిలుపు ఇచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లోని మహిళా విజేతలకు తన వివిధ సోషల్ మీడియా ఖాతాలను తాను అప్పగించగలనని ప్రధాని మోడీ వెల్లడించారు. తన నెలవారీ ‘మన్ కీ బాత్’లో మోడీ మాట్లాడుతూ, విజేతలైన ఆ మహిళలు తమ కృషి, అనుభవం గురించి తన సోషల్ మీడియా ఖాతాల్లో వివరించగలరని తెలిపారు. వివిధ రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుదలను మోడీ శ్లాఘిస్తూ, ‘మహిళల సాటిలేని ఆ స్ఫూర్తిని మనం వేడుక చేసుకోవాలి, గౌరవించాలి’ అని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ఇదే రీతిలో 2020 మార్చి 8న వివిధ రంగాలకు చెందిన ఏడుగురు ప్రముఖ మహిళలకు తన సోషల్ మీడియా ఖాతాలను అప్పగించారు.
‘ఎక్స్’, యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి వేదికల్లో అనేక లక్షల మంది అనుయాయులు ఉన్న మోడీ సోషల్ మీడియాలో అత్యధికంగా అనుయాయులు ఉన్న ప్రపంచ చేతల్లో ఒకరుగా ఉన్నారు. పెరుగుతున్న ఊబకాయం సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా కూడా ప్రజలకు ప్రధాని తిరిగి విజ్ఞప్తి చేశారు. భారత్ ఫిట్‌గా, ఆరోగ్యవంతమైన దేశం కావడానికి అది అవసరమని ఆయన ఉద్ఘాటించారు. ప్రధాని మోడీ ఒక పరిశోధన ఫలితాలను ఉటంకిస్తూ, ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో ఇబ్బంది పడుతున్నారని, వారి సంఖ్య గత కొన్ని సంవత్సరాల్లో రెట్టింపు అయిందని తెలియజేశారు. పిల్లల్లో ఇది నాలుగింతలు కావడం మరింతగా కలవరపరుస్తోందని ఆయన చెప్పారు. నూనె వినియోగాన్ని పది శాతం మేర తగ్గించాలని మోడీ పిలుపుఇచ్చారు.
ఆ పని చేయవలసిందిగా పది మందికి తాను విజ్ఞప్తి చేస్తానని ఆయన తెలిపారు. వారు అందుకు ప్రతిగా మరి పది మందికి అటువంటి సవాల్ విసరాలని మోడీ కోరారు. ఊబకాయం నివారణకు చర్యలు తీసుకోవలసిందిగా ప్రజలకు నచ్చజెప్పేందుకు ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా సహా ప్రముఖ వ్యక్తులు కొందరి సందేశాలను ప్రధాని ఈ సందర్భంగా వినిపించారు. ఈ నెల 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పరిశోధన శాలలు లేదా నక్షత్ర శాలలు సందర్శించడం ద్వారా ‘ఒక రోజు సైంటిస్ట్’ అయ్యేందుకు ప్రయత్నించవలసిందిగా ప్రజలకు మోడీ తన రేడియో ప్రసంగంలో విజ్ఞప్తి చేశారు. ‘స్పేస్, సైన్స్ వలె భారత్ శీఘ్రంగా పటిష్ఠమైన గుర్తింపు పొందుతున్న మరొక రంగం ఉంది అది ఎఐ అంటే కృత్రిమ మేధ. ఇటీవల నేను భారీ ఎఐ మహాసభలో పాల్గొనేందుకు పారిస్ వెళ్లాను. అక్కడ ఈ రంగంలో భారత ప్రగతిని ప్రపంచం కొనియాడింది.
మన దేశంలో ప్రజలు ఇప్పుడు ఎఐని ఎలా వినియోగిస్తున్నారో ఉదాహరణలు కూడా మనం చూస్తున్నాం’ అని ఆయన చెప్పారు. బోర్డు పరీక్షలకు హాజరవుతునన విద్యార్థులను ‘సంతోషంగా, ఒత్తిడి రహితంగా’ ఉండవలసిందని మోడీ కోరారు. కొత్త విధానం ‘పరీక్ష పే చర్చా’ వివిధ వర్గాల నుంచి అభిమానాన్ని చూరగొన్నదని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం సాగుతున్న చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, ఈ రోజుల్లో సర్వత్రా క్రికెట్ వాతావరణం ద్యోతకం అవుతోందని చెప్పారు. ‘క్రికెట్‌లో ఒక సెంచరీ కలిగించే అనుభూతి గురించి మన అందరికీ తెలుసు. కానీ ఈరోజు నేను మీతో క్రికెట్ గురించి మాట్లాడబోవడం లేదు. కానీ అంతరిక్షంలో భారత్ సాధించిన అద్భుత సెంచరీ గురించి మాట్లాడుతున్నాను. క్రితం నెల దేశం ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని తిలకించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, ప్రతి రోజు స్పేస్ సైన్స్‌లో కొత్త పుంతలు తొక్కాలన్న మన సంకల్పాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తోంది’ అని ప్రధాని తెలిపారు. ‘మన అంతరిక్ష ప్రస్థానం ఒకింత నింపాదిగా మొదలైంది. ప్రతి అడుగులో సవాళ్లు ఎదురయ్యాయి.
కానీ మన సైంటిస్టులు ముందుకు సాగుతూనే వాటిని అధిగమించారు. క్రమేణా ఈ రోదసి ప్రస్థానంలో మన విజయాల జాబితా నిడివి పెరుగుతూనే ఉన్నది. ప్రయోగ వాహక నౌకల ఉత్పత్తి, చంద్రయాన్, మంగళ్‌యాన్, ఆదిత్య ఎల్1 లేదా ఒక్క రాకెట్‌తో ఏకబిగిని 104 ఉపగ్రహాలను రోదసిలోకి పంపడమనే కనివిని ప్రయోగం వంటివి ఇస్రో విజయాల పరిధి సువిశాలమైనదని చాటుతున్నాయి’ అని మోడీ చెప్పారు. గడచిన పది సంవత్సరాల్లోనే ఇతర దేశాల ఉపగ్రహాలు అనేకం సహా సుమారు 460 ఉపగ్రహాలను ప్రయోగించినట్లు ఆయన తెలియజేశారు.
ఇటీవలి సంవత్సరాల్లో మరొక ముఖ్య అంశం భారత రోదసి శాస్త్రవేత్తల బృందంలో మహిళల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతుండడం అని మోడీ పేర్కొన్నారు, ‘ప్రస్తుతం రోదసి రంగం మన యువజనులకు ఫేవరైట్ కావడంచూసి నేను చాలా ఆనందిస్తున్నాను’ అని ఆయన చెప్పారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పాటిస్తున్నట్లు మోడీ చెబుతూ, భారత ‘నారీ శక్తి’కి సెల్యూట్ చేయవలసిన ప్రత్యేక సందర్భం ఇది అని అన్నారు. హన్సా మెహతా కృషి గురించి ప్రధాని ప్రధానంగా ప్రస్తావిస్తూ, జాతీయ పతాకం తయారీ నుంచి దాని కోసం తమ ప్రాణాలు త్యాగం చేయడం వరకు దేశవ్యాప్తంగా మహిళల తోడ్పాటును ఆమె వెలుగులోకి తెచ్చారని చెప్పారు.