Wednesday, January 22, 2025

జరిమానా కట్టలేని జైలు ఖైదీలు

- Advertisement -
- Advertisement -

గత ఏడాది ఏప్రిల్‌లో కోర్టు తీర్పు ప్రకారం జరిమానా చెల్లించలేని పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర హోం శాఖ విధివిధానాల రూపకల్పన చేసింది. తమ జైళ్లలో ఇలా మగ్గుతున్నవారి వివరాలు సేకరించాలని రాష్ట్రాలకు తెలియజేసింది. వారి కోసం కేంద్రం ద్వారా లభించే నిధులకు ఆయా కోర్టు ఆధీనంలో పనిచేసే జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా అందించాలని సూచించింది. చిన్న మొత్తాలను సైతం బెయిల్ కోసం పూచికత్తు ఇవ్వలేని వారికి కూడా ఆర్థికంగా సాయపడి వారిని విడుదల చేసేలా చూడాలని కూడా ఈ ప్రత్యేక పథకంలో ఉంది. ఈ లెక్కన ఖైదీల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా విచారణ ఖైదీకి రూ. 40 వేలు, శిక్ష పడిన వారికి రూ. 25 వేలు మంజూరు చేస్తారు. దీని వల్ల వేల సంఖ్య లో ఉన్న ఇలాంటి వారితో కిక్కిరిసిపోయిన జైళ్ల పరిస్థితికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. మహారాష్ట్రలోని 67 జైళ్లలో ఉన్న 37 వేల ఖైదీల్లో 27 వేల మంది విచారణ ఖైదీలే కావడం గమనార్హం. కరోనా కాలంలో శిక్షాకాలం పూర్తయి జరిమానా చెల్లించలేక జైళ్లలో కొనసాగుతున్నవారిని విడుదల చేయమని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి.

కారణం లేకుండా గొలుసు లాగి రైలును ఆపితే ‘ఏడాది పాటు జైలు శిక్ష లేదా రూ. 1000 జరిమానా లేదా రెండు’ అని మన రైల్వే చట్టాల్లో ఉంది. అంటే అలా ఆపిన వ్యక్తి జరిమానా కట్టలేని స్థితిలో ఉంటే ఏడాది పాటు జైలు శిక్ష మాత్రం ఖాయమని తెలుస్తోంది. ఒకవేళ న్యాయమూర్తి జైలు శిక్షతో పాటు జరిమానా కూడా వేస్తే పేదవాడి పరిస్థితి ఏమిటి? అలాంటి నేరస్థుడు జైలులో ఏడాది కాలం గడిపిన తర్వాత కూడా జరిమానా కట్టలేకపోతే జైలులోనే ఉండక తప్పదు. ఆ వేయి కట్టేదాకా ఆయన శిక్ష పూర్తి కానట్లే. అయితే ఈమాత్రం జరిమానా సొమ్ము సంపాదించడానికి జైల్లో ఓ వెసలుబాటు ఉంది. జైల్లో ఉన్నంత కాలం ఖైదీ అక్కడ ఏదైనా పని చేసుకోవచ్చు. అలా జమైన సొమ్ముకు లెక్క ఉంటుంది. శిక్షాకాలంలో వాడుకున్న సొమ్ము పోను మిగిలింది బయటకి వచ్చేప్పుడు ఇస్తారు. అలా ఈ వేయి రూపాయల జరిమానాను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. అయితే జైళ్లలో పని చేసే వారికి ఇచ్చే కూలి చాలా తక్కువగా ఉంటుంది.

