Monday, November 18, 2024

సామాన్యుడ్ని వివాహమాడిన జపాన్ రాజకుమారి

- Advertisement -
- Advertisement -

Princess of Japan who married a commoner

టోక్యో : ప్రేమకు సామాన్యుడు, శ్రీమంతుడు అనే బేధం లేదని నిరూపించుకునేలా మూడేళ్ల నిరీక్షణ తరువాత తన ప్రేమను గెలిపించుకుని సామాన్యుడైన తన ప్రియుడు కీ కొమురోను జపాన్ రాజకుమారి మకో మంగళవారం వివాహమాడింది. మకోకిమురోల వివాహాన్ని టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్ అధికారికంగా ధ్రువీకరించింది. పెళ్లి తరువాత మకో రాజప్రాసాదాన్ని వీడారు. వీరి వివాహానికి మెజార్టీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ప్యాలెస్‌లో ఎలాంటి వేడుకలు నిర్వహించలేదు. సంప్రదాయం ప్రకారం వీడ్కోలు కూడా ప్రకటించారు. ఇంటి నుంచి తన బయటకొచ్చే ముందు మకో తన తల్లిదండ్రులను, సోదరిని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. జపాన్ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తె అయిన మకో, టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలో చదువుకున్నారు. అక్కడే వీరిద్దరి ప్రేమ మొదలైంది. 2017 లోనే ఈ జంట ప్రేమవివాహం చేసుకోబోతున్నట్టు ప్రకటించినా మరుసటి ఏడాది కొమురో తల్లి కారణంగా ఆర్థిక వివాదాలు తలెత్తడంతో ఈ పెళ్లి రద్దయింది.

దీంతో కొమరో లా చదవడానికి 2018 లో న్యూయార్క్ వెళ్లి పోయారు. మూడేళ్ల తరువాత గత నెల చదువు పూర్తి చేసుకుని కొమురో స్వదేశానికి తిరిగి వచ్చారు. మళ్లీ వీరి పెళ్లి ప్రతిపాదన రావడంతో ఆర్థిక వివాదంపై స్పష్టత ఇవ్వాలని మకో తండ్రి కొమురోను అడిగారు. దీనిపై లిఖిత పూర్వక హామీ కొమురో ఇవ్వడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించారు. సంప్రదాయం ప్రకారం రాజకుటుంబం ఎలాంటి వివాహ వేడుకలు నిర్వహించక పోయినా వీరు వివాహ బంధం లోకి అడుగుపెడుతున్నట్టు అధికారికంగా పత్రాలు మాత్రం విడుదల చేసింది. జపాన్ రాజకుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులు కోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్దపడ్డ మకో, రాజభరణం కింద తనకు వచ్చే రూ. 10 కోట్ల ( 150 మిలియన్ యెన్‌లు) మొత్తాన్ని కూడా తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News