బ్రిటన్ హైకోర్టు తీర్పు
లండన్: బ్రిటన్ దేశపు రాణి ఎలిజెబెత్ 2 గౌరవ మర్యాదలను కాపాడేందుకు ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ వీలునామాను 90 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాలని బ్రిటన్ హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూశారు. ఏడు దశాబ్దాలకు పైగా క్వీన్ ఎలిజెబెత్ 2తో ఆయన వైవాహిక బంధం కొనసాగింది. బ్రిటన్‌లో వీలునామాలు ప్రజలకు బహిర్గతపరచడం అసాధారణం కానప్పటికీ హైకోర్టు ఆదేశాల మేరకు ఒక శతాబ్ద కాలంగా రాజవంశానికి చెందిన పెద్దల వీలునామాలను రహస్యంగా ఉంచడం సాంప్రదాయంగా వస్తోంది.
ప్రిన్స్ ఫిలిప్ వీలునామాను 90 ఏళ్ల పాటు రహస్యంగా ఉంచాలని, ఆ తర్వాత వాటిని ప్రైవేటుగా తెరచి వాటి ప్రచురణార్హతను పరిశీలించాలని న్యాయమూర్తి ఆండ్య్రూ మెక్‌ఫర్లేన్ తన తీర్పులో పేర్కొన్నారు. రాజకుటుంబానికి చెందిన ముఖ్యుల ప్రతిష్టను, గౌరవ మర్యాదలను దృష్టిలో ఉంచుకుని ఆ కుటుంబానికి చెందిన పెద్దల వీలునామాలను రహస్యంగా ఉంచడం సాంప్రదాయంగా వస్తోందని, దీన్ని కొనసాగించాలని ఆయన తెలిపారు. ప్రిన్స్ ఫిలిప్ వీలునామాలను తాను చూడడం కాని అందులోని విషయాలను తెలుసుకోవడం కాని జరగలేదని ఆయన స్పష్టం చేశారు.