హైదరాబాద్: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దివంగత నిజాం ముకర్రంజా మాజీ భార్య ఎస్రా యువరాణి రూ. 5 లక్షల విలువైన 67 గ్రాముల బంగారు ఆభరణాలను విరాళంగా అందజేశారు. ఎస్రా రాజకుమారి తరఫున యాదాద్రి ఆలయాభివృద్ధి అథారిటీ వైస్ చైర్మన్ జి. కిషన్ రావు నగలను ఆలయ నిర్వహణాధికారి ఎన్. గీతకు అందజేశారు. కిషన్ రావు కథనం ప్రకారం లండన్‌లో నివసించే యువరాణి ఎస్రా తరచూ హైదరాబాద్‌కు, తన స్వదేశమైన టర్కీకి వెళుతుంటుంది. ఆమె ఇదివరలో ఆలయాన్ని సందర్శించే ఆసక్తిని కనబరిచారు. ఇటీవల నగరానికి వచ్చినప్పుడు ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నప్పటికీ, గత నెలలో ముకర్రంజా మరణంతో ఆమె అలా చేయలేకపోయారు.
అసఫ్ జాహీ పాలనలో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా రూ. 82,825 గ్రాంట్‌ను ఆలయానికి ఇచ్చారు. టర్కీలో జన్మించిన యువరాణి ఎస్రా జన్మతః యువరాణి కాదు. కానీ 1959లో హైదరాబాద్‌లోని అసఫ్ జా రాజవంశానికి చెందిన యువరాజు ముకర్రం జాను వివాహం చేసుకున్నాక యువరాణి అయ్యారు. ఆమె 15 ఏళ్ల తన వైవాహిక జీవితం ద్వారా కూతురు షెఖ్యా, కుమారుడు అజ్మత్ జాను సంతానంగా పొందారు. అజ్మత్ జా ప్రస్తుతం అసఫ్ జా ఇంటికి పెద్దగా ఉన్నారు. ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్న యువరాణి ఎస్రా హైదరాబాద్‌లోని చౌమహల్లా, ఫలక్‌నుమా రాజభవనాలను పునరుద్ధరించారు. యాదగిరి ఆలయం భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టపై ఉంది. ఆ ఆలయ విస్తరణ, పునురుద్ధరణ 2016లో మొదలయి 2022లో పూర్తయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దానిని 2022 మార్చి 18న ప్రారంభించారు.