Saturday, January 18, 2025

ఓటు హక్కు లేని విచారణ ఖైదీలు

- Advertisement -
- Advertisement -

ఇంకా నేరం రుజువు కాకుండా, న్యాయమూర్తి శిక్ష వేయకుండా జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నవారికి మన చట్టాలు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఈయడం లేదు. 2019 లోక్‌సభ ఎన్నికలలో దాదాపు 90 కోట్ల మంది భారతీయ పౌరులు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వారిలో సుమారు ఐదు లక్షల మందికి ఓటు వేసే అవకాశం లభించలేదు. కారణం వారు జైళ్లలో బందీలుగా ఉన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 62(5) ప్రకారం జైలు శిక్ష అనుభవిస్తున్నవారు, విచారణ ఖైదీలు, చట్టబద్ధమైన కస్టడీలో ఉన్నవారు ఎన్నికలలో ఓటు వేయకూడదు. ఇలా దేశంలో ఐదు లక్షల మంది ఓటు హక్కు హరించడం వల్ల ఎన్నికల ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. గ్రామాల్లో వార్డు స్థాయి ఎన్నికల్లో ఈ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.

ఎన్నికలకు రెండు రోజుల ముందు ఏదో ఫిర్యాదుపై పది మందిని జైలుకు పంపితే వారి ఓట్లు పడక గెలుపోటములు మారిపోవచ్చు. విచిత్రమేమిటంటే బెయిల్‌పై ఉన్నవారు మాత్రం ఓటు వేయవచ్చు. మన జైళ్లలో విచారణ ఖైదీలే 80% ఉన్నారు. కాబట్టి ఓటు హక్కు విషయంలో శిక్ష పడ్డవారిని, విచారణ ఖైదీలను విడిగా చూడవలసిన అవసరం ఉంది. దోషిగా తేలిన వ్యక్తి బెయిల్‌పై బయట ఉంటే ఓటు వేయగలిగితే, కోర్టు ద్వారా నేరానికి పాల్పడినట్లు ఇంకా నిర్ధారణ కాని వ్యక్తి హక్కు మాత్రం నిరాకరించబడుతోంది. ఎన్నికల చట్టంలోని ఈ నిబంధనను సవాలు చేస్తూ కొంద రు కోర్టును ఆశ్రయించారు. అయినా కోర్టు, ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. 1997లో ఖైదీలకు ఓటు హక్కును కోరుతూ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరిస్తూ, అటువంటి నిషేధం ఎందుకు అనే దానికి కొన్ని కారణాలను తెలిపింది. జైలులోని ప్రతి వ్యక్తి ఓటు వేయడానికి భద్రతా ఏర్పాట్ల కోసం పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అవసరమవుతాయి. తన ప్రవర్తన ఫలితంగా జైలులో ఉన్న వ్యక్తి సమాన స్వేచ్ఛను పొందలేడు. నేర నేపథ్యం ఉన్న వ్యక్తులను ఓటు హక్కుకు దూరంగా ఉంచడం సామాజిక అవసరం అని సుప్రీం పేర్కొంది.

ఏప్రిల్ 2019లో ముగ్గురు న్యాయ విద్యార్థులు ఖైదీలకు ఓటు వేసే హక్కు, ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951కి సవరణలు కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు. మన దేశంలో నేర, న్యాయ వ్యవస్థ స్థితిగతులను పునఃపరిశీలించడం చాలా ముఖ్యం. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పౌరులుగా తీర్చిదిద్ది తిరిగి సమాజానికి అందించే లక్ష్యంగా ఉన్న సంస్కరణాత్మక వ్యవస్థలో ఓటు హక్కు ఒక భాగం అని వారు సుప్రీంను కోరారు. ఫిబ్రవరి 2022 లో ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అది శాసన నిర్ణయమని, అందులో కోర్టు జోక్యం కలిగించుకోలేదని పేర్కొంది. అక్టోబర్ 2022 లో దాఖలైన మరో పిటిషన్ ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 62(5)లోని చట్టబద్ధతని పరిశీలించేందుకు సుప్రీం అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు నోటీసు పంపి వాటి అభిప్రాయాన్ని కోరింది. ఆ తరవాతే పిల్ విచారణకు చేపట్టనుంది.

ప్రజాస్వామ్యంలో ఓటు పౌరుడికి ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. దేశంలోని పరిస్థితులపై, సమస్యలపై మాట్లాడటానికి పౌరులకు అరుదైన అవకాశాన్ని ఎన్నికలిస్తాయి. జైలు ఖైదీలుగా వారి డిమాండ్ల కోసం ప్రచారం చేసే అవకాశం కూడా ఈ సందర్భంగా లభిస్తుంది. ఓటు హక్కును నిరాకరించడం ఖైదీని సమాజానికి మరింత దూరం చేయడమే అవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోల్లో జైలు పరిస్థితులు లేదా చట్టాల మెరుగుదలకు సంబంధించి వాగ్దానాలు కూడా ఉండాలి. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే చట్టాలు వివిధ ప్రభుత్వాలతో రూపొందించబడ్డాయి, అవసరమైతే మార్చబడతాయి. హక్కులు మాత్రం ప్రాథమికమైనవి, స్థిరమైనవి. అందువల్ల ఓటు హక్కులాంటి ప్రాథమిక హక్కు వ్యక్తి జైలు శిక్ష లేదా శిక్షా స్థితిపై ఆధారపడి ఉండకూడదు.

