భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో పూర్వ విద్యార్థి తనకు మార్కుల మెమో ఇవ్వడంలేదని ప్రిన్సిపాల్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అశుతోష్ శ్రీవాస్తవ (24) అనే విద్యార్థి సిమోరోల్ ప్రాంతంలో బిఎం కాలేజీలో బి పార్మసీ చదివాడు. గత సంవత్సరం జులైలో అశుతోష్ ఉత్తీర్ణత సాధించాడు. మార్కుల మెమో ఇవ్వాలని కాలేజీ సిబ్బందిని అడిగాడు.
మార్కుల మెమో రాలేదని వారిని పలుమార్లు అడిగినప్పటికి వారు స్పందించలేదు. కాలేజీలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్దామని కారు వద్ద ప్రిన్సిపాల్ విముక్త శర్మ వచ్చింది. అప్పుడు తనకు మార్కుల మెమో ఇప్పించాలని ప్రిన్సిపాల్ ను అడిగాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ప్రిన్సిపాల్ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. వెంటనే ప్రన్సిపాల్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. 80 శాతం శరీర భాగాలు కాలిపోవడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. నిందితుడి అరెస్టు చేశామని, అతడు కూడా 40 శాతం గాయపడ్డాడని ఇండోర్ ఎస్ పి భగత్ సింగ్ విర్డే తెలిపాడు. గతంలో మార్కుల మెమో విషయంలో కాలేజీ ప్రొఫెసర్‌పై కత్తితో దాడి చేసినట్టు సమాచారం.