లండన్: తన తాతగారు, ఎడింబరో డ్యూక్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు సస్సెక్స్ డ్యూక్ ప్రిన్స్ హ్యారీ ఆదివారం క్యాలిఫోర్నియా నుంచి లండన్ చేరుకున్నారు. బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో లాస్ ఏంజెలెస్ నుంచి ఇక్కడి హీత్రో విమానాశ్రయం చేరుకున్న 36 ఏళ్ల ప్రిన్స్ హ్యారీకి స్వాగతం పలికిన భద్రతా సిబ్బంది లండన్‌లో ఆయన గతంలో నివసించిన కెన్సింగ్టన్ ప్యాలెస్‌కు తీసుకువెళ్లారు. వచ్చే శనివారం జరగనున్న ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలలో ప్రిన్స్ హ్యారీ పాల్గొంటారని బకింగ్‌హ్యామ్ పాలెస్ ధ్రువీకరించింది. అయితే ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఆయన భార్య మెఘాన్ మార్లే ప్రయాణం వద్దన్న వైద్యుల సలహా మేరకు అంత్యక్రియలకు హాజరుకావడం లేదని ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం అమలులో ఉన్న కరోనా వైరస్ లాక్డౌన్ నిబంధనల ప్రకారం పది రోజుల క్వారెంటైన్ ఉన్నప్పటికీ సన్నిహిత కుటుంబ సభ్యుల అంత్యక్రియలతో సహా కొన్ని అత్యవసర కారణాలకు తాత్కాలిక సడలింపులు ఉన్న కారణంగా ప్రిన్స్ హ్యారీ తన తాతగారి అంత్యక్రియలలో పాల్గొనేందుకు వెసులుబాటు లభించింది.కరోనా వైరస్ నిబంధనల ప్రకారం 30 మంది కుటుంబ సభ్యులు మాత్రమే అంత్యక్రియలకు హాజరు కావలసి ఉంటుంది.