Monday, December 23, 2024

విచారణలోని ఖైదీలు

- Advertisement -
- Advertisement -

ఆలస్యంగా జరిగిన న్యాయాన్ని జరగని న్యాయంగా పరిగణించాల్సిందేనన్న అనుభవ వాక్యం తెలిసిందే. ఈ దృష్టితో చూసినప్పుడు భారత దేశంలో సాధారణ జనానికి న్యాయం అందుబాటులో లేదనే చెప్పాలి. ఏళ్ళ తరబడి విచారణ ఖైదీలుగా వున్న తర్వాత వారు నిర్దోషులని న్యాయ స్థానంలో తేలిన సందర్భాలున్నాయి. అటువంటి కేసుల్లో ఆ వ్యక్తులు తమ జీవితాలను పూర్తిగా కోల్పోయినట్టే అవుతుంది. దేశంలోని వివిధ స్థాయిల న్యాయస్థానాల్లో అపరిష్కృతంగా వున్న కేసుల సంఖ్య 5 కోట్లు దాటిపోయిందన్న చేదు వాస్తవం ఏమి చెబుతోంది? ఈ కేసులు విచారణలో వుండగానే జైలు జీవితం అనుభవిస్తున్న వారిలో ఎవరు దోషులో, ఎవరు కారో ఎలా తెలుస్తుంది? వీరికి న్యాయం ఎండమావివంటిదేనని అనడం వాస్తవ దూరం కాబోదు కదా!

5 కోట్లకు మించిన పెండింగ్ కేసుల్లో 4 కోట్ల 40 లక్షలు కింది కోర్టుల్లోనే వున్నాయి. 25 హైకోర్టుల్లో 60 లక్షల 6 వేల కేసులు, సుప్రీంకోర్టులో 69,766 కేసులు చెదలు పడుతున్నాయని కేంద్ర ప్రభుత్వం గురువారం నాడు పార్లమెంటులో ఒక సభ్యుని ప్రశ్నకు సమాధానంగా తెలియజేసింది. 2022 మే నెల నాటికి మొత్తం పెండింగ్ కేసుల సంఖ్య 4 కోట్ల 70 లక్షలని, అందులో 87.4% కేసులు కింది కోర్టుల్లో, 12.4% హైకోర్టుల్లో పెండింగ్‌లో వుండగా, దాదాపు లక్ష 82 వేల కేసులు 30 ఏళ్ళుగా మూలనపడి వున్నాయని అప్పట్లో వచ్చిన సమాచారం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా కింది కోర్టుల్లో 5388 న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా వున్నాయి. అలాగే హైకోర్టుల్లో 330 జడ్జి పోస్టులు భర్తీ కాకుండా వున్నాయి. కేసులు పెండింగ్‌లో వుండడం వల్ల వాటిల్లో ముద్దాయిలుగా పేర్కొన్న వ్యక్తులు విచారణలోని ఖైదీలుగా మన దేశంలో ఊచలు లెక్కబెడుతున్నారు. ఇతర కొన్ని దేశాల్లో మాదిరిగా విచారణలోని వారిని స్వేచ్ఛగా తిరగనిచ్చే ప్రజాస్వామిక సంప్రదాయం మన వద్ద లేదు.

