మనతెలంగాణ/ హైదరాబాద్ : పచ్చదనం పెంపు కోసం ఎక్లాస్‌పూర్ ఎకో పార్క్‌లో 3 లక్షల మొక్కలను నాటారని హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ అన్నారు. నారాయణపేట రేంజ్‌లోని మినాస్‌పూర్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్‌లో 88 హెక్టార్లులలో రూ.254.44 లక్షల వ్యయంతో అటవీ శాఖ అభివృద్ధి చేసిన ఎక్లాస్‌పూర్ ఎకో పార్క్‌ను శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ పార్క్‌లో పచ్చదనం కోసం బ్లాక్, బండ్, వెదురు, ఔషధ, బంజరు కొండ అటవీ పెంపకం పద్ధతుల్లో వివిధ జాతులతో సుమారు 3 లక్షల మొక్కలను నాటారు. రాశి వనం, నక్షత్ర వనం, నవగ్రహ వనం, పంచవటి, బృందావనం, యాంఫీ థియేటర్, యోగా సెంటర్, స్మృతి వనం ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపి మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్‌మోహన్‌రెడ్డి ,ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి, అటవీశాఖ అధికారులు క్షితిజ, సత్యనారాయణ, వీణావాణి, అటవీ రేంజ్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.