మన జైళ్ల నియమావళి, 2021 ప్రకారం వ్యక్తి నైపుణ్యాన్ని బట్టి ఒక్కరికి రోజుకు రూ. 88 నుండి రూ. 111 కూలి రేట్లు ఇవ్వాలి. దీనిలోంచి వ్యక్తిగత ఖర్చులు పోను మిగిలేదెంతో ఊహించవచ్చు. ఖైదీలకు కనీస వేతన చట్టం అమలు చేయాలని కోరితే కోర్టులో ఆ కోరిక వీగిపోయింది. వారి పని, ఆదాయం శిక్షలో భాగంగా పరిగణించాలి తప్ప వారు పనికి వచ్చిన సాధారణ కూలితో సమానం కాదని కోర్టు అభిప్రాయపడింది. అది అలా ఉంటే ఖైదీ ఆరోగ్యం బాగాలేక, వృద్ధాప్యం వల్ల గాని ఏ పని చేయకుండానే శిక్షాకాలం గడిస్తే ఎలా! జైలు జీవితంలో జరిమానాను సరిపడే సంపాదన పొందకపోతే ఏం జరుగుతుంది? ఇలాంటివారు జరిమానా చెల్లించే దాకా జైలులో ఉండక తప్పదు. మన చట్టాల పకడ్బందీ అమానవీయ నియమాలివి.
ఇలా జరిమానా చెల్లించలేక, తగిన ఆర్థిక స్తోమత లేక జైళ్లలో మగ్గుతున్నవారు మన దేశంలో వేలల్లో ఉన్నారు. జరిమానా చెల్లించలేక తమ శిక్షాకాలం కన్నా రెట్టింపు సమయాన్ని జైలులో గడుపుతున్నవారు కూడా ఉన్నారు.

ఈ సమాచారం తెలిసి కొందరు మానవతా దృక్పథంతో వారి తరఫున జరిమానా చెల్లించి జైలుశిక్ష నుండి విముక్తి కలిగించిన సందర్భాలున్నాయి. 2019లో ఉత్తరప్రదేశ్‌లో కొన్ని సంస్థలు డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదిన సందర్భంగా రూ. 19 లక్షలు చెల్లించి 131 మంది జరిమానా ఖైదీలను బయటకు రప్పించాయి.అదే విధంగా ఆగ్రా కు చెందిన సత్యమేవ జయతే అనే స్వచ్ఛంద సంస్థ రూ. 5.4 లక్షలు చెల్లించి 20 మంది ఖైదీలకు బయటకు తెచ్చింది. మళ్ళీ నేరాలు చేయమని వారితో ప్రమాణం చేయించింది. అక్కడే ఒక వ్యాపారి సొంత డబ్బు రూ. 1.73 లక్షలు కట్టి 21 మంది ఖైదీలకు విముక్తి ప్రసాదించాడు. ఇలా ఓ వైపు మానవతావాదులు వీరికి సహకరిస్తున్న వార్తలు ఉన్నాయి.

రూ. 2 లక్షలు జరిమానా చెల్లించలేని వ్యక్తి శిక్షాకాలం పూర్తి అయినా అతన్ని గత ఆరేళ్లుగా జైల్లోనే ఉంచుకోవడాన్ని ఈ మధ్య మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. ఆయన కుటుంబానికి ఆస్తులుండి కూడా ఉద్దేశపూర్వకంగా చెల్లించనిచో చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు. కానీ నిజంగానే అంతటి ఆర్థిక స్తోమత లేనివారిని జైల్లో నిర్బంధించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు క్రూర ఉల్లంఘన కిందికే వస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఇలా కోర్టుల ద్వారా, ప్రజా సంఘాల ద్వారా వస్తున్న ఒత్తిడిని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై ఆలోచనలో చేసింది. శిక్షా కాలం పూర్తయినా జరిమానా చెల్లించలేని, బెయిల్ కోసం డబ్బులు జమానతు పెట్టలేని వారి కోసం గత ఏడాది బడ్జెట్‌లో కొంత కేటాయింపు చేసింది. గత ఏడాది ఏప్రిల్‌లో కోర్టు తీర్పు ప్రకారం జరిమానా చెల్లించలేని పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి కేంద్ర హోం శాఖ విధివిధానాల రూపకల్పన చేసింది. తమ జైళ్లలో ఇలా మగ్గుతున్నవారి వివరాలు సేకరించాలని రాష్ట్రాలకు తెలియజేసింది.