పెండింగ్ కేసుల సమస్య కొత్తగా ఇప్పుడు వచ్చింది కాదు. 1975 జనవరి 1 నాటికి దేశంలోని మొత్తం ఖైదీల్లో విచారణలోని వారు 57.6% వరకు వుంటారని 1979లో లా కమిషన్ వెల్లడించింది. జైళ్ళు ప్రాథమికంగా శిక్షలు పడిన వారి కోసమే వున్నాయని, విచారణలోని వారి కోసం కాదని అప్పుడు ఆ కమిషన్ వ్యాఖ్యానించింది. ఆ వ్యక్తి దోషి అవునో, కాదో తేలకుండా జైల్లో తోయడం దమన నీతి కిందే వస్తుంది. పోలీసులు అశాస్త్రీయమైన పద్ధతుల్లో వ్యవహరించి ఎవరిని బడితే వారిని అరెస్టు చేస్తే వారు జైలుకు వెళ్ళడం ఎంత మాత్రం సమంజసం కాదు. పెండింగ్ కేసుల్లో 50% ప్రభుత్వాలు దాఖలు చేసినవేనని బయటపడింది. దేశంలోని ప్రతి 10 మంది ఖైదీలలో కేవలం ఇద్దరే శిక్ష పడిన వారని వెల్లడైంది. అంటే దోషులవునో కాదో తెలియని వారు అత్యధిక సంఖ్యలో జైళ్ళను ఆక్రమించి వున్నారని అర్థమవుతున్నది. దీని వల్ల జైళల్లో చోటు చాలకపోడం, ఇతర సౌకర్యాలు తగినంతగా లేకపోడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. జైళ్ళ గదులు కిక్కిరిసిపోతున్నాయి. పెండింగ్‌లోని కేసులను తిరిగి సమీక్షించి అందులో తీవ్రమైనవి కాని వాటిని మినహాయించి విచారణలో వున్న వాటికి సంబంధించిన ఖైదీలను విడిచిపెట్టవచ్చు. వారి కేసులు పరిష్కారమై వారు దోషులని తేలిన తర్వాత లేదా అంతకు కొద్ది రోజుల ముందు వారిని తిరిగి జైళ్ళకు రప్పించవచ్చు.

దేశ వ్యాప్తంగా జైళల్లో 5 లక్షల 54 వేల 34 మంది ఖైదీలు వున్నారు. వీరిలో 77.1% మంది విచారణలోని ఖైదీలు కాగా మిగతా వారు శిక్షలు పడినవారు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో విచారణలోని ఖైదీలు కలిగిన దేశాల్లో ఇండియా ఆరవది. మన తర్వాత వున్న దేశాలు చాలా చిన్నవి. అవి లీచ్‌టెన్ స్టీన్, శాన్‌మారినో, హైతీ, గాబన్, బంగ్లాదేశ్. లిటిగెంట్లు వాయిదాల అవకాశాన్ని నిరంతరం వాడుకొంటూనే వుంటారు. అందుకే ఒక్కో కేసులో తీర్పు ఎన్ని రోజుల్లో వెలువడాలో ముందుగానే నిర్ణయించాలనే ఒక సూచన ముందుకొచ్చింది. దాని వల్ల ముద్దాయిలు తాము నిర్దోషులమని నిరూపించుకోడానికి తగిన వ్యవధిని ఇవ్వకపోయే ప్రమాదం వుంది. శిక్ష పడే వరకు విచారణలోని ఖైదీలకు స్వేచ్ఛను ఇవ్వకపోడం, కోర్టుల్లో కేసులు ఎప్పటికీ పరిష్కారం కాకపోడం మానవ హక్కుల ఉల్లంఘనలేనని హ్యూమన్ రైట్స్ వాచ్ స్పష్టం చేసింది. ఈ రెండూ కలిసి న్యాయానికి విఘాతం కలిగిస్తున్నాయని తెలియజేసింది. అలాగే కోర్టుల్లో కేసులు వేయడానికి తగిన డబ్బులేక అసంఖ్యాక ముద్దాయిలు జైల్లో మగ్గుతున్నారు. విచారణ ఖైదీల్లో కింది వర్గాలకు చెందిన పేదలు అత్యధిక సంఖ్యలో వున్నారనేది కాదనలేని చేదు వాస్తవం. ఎందుకంటే నేరం జరగగానే పోలీసుల, ఉన్నతవర్గ సమాజ దృష్టి పేదల మీదనే పడుతుంది. మొత్తం విచారణలోని ఖైదీల్లో 66% మంది ఎస్‌సి, ఎస్‌టిలు తదితర అణగారిన వర్గాలవారే. దేశంలో సామాజిక వివక్ష, పేదరికం పోనంత వరకు ఈ దుస్థితి ఇలాగే కొనసాగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News