Monday, November 18, 2024

రాచబిడ్డ ‘బహుముఖాలు’.. అన్నీ బయటపెట్టిన ప్రిన్స్ హ్యారీ ఆత్మకథ

- Advertisement -
- Advertisement -

లండన్: తల్లిని కోల్పోయిన తనయుడు, టీనేజ్ తప్పిదాలు, వార్‌టైమ్ సైనికుడు, అసంతృప్తి నిండిన రాజకుటుంబ సభ్యుడు.. ఇలా బ్రిటీష్ రాజు చార్లెస్3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ జీవితంలోని అనేక కోణాలను త్వరలో విడుదల కానున్న ఆయన ఆత్మకథ బయటపెట్టనుంది. తల్లి మరణం కలిగించిన బాధ, కొకైన్ తీసుకోవడం, టీనేజ్‌లోనే తనకన్నా వయసులో పెద్ద అయిన మహిళతో పొందిన తొలి లైంగిక అనుభవం, తన అన్న ప్రిన్స్ విలియమ్స్‌తో మొదటినుంచి కొనసాగిన విభేదాలు ఇలా తన జీవితంలోని అన్ని విషయాలను ‘ స్పేర్’ పేరుతో వచ్చే మంగళవారం ప్రపంచ మార్కెట్‌లో విడుదల కానున్న ఆ ఆత్మకథలో హ్యారీ పూసగుచ్చినట్లు వెల్లడించారు. ఈ పుస్తకంలోని విషయాలు బ్రిటీష్ మీడియాలో సంచలనం సృష్టించినప్పటికీ బకింగ్‌హామ్ ప్యాలెస్ మాత్రం దీనిపై ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.

మొదటినుంచీ సమస్యాత్మకమే
తన అన్న ప్రిన్స్ విలియమ్‌తో తన బంధం ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగిందంటూ వెల్లడించారు.‘2021లో ఒక సారి మేమిద్దరంమా నాన్న సమక్షంలోనే కొట్టుకున్నాం. మీరిద్దరూ ఇలా కొట్టుకుని నా చివరి రోజులను దుర్భరంగా మార్చకండంటూ ఆయన మ్మల్ని విడదీశారు’ అని వివరించారు. ‘ రాజకుటుంబం పెళ్లిళ్లు జరిగే వెస్ట్‌మినిస్టర్ అబేలోని సెయింట్‌పాల్స్ క్యాథడ్రెల్‌లో మేఘన్, నేను ఒక్కటయ్యేందుకు కూడా విలియమ్ ఒప్పుకోలేదు’ అన్నారు.

డ్రగ్స్ తీసుకున్నా..
రాచరిక జీవితపు ఒత్తిడిని తట్టుకోలేక ఒక దశలో డ్రగ్స్‌కు కూడా అలవాటు పడినట్లు కూడా వెల్లడించారు.‘ 17 ఏళ్ల వయసులో తొలిసారి కొకైన్ వాడా. అంత మజాగా ఏమీ అనిపించలేదు. తర్వాత ఎలన్ కాలేజిలో చదువుతున్న రోజుల్లో బాత్‌రూమ్‌లో గంజా తాగాను. కాలిఫోర్నియా వెళ్లినప్పుడు మ్యాజిక్ మష్రూమ్స్ వంటివి టేస్ట్ చేశా.17 ఏళ్ల వయసులోనే నాకంటే పెద్దావిడతో లైంగికానుభవం రుచి చూశా’ అని పేర్కొన్నారు.

కలచివేసిన తల్లి మరణం
తన తల్లి ప్రిన్స్ డయానా మృతి తనను ఎంతగానో కలచివేసిందని ఆయన తెలిపారు.‘12 ఏళ్ల వయసులో నా తల్లి డయానాను ప్రమాదంలో కోల్పోవడం ఎంతో బాధించింది. నిద్రపోతున్న నన్ను లేపి నాన్న ఆ వార్త చెప్పారు. కానీ కనీసం నన్ను దగ్గరకు తీసుకుని కూడా ఓదార్చలేదు. కొన్నేళ్ల తర్వాత కొన్నేళ్లకు ఆ బాధనుంచి బైటపడడం కోసం తన తల్లి కారు ప్రమాదానికి గురయిన ప్యారిస్‌లోని సాంట్ డి ఎల్ ఆల్మా టన్నెల్ గుండా తనను తీసుకెళ్లమని తన డ్రైవర్‌ను అడిగానని, మరణించిన తన తల్లితో ఎలాగైనా మాట్లాడేందుకు ‘శక్తులున్న’ ఒక మహిళను ఆశ్రయించా’ అని చెప్పుకున్నారు. తన తల్లి మరణం తర్వాత కెమిల్లాను వివాహం చేసుకోవద్దని తాను, విలియమ్ ఇద్దరమూ బతిమాలామని కూడా హ్యారీ తెలిపారు.

పాతిక మంది తాలిబన్లను హతమార్చా
హ్యారీ బ్రిటీష్ ఆర్మీలో దాదాపు పదేళ్లు గడిపారు. రెండు సార్లు అఫ్గానిస్థాన్‌లో పని చేశారు. తన రెండో పర్యటనలో ఒక అపాచీ హెలికాప్టర్ కో పైలట్‌గా, గన్నర్‌గా 2012 13 మధ్య కాలంలో 25 మంది తాలిబన్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఆయన చెప్పుకున్నారు. తాను చేసిన పనికి సంతోషించడం కానీ, సిగ్గుపడడం కానీ చేయలేదని, ఎందుకంటే యుద్ధ భూమిలో శత్రువులను మట్టుబెట్టడం సర్వ సాధారణమని ఆయన అభిప్రాయపడ్డారు.

మేఘన్‌తోనే మారా..
తన జీవితంలో వచ్చిన మార్పునకు భార్య మేఘనే కారణమని హ్యారీ చెప్పుకున్నారు. ఆమెను కలవడానికి ముందు తనకు ప్రపంచం అంటే ఏమిటో కూడా తెలియని స్థితిలో ఉన్నానని కూడా చెప్పుకున్నారు. తాను మేఘన్ రాజప్రాసాదాన్ని, బ్రిటన్‌ను వదిలిపెట్టడానికి బ్రిటీష్ మీడియానే కారణమని కూడా ఆయన ఆరోపించారు. గత సెప్టెంబర్‌లో ఎలిజబెత్ రాణి అంత్యక్రియల ఊరేగింపులో తాను, విలియమ్ పక్కపక్కనే కలిసినడిచినప్పటికీ ఒక్క మాటకూడా మాట్లాడుకోలేదని పుస్తకం చివరి పేజిల్లో హ్యారి వెల్లడించారు. ఆ మరుసటి రోజే తాను. మేఘన్ అమెరికాకు తిరిగి వచ్చేశామని కూడా ఆయన తెలిపారు. కాగా హ్యారీ బయటపెట్టిన విషయాలపై కింగ్ చార్లెస్ ప్రాతినిధ్యం వహించే బకింగ్‌హామ్ ప్యాలెస్ కానీ, విలియమ్‌కు చెందిన కెన్సింగ్టన్ ప్యాలెస్ కానీ ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News