ప్రింట్ మీడియా సంక్షోభం, భవిష్యత్తు అనే అంశం గురించి మాట్లాడుకునే ముందు అసలు భారతదేశంలోకి ప్రింట్ మీడియా ఎలా వచ్చిందనే విషయం గురించి చెప్పుకోవాలి. నిజానికి భారత పత్రికారంగ చరిత్ర చాలా అపూర్వమైనదీ, పురాతనమైనదీ కూడా. మన దేశంలో 245 సంవత్సరాల క్రితం మొట్టమొదటి పత్రిక ప్రారంభమైంది. అది కూడా భారతీయుడు ప్రారంభించింది కాదు, ఐర్లాండ్ దేశానికి చెందిన జేమ్స్ అగస్టే హిక్కి అనే ఒకాయన అప్పటి బ్రిటిష్ ఇండియా రాజధాని కలకత్తాలో ‘బెంగాల్ గెజిట్’ అనే పత్రిక ప్రారంభించారు. అప్పట్లో బ్రిటిష్ ఇండియాకి కలకత్తా రాజధానిగా ఉండేది. అక్కడే ఈ పత్రిక ఎందుకు ప్రారంభించారంటే అప్పటి బ్రిటిషర్ల వినోదం కోసం అని చెప్పాడాయన. ఆ తర్వాత ఆ పత్రిక.. జనానికి సమాచారం అందజేసే దినపత్రికగా రూపాంతరం చెందింది.
ఆ తర్వాత స్వాతంత్య్ర పోరాట కాలంలో మన నాయకులు చాలా మంది పత్రికలు నడిపారు. మహాత్మా గాంధీ యంగ్ ఇండియా, హరిజన్, నవజీవన్, ఇండియన్ ఒపీనియన్ వంటి పత్రికలు నడిపారు. బాబా సాహెబ్ అంబేద్కర్.. మూర్తినాయక్, బహిష్కృత భారత్ అనే రెండు మరాఠీ పత్రికలు నడిపారు. జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్వాతంత్య్రోద్యమ కాలంలోనే ప్రారంభించారు. అది చాలా కాలం మనుగడలో ఉంది. ఇప్పుడు ఆ పత్రిక ‘టెయింటెడ్’గా తయారైంది. దానిపై ఎన్నో కేసులు వస్తున్నాయి.
మోతీలాల్ నెహ్రూ ఇండిపెండెంట్ అనే పత్రిక ప్రారంభించారు. ఆయన ‘హోమ్ రూల్ ఫర్ ఇండియా’ అనే నినాదంతో ఆయన ఈ పత్రిక నడిపారు. లాలా లజపతి రాయ్ ఉర్దూలో ‘వందేమాతరం’ పేరిట పత్రిక నిర్వహించారు. ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే, స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేసే క్రమంలో పత్రికలు ఉండాల్సిన అవసరం ఉందని అప్పట్లో భావించారు. ఇలా స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న నాయకులు, యోధులు చాలామంది స్వాతంత్య్ర పోరాటం గురించి ప్రజలకు సమాచారం తెలియాలని భావించి పత్రికలు నడిపారు.
అప్పట్లో ఒక లక్ష్యంగా ప్రారంభమైన పత్రికల స్వభావం క్రమక్రమంగా ఎలా మారుతూ వచ్చిందో చెప్పుకోవాలి. స్వాతంత్య్రం వచ్చాక, తమ లక్ష్యం నెరవేరింది కాబట్టి ఇక ఈ పత్రికలు ఎందుకు? అంటూ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షతన ఒక సమావేశం జరిగింది. చాలా మంది ‘ఇక ఇప్పుడు పత్రికలు అవసరం లేదు’ అన్నారు. ఎందుకంటే అప్పటికే పత్రికల్లో అసత్యాలు, అర్ధ సత్యాలు రాయడం మొదలైంది. అయితే మెజారిటీ పత్రికలు అలా లేవు. అవి విలువల్ని పాటిస్తూ, ప్రజలకు సమాచారం తెలిపే బాధ్యత నిర్వర్తిస్తున్నాయి. అయితే ‘ఇక పత్రికలు ఎందుకు?’ అనే వాదనను జవహర్ లాల్ నెహ్రూ అంగీకరించలేదు. ‘పత్రికలు ఏం రాసినా సరే, అవి ఉండాల్సిందే. ప్రజాస్వామ్యంలో పత్రికలు అనేవి అవసరం’ అని నొక్కి చెప్పడమే కాకుండా, వాటికి ఒక ప్రత్యేకమైన హోదా ఉండాలంటూ ఆయన 1952లో ఒక ప్రెస్ కమిషన్ వేశారు. ప్రెస్ కమిషన్ నివేదికలో భాగంగానే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆవిర్భవించింది.
