జెరూసలెం: గతవారం నుంచి గృహనిర్బంధంలో ఉన్న జొర్డాన్ యువరాజు హమ్‌జా ఆదివారం మొదటిసారి ప్రజల ముందు హాజరయ్యారు. రాజు అబ్దుల్లా 2 తో ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జొర్డాన్ ప్రధాన రాజకుటుంబంలో సఖ్యతగా ఉన్నట్టు చేసిన ప్రయత్నంగా ఇది కనిపించింది. అయితే గత కొన్ని దశాబ్దాలుగా పాలిస్తున్న రాజకుటుంబం లోని చీలికలకు దారి తీసిన రాజు, యువరాజు మధ్య గతవారం తలెత్తిన విభేదాలను ఇప్పుడు పక్కన పెట్టారో లేదో స్పష్టం కాలేదు. ఈ రాజ్యాన్ని పూర్వం పాలించిన బ్రిటిష్ సంరక్షిత వ్యవస్థ ఎమిరేట్ ఆఫ్ ట్రాన్స్‌జొర్డాన్ వ్యవస్థాపక శత వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జొర్డాన్ రాజకుటుంబీకులంతా హాజరయ్యారు. జొర్డాన్ రాజధాని అమ్మన్‌లో రాజు తలాల్ సమాధి వద్ద అబ్దుల్లా, హమ్‌జా, పట్టాభిషిక్తుడైన హుస్సేన్ తదితర ప్రముఖులు హాజరైన ఫోటోను, వీడియోను రాజ ప్రాసాదం విడుదల చేసింది.