వారి కోసం కేంద్రం ద్వారా లభించే నిధులకు ఆయా కోర్టు ఆధీనంలో పనిచేసే జిల్లా న్యాయ సేవల సంస్థ ద్వారా అందించాలని సూచించింది. చిన్న మొత్తాలను సైతం బెయిల్ కోసం పూచికత్తు ఇవ్వలేని వారికి కూడా ఆర్థికంగా సాయపడి వారిని విడుదల చేసేలా చూడాలని కూడా ఈ ప్రత్యేక పథకంలో ఉంది. ఈ లెక్కన ఖైదీల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా విచారణ ఖైదీకి రూ. 40 వేలు, శిక్ష పడిన వారికి రూ. 25 వేలు మంజూరు చేస్తారు. దీని వల్ల వేల సంఖ్య లో ఉన్న ఇలాంటి వారితో కిక్కిరిసిపోయిన జైళ్ల పరిస్థితికి కూడా కొంత ఉపశమనం లభిస్తుంది. మహారాష్ట్రలోని 67 జైళ్లలో ఉన్న 37 వేల ఖైదీల్లో 27 వేల మంది విచారణ ఖైదీలే కావడం గమనార్హం. కరోనా కాలంలో శిక్షాకాలం పూర్తయి జరిమానా చెల్లించలేక జైళ్లలో కొనసాగుతున్నవారిని విడుదల చేయమని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి. అయితే ఆ లెక్కలు తీయలేక ఆ ఆదేశాలు పూర్తిగా అమలు కాలేదు.

నిజానికి ఒక వ్యక్తి చేసిన నేరానికి జైలు శిక్షతో పాటు జరిమానా ఎందుకు విధించాలి అనేది కూడా చర్చనీయాంశమే. నేరస్థుడి వల్ల బాధితుడికి జరిగిన నష్టాన్ని పూడ్చడానికి నేరగాడే బాధ్యత వహించాలనేది జరిమానాకు అసలైన ఉద్దేశం. తప్పుకు శిక్షతో పాటు బాధితుడికి చికిత్స ఖర్చుల కోసమో, వాహనానికి మరమ్మత్తుల కోసమో నేరానికి పాల్పడ్డవాడే భరించాలనేది ఒప్పుకొనే మాటే. అలాగే చిన్న చిన్న చట్ట ఉల్లంఘనులను జైలుకు పంపే బదులు జరిమానాతో వదిలేస్తే ఉభయులకు మేలు జరుగుతుంది. ఈ విధంగా జరిమానాకు ఒక అర్థముంది.

అయితే రైలు గొలుసు లాగినవాడికి రెండు శిక్షలు వేయడం అన్యాయమే. వేయి రూపాయల జరిమానా తక్షణం వసూలు చేయవచ్చు లేదా డబ్బులు లేనివాడినైతే ఆ తప్పు మళ్ళీ చేయొద్దని బుద్ధి వచ్చేలా జైలుకు పంపవచ్చు. రెండు వేయడం వల్ల ఆ వ్యక్తి జరిమానా కట్టని కారణంగా జైల్లో కొనసాగడంతో జైలుకు ఆయన భారమే తప్ప మరే ప్రయోజనం లేదు. అంతేకాకుండా ఆయనపై జైలు చేసే వ్యయం జరిమానాను మించిపోతుంది కూడా. అయితే ఈ అభాగ్యుల విడుదల కోసం కేంద్రం ఇచ్చే నిధుల వినియోగం విషయంలో రాష్ట్రాల నుండి రావలసినంత కదలిక మాత్రం లేదనాలి. ఒక కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన అర్హుల జాబితా పంపమని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను పదే పదే కోరినా స్పందిస్తున్న రాష్ట్రాలు తక్కువే. రాష్ట్ర పౌరుల స్వేచ్ఛతో పాటు, జైళ్ల భారాన్ని తగ్గించడానికి ఈ దిశగా రాష్ట్రాల తక్షణ చర్యలు అవసరం.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News