అలాగే సమాచారాన్ని సేకరించి వార్తలు రాసి ప్రజలకు అందజేసే పనిని ఒక పవిత్ర లక్ష్యమని నెహ్రూ పేర్కొన్నారు. కాబట్టి జర్నలిస్టులకు ఒక ప్రత్యేకత ఉండాలి. అందరిలాగా ఉండకూడదు అని చెప్పి ఆయన వర్కింగ్ జర్నలిస్టుల చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఉద్యోగ భద్రతతో సహా చాలారకాల వెసులుబాట్లు కల్పించారు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వేజ్ బోర్డు వేయాలని కూడా ప్రెస్ కమిషన్ సిఫారసు చేసింది. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఈ చట్టాలన్నిటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ తీసుకొచ్చాయి. అంటే, ఇవాళ జర్నలిస్టులకు, ఇతర రంగాల్లో పని చేస్తున్నవారికీ తేడా ఏమీ లేదన్నమాట. ఆ నిబంధనలు ఇంకా అమలులోకి రానప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు పరచడానికి సిద్ధంగా ఉంది. నెహ్రూ అంత ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పటికీ, ఆయన కుమార్తె ఇందిరా గాంధీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ విధించి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రద్దు చేశారు.
వాక్ స్వాతంత్య్రం, భావప్రకటన స్వేచ్ఛ లేకుండాపోయాయి. 1978లో జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొరార్జీ ప్రభుత్వం రెండవ ప్రెస్ కమిషన్ వేసి, ప్రెస్ కౌన్సిల్‌ను పునరుద్ధరించింది. ఈ మార్పులన్నీ జరుగుతున్న సమయంలోనే వార్తా పత్రికలు వ్యాపార దృష్టిని అలవరచుకోవడం మొదలుపెట్టాయి. అంటే.. లక్ష్యం నుంచి వృత్తిగా మారి, వృత్తి నుంచి వ్యాపారం వైపు పత్రికలు మళ్ళిన తర్వాతనే ప్రింట్ మీడియా పతనం ప్రారంభమైంది. పతనం అంటే చాలా మంది అంగీకరించకపోవచ్చు. నా ఉద్దేశంలో పతనమంటే పత్రికలు లేకుండాపోవడం కాదు, విలువల రీత్యా పతనం ప్రారంభమైందని. వార్తాపత్రికలను ఏ ఉద్దేశంతో నడపాలో, ఏ లక్ష్యం కోసం పనిచేయాలో వాటినుంచి యాజమాన్యాలు పక్కకు జరిగి ధనార్జన ధ్యేయంగా చేసుకున్నాయి.
ఎనభయ్యవ దశకం చివర్లో ఈ ధోరణి ప్రబలింది. అప్పట్లో నేను ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’లో పని చేస్తున్నాను. ఒకసారి మా యజమాని ఒక పుస్తకం పంపించారు. దానిమీద ‘మీరు చదవండి, పత్రికలో పని చేస్తున్న హెడ్స్ అందరితో కూడా చదివించండి’ అని నోట్ పెట్టారు. అదొక అమెరికన్ రచయిత రాసిన పుస్తకం. దాని శీర్షిక ఏమిటంటే ‘వేర్ ది న్యూస్ రూమ్స్ ఆర్ రూల్ బై ఎంబిఏస్’ అని. అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు న్యూస్ రూమ్స్‌లో ఫై పొజిషన్స్‌లో ఉండాలని దాని అర్థం. పత్రికలతో వ్యాపారం ఎలా చేయొచ్చు అని చెప్పే ఆ పుస్తకాన్ని నేను చదవలేదు సరికదా ఎవరికీ ఇవ్వలేదు కూడా. ఆ పుస్తకం చదివి అందరూ వ్యాపారం చేయడం మొదలుపెడితే పత్రికల్లో వార్తలు రాసేవారు ఎవరూ ఉండరని నేను ఆ పుస్తకాన్ని భద్రంగా కప్ బోర్డులో పెట్టి, ఆ పత్రికకు రాజీనామా చేసిన రోజున దాన్ని నాతోపాటే తీసుకువెళ్లిపోయాను.
