Saturday, December 21, 2024

ప్రధాని ఊకదంపుడు

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం మూజువాణీ ఓటుతోనే వీగిపోయింది. అందుచేత ఇది ప్రభుత్వం సాధించిన ఘన విజయమని బిజెపి పెద్దలు చెప్పుకోగలరా? అసలీ తీర్మానాన్ని ప్రతిపక్షాలు తెచ్చింది మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాదన్నది అందరికీ తెలిసిన వాస్తవమే. లోక్‌సభలో బలాబలాలు అందుకు ఏమాత్రం సహకరించవన్నదీ విదితమే. దేశం సిగ్గుపడి అంతర్జాతీయ సమాజం ముందు తలవంచుకొనేలా చేసిన మణిపూర్ ఘటనపై దేశాధినేత పార్లమెంటుకు దొరక్కుండా పాటిస్తున్న సుదీర్ఘ మౌనాన్ని భగ్నం చేయడానికి, ఆయన సభకు వచ్చి ఆ విషయమై సాకల్యంగా జాతికి వివరించేలా చూడ్డానికే ప్రతిపక్ష కూటమి అవిశ్వాస తీర్మాన వ్యూహం పన్నింది.

ఈ తీర్మానం ప్రధానిని పార్లమెంటుకు రప్పించడంలో విజయం సాధించింది. అయితే మణిపూర్‌లో మే 4న ఇద్దరు కుకీ మహిళలను మెజారిటీ మెయితీ వర్గానికి చెందిన మగ మూక నగ్నంగా ఊరేగించిన ఉదంతం గురించి జాతికి వివరణ ఇచ్చుకోవలసిన బాధ్యతను నెరవేర్చడంలో ప్రధాని మోడీ ఘోరంగా విఫలమయ్యారు. లోక్‌సభలో 2 గం.లకు పైగా సాగిన ఆయన ప్రసంగం ఊకదంపుడు ఉపన్యాసంగానే తెల్లారిపోయింది. పరనింద, ఆత్మస్తుతి శ్రుతిమించిపోయింది. అసలు విషయానికి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. పోనీ ముందు రోజు బుధవారం నాడు మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయినా మణిపూర్ పరిస్థితిని వున్నది వున్నట్టు వివరించగలిగారా అంటే అదీ లేదు. మయన్మార్ నుంచి కుకీ శరణార్థులు అదే పనిగా వస్తున్నారని, అందువల్ల వారి జనసంఖ్య హద్దులు మీరి పెరిగిపోతున్నదని మెయితీలు బెంగబెట్టుకొన్నారని ఆయన వారి తరపున వకాల్తా పుచ్చుకొన్నారు. అంతేగాని హిందువులైన మెయితీలకు చెందిన ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అపసవ్య విధానాల వల్లనే అక్కడ ఆ కాష్ఠం రగులుకొన్న సంగతిని ఆయన చెప్పలేకపోయారు. పైపెచ్చు బీరేన్ సింగ్‌కు యోగ్యతా పత్రాన్ని కూడా రాసి ఇచ్చేశారు.

కుకీ మహిళలకు జరిగిన చెప్పరాని అవమానం వెనుక వున్న వాస్తవాలేమిటో ప్రధాని మోడీ కూడా జాతికి వివరించలేకపోడం బాధాకరం కాదా? ఈశాన్యాన్ని తాము ఘనంగా అభివృద్ధి చేస్తున్నామని, మణిపూర్ పరిస్థితులు త్వరలోనే చక్కబడతాయని మాత్రమే ఆయన సెలవిచ్చారు. మిగతా ప్రసంగాన్నంతటినీ కాంగ్రెస్ మీద అక్కసును వెళ్లబోసుకోడానికే కేటాయించారు. నెహ్రూ హయాం నుంచి ఎన్నో తప్పులు చేశారని వారిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ లోక్‌సభలో ఒకప్పటి 400 స్థానాల బలం నుంచి 40 స్థానాలకు దిగజారిపోయిందని ‘ఇండియా’ దుకాణం కూడా త్వరలోనే మూతపడుతుందని శాపనార్థాలు పెట్టారు. పనికిరాని దాన్ని ఎన్నిసార్లు లాంచ్ చేసినా ప్రయోజనం వుండదని రాహుల్ గాంధీపై పరోక్ష దాడి చేశారు. వాస్తవానికి మణిపూర్‌లో మే 3 నాటి దారుణ ఘటన జరిగిన వెంటనే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తొలగించి అక్కడ రాష్ట్రపతి పాలన విధించి వుంటే ఆ తర్వాత జరిగిన హత్యాకాండ ఆగి వుండేది. అమిత్ షా చెప్పిన ప్రకారమే మణిపూర్‌లో ఈ హింసాకాండకు 180 మంది బలైపోయారు. వేలాది మంది నిరాశ్రయులై సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు.

ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌ను బర్తరఫ్ చేస్తే తమ డబులింజిన్ ప్రగల్భాల బండారం బయటపడిపోతుందనే దృష్టితో అక్కడి హింసను, క్రైస్తవులైన మైనారిటీ కుకీలపై సాగుతున్న ఘోరకలిని చూసీచూడనట్టు బిజెపి పాలకులు వదిలేశారు. ఇంతటి పాపానికి వొడిగట్టిన తాము పార్లమెంటు ముఖంగా దేశ ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకుంటే అది వారిని కొంత వరకు కాపాడేది. ఆ పనిని చేయకుండా తాము వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వస్తామన్న ధీమాతో బాధ్యతారహితంగా వ్యవహరించారు.

లోక్‌సభ ఎన్నికలు త్వరగా దగ్గరపడుతున్న ప్రస్తుత తరుణంలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా నిర్వర్తించిన ఈ బాధ్యతారహిత నిర్వాకాన్ని ప్రజలు గమనించరని అనుకోడం పొరపాటు. ఇది ప్రతిపక్షాలకు బలాన్ని కలిగిస్తుందే తప్ప వాటిని దెబ్బ తీసే అవకాశం లేదు. ప్రధాని మోడీ మణిపూర్‌పై దీర్ఘకాలం మూగనోము పట్టడం దగ్గరి నుంచి పార్లమెంటులో ఆ ఘటనకు సంబంధించి నిజాయితీగా వ్యవహరించలేకపోడం బిజెపికి మంచి చేయబోదు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత కూడా బిజెపిలో గాని, మోడీ, అమిత్ షాల్లో గాని ఆత్మవిమర్శ చోటు చేసుకోలేదనిపిస్తున్నది. అంత వరకు ఏమేమి జరిగినప్పటికీ, తమ వైఫల్యాలు ఎన్నెన్ని వున్నప్పటికీ ఎన్నికల్లో ఏ మాయ చేసి అయినా మళ్ళీ మళ్ళీ అధికారాన్ని చేపట్టగలమనే ధీమా కమలనాథుల్లో పేరుకుపోయింది. అంతటా మతపరమైన విద్వేషానలాన్ని మండించడం ద్వారా దేశానికి తాము చేస్తున్న విద్రోహాన్ని ప్రజలు గుర్తించరనుకోడం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ లోకమంతా కళ్ళు మూసుకొని వున్నదని అనుకొన్నట్టే వుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News