Thursday, January 9, 2025

పృథ్వీషా కెరీర్…. ప్రశ్నార్థకం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం: ఎంతో భవిష్యత్తు ఉన్న భారత యువ క్రికెటర్ పృథ్వీషా తన కెరీర్‌ను చేజేతులా నాశనం చేసుకున్నాడు. చిన్న వయసులో అసాధారణ ఆటతో టీమిండియాలో చోటు సంపాదించుకున్న పృథ్వీషా కెరీర్‌ను సాఫీగా సాగించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఐపిఎల్‌లో అద్భుత బ్యాటర్‌గా షా పేరు తెచ్చుకున్నాడు. సుదీర్ఘ కాలం పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన షా విధ్వంసక బ్యాటింగ్‌తో ఢిల్లీకి ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు. అంతేగాక ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ సాధించి అత్యంత అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కెరీర్ ఆరంభంలో పృథ్వీ టీమిండియా ఆశాకిరణంగా కనిపించాడు.

అతని ఆట కూడా అలాగే సాగింది. అతని బ్యాటింగ్‌ను దగ్గరుండి గమనించిన విశ్లేషకులు షాను భవిష్యత్తు సచిన్‌గా అభివర్ణించారు. చూడచక్కని బ్యాటింగ్‌కు మరో పేరుగా నిలిచిన పృథ్వీషా అతి స్వల్ప వ్యవధిలోనే స్టార్ క్రికెటర్‌గా ఎదిగాడు. టీమిండియాతో పాటు ఐపిఎల్‌లో అగ్రశ్రేణి ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అంతేగాక అతని సారథ్యంలో భారత్ అండర్19 ప్రపంచ కప్ ట్రోఫీ కూడా నిలిచిపోయింది. దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిథ్యం వహించిన పృథ్వీషా ఆరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో అలరించాడు. అంతేగాక తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే శతకం సాధించి సత్తా చాటాడు. పాఠశాల స్థాయి క్రికెట్‌లో ఏకంగా ఒకే ఇన్నింగ్స్‌లో 500కి పైగా పరుగులు సాధించి నయా చరిత్రను లిఖించాడు. ఇలా ఎన్నో అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్న పృథ్వీషా కెరీర్ చరమంకానికి చేరిందనే చెప్పాలి.

వివాదాలతో సహవాసం..

చిన్న వయసులో పేరు, ప్రఖ్యాతలతో పాటు విపరీతమైన డబ్బులు వచ్చిపడడంతో పృథ్వీషా దారి తప్పాడు. సహచర క్రికెటర్లు కెరీర్‌పై దృష్టి పెట్టగా అతను మాత్రం ఇతర వ్యసనల్లో మునిగి తేలాడు. పబ్బులు, షికార్లపై ఆసక్తి చూపిస్తూ కెరీర్‌ను నిర్లక్షం చేశాడు. ఐపిఎల్‌తో పాటు దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో పలు అవకాశాలు లభించినా దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోయాడు. ఆటపై కంటే ఇతర అంశాలపై దృష్టి పెట్టాడు. తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ అందరిలో పలచన అయ్యాడు. చివరికి డోపింగ్ వంటి ఆరోపణల్లో కూడా చిక్కుకుని బిసిసిఐ నిషేధానికి గురయ్యాడు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న క్రికెటర్ పృథ్వీషా తనంతట తానే కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. అతనికి ఎన్నో అవకాశాలు కల్పించిన ఐపిఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్, సొంత టీమ్ ముంబై కూడా విసుగెత్తి అతన్ని పట్టించుకోవడం మానేశాయి. ఢిల్లీ ఫ్రాంచైజీ పృథ్వీని వదులుకుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా పృథ్వీషా అవకాశం కల్పించేందుకు ఆసక్తి చూపించలేదు.

తాజాగా జరిగిన ఐపిఎల్ మెగా వేలం పాటలో పృథ్వీషా కొనేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాలేదు. దీంతో పృథ్వీషా కెరీర్ ప్రశ్రార్ధకంగా మారింది. భవిష్యత్తులోనైనా అతనికి అవకాశాలు లభిస్తాయ లేదా అనేది సందేహంగా తయారైంది. ఇప్పటికైనా పృథ్వీషా తన పద్ధతిని మార్చుకుని ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారిస్తే రానున్న రోజుల్లోనైనా ఏమైనా అవకాశాలు లభించవచ్చు. కానీ ప్రస్తుతం అతను ఉన్న స్థితిలో ఇది చాలా కష్టంతో కూడుకున్న అంశంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన పృథ్వీషా అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాలో చోటు సంపాదించాడు. ఎంత వేగంగా కెరీర్‌లో పైకి ఎదిగాడో అంత కంటే వేగంగా పతానవస్థకు చేరుకున్నాడు. కాగా, పృథ్వీషా కెరీర్‌లో ఐదు టెస్టులు, ఆరు వన్డేలు, మరో టి20 మ్యాచ్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఐపిఎల్‌లో 79 మ్యాచ్‌లు ఆడాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News