1990 చివర్లలో 24 గంటల న్యూస్ ఛానళ్లు వచ్చాక ప్రింట్ మీడియా ప్రాభవం పూర్తిగా తగ్గిపోవడం మొదలైంది. డిజిటల్ మీడియా విజృంభణతో ఇంటర్నెట్, మొబైల్ పరికరాలు సమాచారాన్ని మరింత చేరువ చేశాయి. ఏదైనా సంఘటన జరిగిన మరుక్షణమే అందరికీ తెలిసేలా చేస్తున్నాయి. అదే సమాచారాన్ని వార్తా పత్రిక మరునాడు మనకు అందిస్తున్నది. దీంతో ఉదయం పేపర్ తెరవగానే అన్ని చద్దివార్తలే కనబడుతున్నాయి. వార్తా పత్రికల చెల్లుబాటు తగ్గడానికి ఇదొక కారణం. యువతరం అలవాట్లు మారుతున్నాయి. మొబైల్ డివైస్‌లకు అలవాటు పడిన యువత పత్రికను చేతిలో పట్టుకోవాలంటే నామోషిగా భావిస్తున్నారు. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక జర్నలిస్టుల పనులన్నీ కూడా ఈ తరహా యాప్ లే చేసేస్తున్నాయి. వార్తా ఛానళ్లు వచ్చాక చదవడానికంటే చూడటానికే జనం ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆ తర్వాత మరో ముఖ్యమైన మార్పు.. అడ్వర్టయిజ్‌మెంట్ షిఫ్ట్. పత్రికలకు ఆదాయం వచ్చేది అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారానే. ఇవి ఎలక్ట్రానిక్ మీడియాకు షిఫ్ట్ కావడంతో పత్రికలకు ఆదాయం తగ్గుముఖం పట్టింది. ఫలితంగా వ్యాపార ప్రయోజనాలు ఆశించే యాజమాన్యాలు పత్రికలు నడపడానికి ఇష్టపడటం లేదు. చాలా పత్రికలు మూతపడుతున్నాయి. జర్నలిస్టుల సంఖ్యను కూడా తగ్గిస్తున్నారు. దాంతో జర్నలిజం కోర్సులు చదువుకోవడానికి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతోంది.ప్రింట్ మీడియా సంక్షోభానికి మరో కారణం పేపర్ ఖర్చు. ప్రస్తుతం ఒక దినపత్రిక ఖరీదు ఐదారు రూపాయలు ఉంటే, ఆ పత్రిక ఒక కాపీని ప్రింట్ చేసేందుకు అయ్యే ఖర్చు 35 రూపాయలు అవుతుంది. మిగతా 30 రూపాయలను వ్యాపార ప్రకటనల రూపంలో తెచ్చుకోవాల్సిందే. కానీ అవి రావడం లేదు. ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి.
ప్రముఖ పత్రికా యాజమాన్యాలు కూడా తమ ఖర్చు తగ్గించుకునేందుకు పత్రికలను తక్కువ సంఖ్యలో ప్రింట్ చేస్తున్నాయి. బయటికి చెప్పుకోవడానికి లక్షల సర్కులేషన్ ఉందని చెప్తారు కానీ వాళ్ళు ప్రింట్ చేసేది 30 వేల నుంచి 40 వేలు మాత్రమే.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రింట్ మీడియా తన పద్ధతిని మార్చుకుంటే తప్ప భవిష్యత్తు కష్టసాధ్యమనేది నా అభిప్రాయం. ప్రింట్ మీడియాకు కాలం చెల్లిందని కొందరు అంటున్నారు కానీ, నా ఉద్దేశంలో అది నిజం కాదు. మార్పుతో పాటు మనమూ మారాలి. న్యూస్ ఛానల్లో చూపించే వార్తనే రేపు పొద్దున పేపర్‌లో రాస్తే ప్రయోజనం లేదు. కాబట్టి దానికంటే భిన్నంగా ఉండే ప్రయత్నం చేయాలి. పత్రికలు తాము ప్రచురించే వార్తలను భిన్నంగా ఉండేట్టుగా చూడాలి. ఎవరికీ అందని వార్తలు రాయాలి. ఒకప్పుడు జర్నలిజంలో ఒక ప్రత్యేకమైన అంశం పరిశోధనాత్మక జర్నలిజం.
ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అనేవి దాదాపుగా లేకుండా పోయాయి. ప్రస్తుతం వాట్సాప్ జర్నలిజం నడుస్తోంది. ఎవరైనా వాట్సాప్‌లో ఒక వార్త పెడితే దాన్ని తీసి కట్ అండ్ పేస్ట్ చేసి, పత్రికల్లో పెట్టి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పత్రికలు నడిచే అవకాశం లేదు. ఏదైనా కొత్తదనం చూపిస్తే తప్ప ప్రింట్ మీడియాకు భవిష్యత్తు అనేది చాలా కష్టం. ప్రస్తుత కాలంలో పత్రికల్లో వ్యాపార ప్రయోజనాలతో పాటు రాజకీయాలు కూడా ప్రవేశించాయి. ప్రతి రాజకీయ పార్టీ మీడియా తన అధీనంలో, తన అదుపులో ఉండాలని కోరుకుంటోంది. అన్ని రాజకీయ పక్షాల తీరు అలానే ఉంది. తమకు వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా రావడానికి వీలులేదు, వస్తే సహించడం లేదు. పత్రికలకు ఒకవైపు అడ్వర్టయిజ్‌మెంట్ల దెబ్బ, మరోవైపు రాజకీయాల ఒత్తిడి. ఈ పరిస్థితుల్లో పత్రికా యాజమాన్యాలే స్వచ్ఛందంగా రాజకీయాలు కోరుకుంటున్నాయి. రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నాయి. ఇన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నా వార్తాపత్రిక రంగం భవిష్యత్తుకు ఢోకా ఏమీ లేదు. ప్రింట్ మీడియాకి మళ్లీ మంచి రోజులు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.
పత్రికలు ఇండిపెండెంట్‌గా రాగలిగితే వాటికి చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే స్వతంత్రంగా ఉన్ననాడే పత్రికలకు విశ్వసనీయత ఉంటుంది. రాజ్యాంగం పత్రికా స్వేచ్ఛను ప్రత్యేకంగా నిర్వచించలేదు. భావప్రకటనా స్వేచ్ఛనే పత్రిక స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నాం. సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఆ హక్కును కాపాడే బాధ్యత పత్రికలది కూడా కాబట్టి పత్రికలు స్వతంత్రంగా ఉంటే తప్ప వాటికి మనుగడ లేదు. ఇలాంటి పత్రికలకు క్రౌడ్ ఫండింగ్ జరగాలి. మీరు పత్రికకు ఒక పది రూపాయలు డొనేట్ చేసిన పక్షంలో మీరు ఆ పత్రికనుంచి ఏమీ ప్రయోజనం ఆశించరు. కానీ, ఓ పది కోట్లు ఇచ్చేవాడు తనకు అనుకూలంగా పత్రిక నడవాలని కోరుకుంటాడు. కాబట్టి జనం నుంచి పదో, వందో, వెయ్యో సేకరించి ఓ పత్రికనో, ఓ మీడియా సంస్థనో ప్రారంభించగలిగితే అది తప్పనిసరిగా నిలబడుతుంది. అలాంటి పద్ధతి ఈ దేశంలో రావాలి. వేరే దేశాల్లో ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల విజయవంతమయ్యాయి కూడా.
(‘ప్రింట్ మీడియా సంక్షోభం.. భవిష్యత్తు’ అంశంపై బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో జరిగిన సదస్సులో ఎడిటర్ దేవులపల్లి అమర్ చేసిన ప్రధానోపన్యాసంలోని ముఖ్యాంశాలివి)