ఖైదీల ఓటు హక్కును నిషేధించిన అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. 2018లో అమెరికాలోని ఖైదీలు దేశ వ్యాప్త సమ్మె జరిపి ప్రధాన డిమాండుగా ఓటు హక్కును సాధించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని నేరం, శిక్షలవారీగా విభజించి వారికి ఓటు హక్కు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఐరోపా, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, నార్వే, డెన్మార్క్, ఐర్లాండ్, స్పెయిన్‌లలో ఖైదీల ఓటింగ్‌ను ఇప్పటికే అనుమతించారు. రోమానియా, ఐస్‌లాండ్, నెదర్లాండ్స్, స్లోవేకియా, లక్సెంబర్గ్, సైప్రస్, జర్మనీ వంటి దేశాల్లో ఓటింగ్ అనుమతించబడుతుంది కాని అది శిక్షా కాలం తదితర షరతులకు లోబడి ఉంటుంది. నేర తీవ్రతను బట్టి ఓటు నిరాకరణను అదనపు పెనాల్టీగా వారి హక్కును రద్దు చేస్తారు. బల్గేరియా పదేళ్ల కంటే తక్కువ శిక్ష పడినవారిని ఓటు వేయడానికి అనుమతిస్తుంది. ఆస్ట్రేలియాలో ఈ పరిమితి ఐదు సంవత్సరాలు ఉంది.

2006లో ఐరిష్ ప్రభుత్వం తన ఖైదీలందరికీ ఓటు వేసే హక్కును ఇచ్చింది. ఖైదీలతో సహా పౌరులందరికీ ఓటు హక్కు కల్పించే అత్యుత్తమ పౌర హక్కుల అమలు ద్వారా ఐర్లాండ్ తన మానవ హక్కులకు కట్టుబడి ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్, పాకిస్తాన్ వంటి దేశాలు ఖైదీలకు ఎన్నికలలో ఓటు వేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఆఫ్రికా దేశాలైన దక్షిణాఫ్రికా, ఘనా, కెన్యా, బోట్స్వానా కూడా తమ ఖైదీలకు ఎన్నికలలో ఓటు హక్కును అందిస్తున్నాయి. అయితే దోషులుగా నిర్ధారించబడిన ఖైదీలపై నిషేధం ఉంటుంది. ఫ్రాన్స్ లో ఎన్నికలలో ఖైదీలు ఓటు వేయడానికి ఎటువంటి నిషేధం లేదు. ఇలా చాలా దేశాల్లో కొన్ని పరిమితులకు లోబడి విచారణ ఖైదీలే కాదు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా ఇతర పౌరుల వలె ఓటు వేయడానికి అర్హులు. చట్టాన్ని ఉల్లంఘించినట్లు ఇంకా రుజువు కాని అండర్ ట్రయల్, నిర్బంధ ఖైదీలను నిర్దోషులుగా పరిగణించాలని, వారి హక్కులకు భంగం కలిగించరాదనే ఏకాభిప్రాయం చాలా దేశాల్లో ఉంది.

మన దేశంలో విచారణ ఖైదీల ఓటు హక్కు విషయంలో ప్రజాస్వామ్యవాదులు కోర్టు తలుపులు పదే పదే తట్టడం తప్ప పరిష్కారం దిశగా ఒక్క అడుగు పడడంలేదు. న్యాయస్థానాల పరిధి దృష్ట్యా అవి ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేదు. కోర్టు నోటీసులు పంపినా కేంద్ర విభాగాల నుండి తగిన స్పందన రావడం లేదు. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి నుండే ఓటేసే అవకాశం కొత్తగా కల్పించారు. ఎన్నిక విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ విధానం ఉంది. వీటిని పాటిస్తే పోలింగ్ స్టేషన్ దాకా తరలించేందుకు భద్రతా ఏర్పాట్ల కోసం పోలీసు సిబ్బంది సరిపోదు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. నిజాయితీగా ఓటింగ్ జరగడమంటే యోగ్యులైన పౌరులందరికీ తమ హక్కును వినియోగించుకొనే అవకాశం ఈయడమే అని శాసనకర్తలు గ్రహించాలి. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 62(5) చట్ట సవరణపై తక్షణం దృష్టి సారించాలి.

బి.నర్సన్
9440128169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News